మేకపోతు గాంభీర్యం (జాతీయం వెనుక కథ)-డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032112)

 కొందరు పైకి గంభీరంగా ఏ ఆపద వచ్చినా తనకు ఏమీ కానట్లుగా, కొంచం గూడా భయం లేనట్లుగా ప్రవర్తిస్తూ వుంటారు. కానీ లోపల మాత్రం భయంతో ఎప్పుడు ఏమయితాదో ఏమో అని వణికి పోతూంటారు. వీళ్ళను చూసే వేమన
"మేడి పండు చూడ మేలిమై యుండును 
పొట్టవిప్పి చూడ పురుగులుండు 
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ" అని పద్యం చెప్పారు. మేడిపండు చూడ్డానికి అందంగా, గుండ్రంగా, నున్నగా మిలమిలలాడుతూ మెరిసిపోతా వుంటుంది.
కానీ దాని లోపల చూస్తే చిన్న చిన్న ఈగలు అనేకం వుంటాయి. అవి బైటకి కనబడవు. అలాగే పిరికివాళ్ళు లోపల ఎంత భయమున్నా అది బైటకు కనబడనీయకుండా గంభీరంగా కనబడడానికి ప్రయత్నిస్తుంటారు అని ఈ పద్యం అర్థం. మనలో చాలా మంది ఇలాంటి వాళ్ళే.
ఇంతకూ ఈ జాతీయం ఎలా వచ్చిందో, దాని వెనుక వున్న కథ ఏమో తెలుసుకోండి.
ఒక వూరిలో ఒక మేకల మంద వుండేది. అందులో ఒక మేకపోతు బాగా లావుగా, ఎత్తుగా, అందమైన కొమ్ములతో, మూతికింద గడ్డంతో చూడ్డానికి భలే అందంగా గంభీరంగా వుండేది. దాని యజమాని దానిని మిగతా మేకలతో బాటు రోజూ పక్కనే వున్న అడవిలోనికి పొద్దున్నే తీసుకెళ్ళేవాడు. బాగా మేసినాక సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకొని వచ్చేవాడు.
ఒక రోజు ఆ మేకపోతు పచ్చని ఆకుకోసం వెదుక్కుంటా వెదుక్కుంటా చానా దూరం పోయింది. తిరిగి వద్దామంటే మంద ఎక్కడుందో తెలీలేదు. దాంతో దారి తప్పి అడవి బైటకు రావాల్సింది కాస్తా సక్కగా అడవిలోకి పోయింది. తిరిగి తిరిగి అలసిపోయింది. దానికి ఒకటే భయం. అడవిలో సింహాలు, పులులు, తోడేళ్ళు వుంటాయి గదా. పొరపాటున వాటి కంటపడితే అంతే. కమ్మగా చప్పరించేస్తాయి. దాంతో అది గజగజగజ ఒణుక్కుంటా అటు ఇటూ చూస్తా ఒక్కొక్క అడుగే జాగ్రత్తగా వేయసాగింది.
అంతలో దానికి ఒక సింహం ఎదురయింది. దాన్ని చూడగానే పై ప్రాణాలు పైన్నే పోయాయి. నోట మాట రాక ఎక్కడిదక్కడ ఆగిపోయింది. సింహం ఆ మేకపోతును చూసింది... అది అంతకుముందు చిన్న చిన్న మేకల్ని చూసింది గానీ అంత పెద్ద మేకపోతును ఎప్పుడూ చూల్లేదు. అదీ గాక దానికి పెద్దగా గడ్డం పెరిగి వుంది. అట్లా గడ్డమున్న మేకపోతును చూడ్డం అదే మొదటిసారి.
దాంతో సింహం కొంచెం అనుమానంగా "ఎవరు నువ్వు... చూడ్డానికి మేకలాగే వున్నావు గానీ మేక కంటే చానా పెద్దగా వున్నావు. అదీగాక గడ్డం పెంచుతా వున్నావు. ఎందుకు" అనింది.
సింహం మాటలతో మేకపోతుకు పక్కడలేని ధైర్యం వచ్చింది. ఇదేదో తెలివి తక్కువ దాని మాదిరుంది. ఎట్లాగైనా సరే దీన్నించి తప్పించుకొని బైటపడాలని "నేను మేకలకు రాజును. ఈ అడవిలో ఇరవై ఏనుగులను, పది పెద్ద పులులను, ఒక్క సింహాన్ని చంపుతానని... అలా చంపేంత వరకు గడ్డం తీయనని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పటికే ఇరవై ఏనుగులను, పది పెద్ద పులులను నా కొమ్ములతో కుమ్మి కుమ్మి చంపాను. ఇంక సింహమొక్కటే మిగిలింది. కానీ నేనింత వరకు సింహం ఎలా వుంటుందో చూడలేదు. దాంతో ఈ అడవిలో అదెక్కడుంటాదో కనుక్కోలేకుంటున్నా. నీకేమైనా సింహం ఎలా వుంటాదో ఎక్కడుంటాదో తెలుసా... దాన్నొక్కదాన్ని చంపితే ఈ గడ్డం తీసేయొచ్చు" అనింది గంభీరంగా.
ఆ మాటలకు సింహం అదిరిపోయింది. “అమ్మో... దీనికి నేను సింహాన్ని అని తెలిస్తే ఇంకేమన్నా వుందా.. ఇక్కడికిక్కడే చంపి పాడేస్తాది" అని బెదపడి ఒణుక్కుంటా "ఏమో... సింహాన్ని నేను గూడా ఎప్పుడూ ఈ అడవిలో చూడలేదు... నాకు తెలిసి ఈ అడవిలో సింహాలు కూడా అస్సలు లేవు. అదిగో దూరంగా కొండలు కనబడుతున్నాయి చూడు అక్కడ ఇంకో అడవి ఉంది. ఆ అడవిలో ఏమైనా వుంటాయేమో. అక్కడికి పో" అంటూ గిరుక్కున తిరిగి వెనక్కు తిరిగి చూడకుండా పారిపోయింది.
సింహం అలా పారిపోయిన మరుక్షణమే మేకపోతు గూడా వెనక్కి తిరిగి పరుగు అందుకొని చివరికి మందలో కలిసి 'హమ్మయ్య' అనుకొంది.
మేకపోతుకు లోపల ఎంత భయమున్నా దానిని సింహానికి కనబడనీయకుండా గంభీరంగా మాట్లాడి దాన్నే భయపెట్టగలిగింది గదా. అందుకే ఈ కథలోంచే "మేకపోతు గాంభీర్యం" అనే జాతీయం పుట్టింది.
**********

కామెంట్‌లు