ఇసుక తక్కెడ  పేడ తక్కెడ (జాతీయం వెనుక కథ ) - డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు

  ఎటువైపు చూసినా మోసమే వుండి అంతా లొసగులు అబద్దాలతో నిండిపోయి, ఏమీ అర్ధంగాక గందరగోళానికి గురయినప్పుడు... ఈ వ్యవహారమంతా ఇసుక తక్కెడ పేడతక్కెడలాగుందే అని అంటూ వుంటారు.
అసలు ఈ జాతీయం ఎలా వచ్చింది ఇసుక తక్కెడేంది, పేడతక్కెడేంది అని ఆరా తీస్తే మనకు ఒక గమ్మత్తయిన కథ కనబడుతుంది.
ఒక ఊరిలో ఇద్దరు దొంగలు వుండేవాళ్ళు. ఒకని ఇళ్ళేమో ఉత్తరం వైపు, మరొకని ఇళ్ళేమో దక్షిణం వైపు. వాడు దొంగని వీనికి తెలీదు. వీడు దొంగని వానికి తెలీదు. ఇద్దరూ ఎదుటి వాళ్ళను మాటలతో బోల్తా కొట్టించి మోసం చేయడంలో ఆరితేరినవాళ్లే.
ఒకసారి వాళ్ళలో ఒకడు ఒక కావడి తీసుకొని దానికి రెండువైపులా రెండు ఇసుక కుండలు పెట్టి, అవి కనబడకుండా చిరిగిపోయిన బట్టలు కట్టి భుజానికి తగిలిచ్చుకోని ఎవరిని మోసం చేద్దామా అని వెదుక్కుంటా పోసాగాడు.
సరిగ్గా అదే సమయానికి ఇంకొకడు కూడా ఒక కావడి తీసుకోని రెండు వైపులా రెండు పెండతో నింపిన కుండలు పెట్టి, అవి కనబడకుండా ఒక పాత మసిబట్ట కట్టి భుజానికి తగిలిచ్చుకోని మోసం చేయడానికి ఎవరు దొరుకుతారా అని వెదుక్కుంటా బైలు దేరాడు.
వాళ్ళిద్దరూ అనుకోకుండా ఒక సత్రం వద్ద కలుసుకున్నారు. వాని మొహం వీడు గానీ, వీని మొహం వాడు గానీ ఎప్పుడూ చూల్లేదు. దాంతో ఇద్దరూ ఎదుటోడు చాలా మంచోడు అని అనుకున్నారు. ఒకరితో ఒకరు మాటల్లో పడ్డారు.
మధ్యలో ఇసుక దొంగ "అనా.. .. అనా... ఎక్కడికి పోతావున్నావు. ఏముంది నీ కావడిలో అన్నాడు.
అప్పుడు వాడు. "ఆ... ఏం లేదు. నేను పెద్ద రత్నాల వ్యాపారిని. ఈ రెండు కుండలనిండా మేలు జాతి రత్నాలు వున్నాయి. దారిలో దొంగల భయం ఎక్కువ గదా... అందుకని కుండలకు పాత బట్టలు కట్టినాను. మా పాప పెళ్ళీడు కొచ్చింది. ఈ రత్నాలు అమ్మి బంగారం కొని పాపకు నగలు చేపియ్యాల" అన్నాడు.
ఆ మాటలు వినగానే ఇసుక దొంగ "అబ్బ... వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు వీడు కనబన్నాడు. ఎట్లాగయినా వీన్ని మోసం చేయాలి" అనుకున్నాడు.
అంతలో పేడ దొంగ "అవును... నువ్వేమి చేస్తా వుంటావు. నీ కుండల్లో ఏమున్నాయి" అన్నాడు. దానికా ఇసుక దొంగ చిరునవ్వుతో "అనా... నేను నీ లాగే వ్యాపారినే. కాకపోతే నగల వ్యాపారిని. మంచి మేలు జాతి రత్నాలు కొని వాటిని బంగారంలో పొదిగి విలువైన హారాలు తయారు చేసి అమ్ముతుంటాను. ఈ రెండు కుండలనిండా బంగారం వుంది. దాన్ని అమ్మి విలువయిన రత్నాలు కొనాలని పోతున్నాను" అన్నాడు.
ఆ మాటలినగానే పేడదొంగ "అబ్బ.... దొరికినాడురా కావలసినోడు. వీన్ని ఎట్లాగయినా మోసం చేసి వీని దగ్గరున్న బంగారం కొట్టేయ్యాలి" అనుకున్నాడు.
వెంటనే "అరెరే... మనిద్దరినీ ఆ దేవుడు ఒక్క చోట కావాలనే కలిపినట్టున్నాడు. నీకు కావలసిన బంగారం నా దగ్గరుంది. నాకు కావలసిన మేలు జాతి రత్నాలు నీ దగ్గరున్నాయి. మనం ఒకరి కావడి మరొకరు మార్చుకుంటే సరి" అన్నాడు. ఆ మాటలకు ఇసుకదొంగ లోపల్లోపల "పడిందిరా పిట్ట" అని నవ్వుకుంటా "అలాగే నువ్వెలా చెప్తే నేనలాగే" అన్నాడు.
నీ కావడిలో ఏముందో చూపించు అంటే అవతలి వాడు కూడా నీ కావడిలో ఏముందో నువ్వూ చూపించు అంటారు గదా... అందుకని ఇద్దరు గూడా మారు మాట్లాడకుండా.. ఎదుటివాన్ని మోసం చేస్తున్నాం అనుకుంటా సంబరంగా ఒకరి కావడి మరొకరు మార్చుకున్నారు.
మార్చుకున్నాక మరుక్షణం గూడా ఆలస్యం చేయకుండా ఇసుకదొంగ "అనా... జాగ్రత్త. దారిలో దొంగలుంటారు. నీ దగ్గరున్నది బంగారం అని తెలిస్తే అంతే.. చీకటి పడకముందే తొందరగా ఇంటికి చేరుకో” అన్నాడు.
దానికి వాడు "తమ్ముడూ నువ్వు కూడా రత్నాలను జాగ్రత్తగా ఇంటికి తీసుకొని పో" అంటూ వాడు బైలు దేరాడు.
ఇద్దరూ సంబరంగా పరుగు పరుగున ఇంటికి చేరుకొని కావడి మీద వున్న బట్ట తీసి చూస్తే ఇంకేముంది ఇసుక దొంగ చేతికి పేడ అంటుకుంది. పేడ దొంగ చేతికి ఇసుక వచ్చింది. "అమ్మో నేనే పెద్ద దొంగను అనుకుంటే, ఆవతలోడు నా కన్నా నాలుగాకులు ఎక్కువే చదివినట్లున్నాడే" అనుకుంటా ఇద్దరూ గమ్మున నోరుమూసుకున్నారు. ఇదీ కథ.
మిత్రులారా.. .కథ విన్నారుగా... ఈ కథ నుంచే అంతా మోసం అనే అర్థంలో... "ఇసుక తక్కెడ - పేడ తక్కెడ" అనే జాతీయం వచ్చింది.
**********

కామెంట్‌లు