కుంభకర్ణ నిద్ర (జాతీయం వెనుక కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
   నిద్ర అనేది ఒక వరం. మానసికంగా, శారీరకంగా అలసిపోయిన మనిషి తిరిగి నూతన ఉత్తేజం పొందడానికి నిద్ర ఎంతో అవసరం. చిన్న పిల్లలు ఎక్కువగా నిద్ర పోతుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ నిద్రపోయే సమయం తగ్గుతూ, పని చేసే సమయం పెరుగుతూ వుంటుంది. ఆరోగ్యవంతమైన జీవితానికి ఆరుగంటలు నిద్ర తప్పనిసరి. కానీ కొందరు బద్దకస్తులు వుంటారు. వీరు అవసరాన్ని మించి నిద్రపోతూ వుంటారు. అతినిద్ర అనేక సమస్యలకు, అనారోగ్యానికి దారితీస్తుంది.
మనచుట్టూ ఏమి జరుగుతున్నా పట్టించుకోకుండా, ఎంత పెద్ద శబ్దాలు వచ్చినా లేవకుండా, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడూ నిద్రపోయే దానిని 'కుంభకర్ణ నిద్ర' అని అంటారు.
అసలు ఈ జాతీయం ఎలా వచ్చిందంటే కుంభకర్ణుడు రావణుని సోదరుడు. మహాబలవంతుడు. చాలా పెద్ద శరీరం కలవాడు. చిన్నప్పటినుంచీ పెద్ద పెద్ద జంతువులను అవలీలగా పట్టుకొని గుటుక్కున మింగేసేవాడు. వాన్ని చూసి అందరూ భయంతో వణికిపోయేవారు.
రావణ, కుంభకర్ణులు ఇద్దరూ బ్రహ్మ గురించి తపస్సు చేయడం మొదలు పెట్టారు. కుంభకర్ణుడు చాలా రోజులు అరివీర భయంకరంగా తపస్సు చేయసాగాడు. అది చూసి ఇంద్రుడు భయపడి బ్రహ్మ దగ్గరికి పోయాడు. "స్వామీ... మీరు గనుక కుంభకర్ణునికి ప్రత్యక్షమయి అతను కోరిన వరాలు ఇస్తే... అసలే భయంకరమైన బలం కలిగిన కుంభకర్ణుడు ఎవరిని ఏం చేస్తాడో తెలీదు. కాబట్టి నువ్వు ఎలాగయినా సరే ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడాలి" అని ప్రార్థించాడు.
దాంతో బ్రహ్మ సరస్వతిని పిలిచి వరం కోరే సమయంలో నువ్వు 'అతని నాలుకపై వుండి అతను ఆరు నెలలు నిద్ర, ఒకరోజు భోజనం కోరుకునేటట్లు చేయి” అన్నాడు.ఆమె సరేనని అలాగే చేసింది. అందుకే కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోతాడు. ఒక రోజు మాత్రమే లేస్తుంటాడు.
అందుకే  ఎవరైనా సరే ఎప్పుడూ నిద్రపోతుంటే వానిది "కుంభకర్ణ నిద్ర" అనడం ఈ కథ ఆధారంగానే వచ్చింది.
**********

కామెంట్‌లు