బ్యాలెన్స్! అచ్యుతుని రాజ్యశ్రీ
 బుద్ధ భగవానుడు తన శిష్యులతో కల్సి రాజగృహంవైపు సాగిపోతున్నాడు.అకస్మాత్తుగా దారికి అడ్డంగా గొర్రెల మంద వచ్చింది. ఆగొర్రెలకాపరి భుజం పై చిన్నారి గొర్రెపిల్ల ఉంది. "స్వామీ! దీని కాలికి దెబ్బ తగిలింది. అందుకే ఎత్తుకున్నాను." బుద్ధుడు ఆప్యాయంగా  తనచేతితో దాని కాలిని స్పృశించాడు.అది హాయిగా నిద్రలోకి ఒరిగింది. తథాగతుని కనులవెంట నీరు! అదిచూసి ఆకాపరి అన్నాడు " దీని కాలిదెబ్బకే మీరు ఇంతగా బాధపడుతున్నారు.ఈగొర్రెలన్నీ రేపు బలికాబోతున్నాయి." బుద్ధుడు ఉలిక్కిపడ్డాడు.ఆకాపరి చెప్పుకుపోతున్నాడు"రాజు అజాతశత్రువు తన తండ్రిని  చంపి సింహాసనం ఎక్కాడు. ఆపాప పరిహారార్ధం యజ్ఞం చేసి వెయ్యి జీవాల్ని బలిచేయబోతున్నాడు." 
బుద్ధుడు సరాసరి రాజప్రాసాదానికి వెళ్లాడు.నలువైపులా మూగజీవాల్ని చంపటానికి కత్తులతో సిద్ధంగా ఉన్నారు. అజాతశత్రువు బుద్ధునికి స్వాగతం పలికాడు. బుద్ధుడు ఇలా అన్నాడు "రాజన్! ఈగడ్డి పరకని ముక్కలుచేయి. ఈతుంపులను తిరిగి కలిపి గడ్డి పరకగా కలుపు. " రాజు ఆశ్చర్యంగా అడిగాడు "భగవాన్!తుంచటం సాధ్యం! కలపటం అసాధ్యం!"
"ఇదే నేను నీకు చెప్పదల్చుకున్నాను రాజా! నీవు తుంచి ముక్కలుచేసిన గడ్డిపరకను ఎలా అతకలేవో అలాగే పాపాలు చేసిన నీవు  ఎన్ని మూగజీవాల్ని బలిచేసినా పుణ్యం పొందలేవు.పైగా జీవహింసతో ఇంకా నీపాపం పెరుగుతుంది. కావాలంటే నన్ను బలి ఇచ్చి  ఈ పశువుల్ని విడిచి పెట్టు." బుద్ధుడి బోధనలతో అజాతశత్రువు హింసను వీడాడు.జంతుబలి ఆగిపోయింది.
ఎలాగైతే మనం బ్యాంక్ లో డబ్బు వేస్తామో అలాగే పాప పుణ్యాలు ఉండిపోతాయి.ఒకపాపం చేసి పది పరిహారాలతో అది పోయి పుణ్యం లభిస్తుంది అనుకోటం భ్రమ! నిష్కామంగా మంచినే చేస్తూ ఒకరికి అపకారం చేయకుండా ఉంటే చాలు.ఆత్మ శుద్ధి చిత్తశుద్ధి ఉంటే చాలు. ఏమతం చెప్పినా అదే! కానీ అసలు అర్థం చేసుకోకుండా ఓపక్క అన్యాయం అక్రమాలు చేస్తూ  మోక్షం వస్తుంది  పాపాలు పోతాయి అన్నది భ్రమ! దేని బ్యాలెన్స్ దానిదే సుమా🌷

కామెంట్‌లు