వనదేవత వరం - సంయుక్త అక్షరాలు లేని కథ - పునః కథనం - డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు

  ఒక ఊరిలో ఒక రైతు వుండేవాడు. ఆయన చాలా పేదవాడు. మంచాలు చేసి బతికేవాడు. అతను పచ్చని చెట్టును కొట్టేవాడు కాదు. కేవలం ఎండిపోయిన చెట్టును కొట్టి ఆ చెక్కతో మంచాలు చేసేవాడు. ఎండిపోయిన చెట్టు కనబడకపోతే కడుపుకు అన్నం లేకపొయినా అలాగే ఉండేవాడే గానీ నియమం తప్పేవాడు గాదు. ఒకసారి అడవిలో ఎంతదూరం పోయినా ఒక్కటి గూడా ఎండిపోయిన చెట్టు కనబడలేదు. తిరిగి తిరిగీ బాగా అలసిపోయాడు. అలా మూడు రోజులు గడచిపోయాయి. కానీ ఎక్కడా ఎండిన చెట్టు కనబల్లేదు. మూడు రోజులనుండీ తిండి తినక పోవడంతో ఆకలితో అలాగే ఒకచోట పడిపోయాడు.
వనదేవత అది చూసింది. “చావడానికయినా సిద్ధపడుతున్నాడు గానీ, పచ్చని చెట్టు కొట్టడం లేదు. మనిషంటే ఇలా వుండాలి. ఇలాంటోళ్ళకు సాయం చేయని బతుకు బతుకే గాదు” అనుకొంది. వెంటనే పైనుండి రైతు ముందుకు దిగి వచ్చింది. వెంటనే రైతు మళ్ళీ ఇంతకు ముందు ఎలా ఉన్నాడో అలా అయిపోయాడు.
వనదేవత అతనికి ఒక చెట్టును చూపించి “అదిగో ఆ చెట్టును కొట్టి మంచం చేయి. ఎవరడిగినా “పదివేల వరహాలు చేతిలో పెట్టి తీసుకుపోండి. లేదంటే లేదు” అని చెప్పు. అలా ఇచ్చేటోనికే అమ్ము" అని చెప్పి మాయమైపోయింది.
రైతు వనదేవత చెప్పినట్టే ఆ చెట్టు కొట్టి ఒక అపురూపమయిన, అందమయిన మంచం తయారు చేసి బజారుకు తీసుకోని పోయాడు.
జనాలు ఆ మంచాన్ని చూసి 'ఎంత' అని అడిగితే “పదివేల బంగారు వరహాలు" అని చెప్పసాగాడు. అది విని జనం “నీకేమయినా పిచ్చి పట్టిందా... మంచమేంది... పదివేల బంగారు వరహాలేంది.... ఎవరయినా వింటే నవ్విపోతారు” అంటూ వెళ్ళిపోసాగారు.
రోజులు వారాలై, వారాలు నెలలైనాయి. కానీ మంచం ఎవరూ కొనలేదు. ఐనా రైతు కొంచంగూడా పట్టు విడవకుండా అలాగే ధర చెప్పసాగాడు. ఒకరోజు ఆ ఊరి రాజు వచ్చాడు. రైతు చెప్పిన ధర విని “ఎందుకింత ఎక్కువ చెబుతున్నావు” అని అడిగాడు. దానికి ఆ రైతు “దీని మీద ఒక్కరోజు పండుకోని చూడండి. మీకే తెలిసిపోతుంది” అన్నాడు.
"సరే" అని రాజు ఆ రైతు అడిగిన డబ్బులిచ్చి ఆ మంచం తీసుకొని పోయి దాని మీద పండుకున్నాడు. తెల్లవారే ముందు ఏవో మాటలు వినబడితే లేవకుండానే కళ్ళు తెరిచాడు. మంచం నాలుగు కోళ్ళు మాటలాడు కొంటున్నాయి.

ఒక కోడు "నేను తూరుపు దిక్కుకు పోయాను. కొందరు దొంగలు నగల అంగళ్ళలో పడి దొంగతనం చేసి ఆ నగలన్నీ వూరి బైట మర్రిచెట్టు కింద దాచి పెట్టారు” అని చెప్పింది.
రెండో మంచంకోడు "నేను పడమర దిక్కుకు పోయాను. అక్కడ ఒక పంచాయితీ జరుగుతూ వుంది. ఆ ఊరి అధికారి లంచం తీసుకోని ఒక యువకున్ని తప్పు చేయకున్నా జైలుపాలు చేశాడు” అని చెప్పింది.
మూడో మంచంకోడు “నేను ఉత్తరం దిక్కుకు పోయాను. కోటకు కాపలా కాయవలసిన సైనికులు కాపలా కాయకుండా నిదుర పోతావున్నారు. ఎవరయినా దాడి జరిపితే తట్టుకోవడం చాలా ఇబ్బందే" అని చెప్పింది.
నాలుగో మంచంకోడు "నేను దక్షిణం దిక్కుకు పోయాను. అక్కడ ఒక గొప్ప సంగీతకారున్ని చూచాను. అతనిలాగా పాటలు పాడేవారు ఎవరూ లేరు. కానీ అతను పేదవాడు కావడంతో రాజు దగ్గరికి రాకుండా మిగతా పండితులు అడ్డం పడుతున్నారు” అని చెప్పింది.
రాజు అవి చెప్పుకొనేవన్నీ విన్నాడు. తెల్లవారగానే ఆ మంచంకోళ్ళు మట్టసంగా ఎక్కడివక్కడ మాములుగా వుండిపోయాయి.
రాజు సైనికులను తీసుకోని పోయి తూరుపు దిక్కున మర్రిచెట్టు కింద తవ్వించాడు. నగలన్నీ బైటపడ్డాయి.
పడమర దిక్కుకు పోయాడు. ఒక యువకున్ని కారాగారంలో బంధించి వుంచడం కనబడింది. వాన్ని విడిపించి లంచం తీసుకొన్న అధికారిని కొరడాలతో కొట్టించి జైలులో వేయించాడు.
దక్షిణం దిక్కుకు పోయాడు. పాటగాన్ని కలసి, సభకు తీసుకొని వచ్చి అందరి ముందు పాట పాడమన్నాడు. అతని పాట విని జనాలంతా ఆనందంతో జేజేలు పలికారు.. రాజు అతనికి మోయలేనంత బంగారమిచ్చి, అతనికి తన సభలో సంగీతకారుని పదవి ఇచ్చాడు.
తరువాత ఉత్తరం దిక్కుకు పోయాడు. సైనికులు కాపలా కాయకుండా పడుకోని కనిపించారు. వాళ్ళందరినీ కొరడాలతో కొట్టించి జైలులో వేయించాడు.
తరువాత రైతు దగ్గరికి పోయాడు. “నువ్వు చెప్పినట్టు పదివేలు కాదు. ఎంత ఇచ్చినా ఆ మంచానికి తక్కువే” అంటూ రైతును మెచ్చుకోని మరలా లక్ష బంగారు వరహాలు ఇచ్చి, ఒక పెద్ద మేడ కట్టిచ్చి ఇచ్చాడు.
దాంతో రైతుకు ఆరోజు నుండీ బాధలన్నీ తొలగిపోయాయి. హాయిగా పెళ్ళి చేసుకోని, పిల్లాపాపలతో, పేదవారిని అవసరానికి అదుకుంటూ ఆనందంగా జీవించసాగాడు.
***********

కామెంట్‌లు