గమ్మతైన గడ్డి కోటు (జపాన్ దేశ జానపద కథ) డా.ఎమ్.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒక ఊరిలో ఒక పిల్లవాడు వుండేవాడు. వాడు పెద్ద అల్లరోడు. చెట్ల చాటునా గుట్టల చాటునా దాచిపెట్టుకొని దారిన పోయేవాళ్లను చిన్నచిన్న రాళ్లతో కొట్టేవాడు. వాళ్లు రాయి ఎక్కడినుంచి వచ్చి పడిందో తెలియక దిక్కులు చూస్తా వుంటే పడీ పడీ నవ్వుకునే వాడు. ఇళ్ళ ముందు విడిచిన చెప్పులు ఎత్తుకుపోయి ఎవరికీ కనపడకుండా దాచిపెట్టేవాడు. చిన్న పిల్లల జడలు ఒకదానితో ఒకటి తెలియకుండా ముడి వేసేవాడు. ఇళ్లలో కట్టేసిన దూడల కట్లు విప్పేవాడు. అవి ఆవుల వద్దకు చేరి పాలన్నీ తాగేసేవి. తరువాత మరలా వాటిని ఎక్కడ ఎట్లున్నవి అట్లా కట్టేసేవాడు. సాయంకాలం ఇంటావిడ వచ్చి ఎంత పిండినా చుక్క పాలు కూడా వచ్చేవి కాదు. కొన్నిసార్లు ఆవులు కోపంతో వెనక కాలితో వాళ్లని ఒక్క తన్ను తన్నేవి. వాళ్ళ తిప్పలు చాటు నుంచి చూసి విరగబడి నవ్వుకునేటోడు.
ఆ పిల్లోడు అల్లరోడే గానీ చాలా తెలివైనోడు. ఎప్పుడూ ఏవేవో కొత్తవి తయారు చేసేటోడు. ఆకులతో పడవలు, కాగితాలతో విమానాలు, మట్టితో రకరకాల జంతువులు చేసేవాడు. ఇనుప ముక్కలన్నీ కలిపి రకరకాల కదిలే వస్తువులు చేసేవాడు. ఒకసారి వాడు పుస్తకంలో ఎంత దూరమైనా చూసే దుర్భిణి గురించి చదివాడు. దాంతో పాత ఇనుపసామాన్లు అమ్మే అంగడికి పోయి ఆ పనికిరాని వస్తువుల్లో తనకు పనికొచ్చేవన్నీ ఏరుకొని ఒక పెద్ద దుర్భిణి తయారు చేశాడు. దాంతో ఆకాశంలో నక్షత్రాలను గ్రహాలను చూడసాగాడు.
ఆ ఊరిలో ఒక ముసలి మంత్రగాడు ఉన్నాడు. అతను చానా మంచోడు. ఎవరికీ ఎటువంటి హాని చేసేవాడు కాదు. ఆయన దగ్గర రకరకాల వింత వింత వస్తువులు అనేకం వున్నాయి. అతనికి చాలా మాయ విద్యలు తెలుసు. ఆ మంత్రగాడు ఈ పిల్లోని చేతిలో వున్న దుర్భిణి చూసి “బాబూ... ఏమిటది. చాలా వింతగా వుంది. నేనెప్పుడూ చూడలేదే. దానితో ఏమి చేస్తారు" అని అడిగాడు. దానికి ఆ పిల్లోడు ఇది దుర్భిణి. దీనితో ఎంత దూరంగా వున్న వస్తువునైనా దగ్గరగా చూడవచ్చు. కొండ మీద నిలబడితే మన ఊరులోని వీధులన్నీ కనబడతాయి. ఆకాశం వంక చూస్తే చుక్కలు కళ్ళముందుకొస్తాయి" అన్నాడు.
ఆ మాటలకు మంత్రగాడు చాలా సంబరపడిపోయి “నాకు కదిలే మేఘాలన్నా, చల్లని కాంతులు వెదజల్లే చందమామన్నా, మబ్బులతో నిండి ఉన్న ఆకాశమన్నా, మిల మిల మెరిసే నక్షత్రాలన్నా... చాలా చాలా ఇష్టం. నా దగ్గర వింత వింత మాయా వస్తువులు ఎన్నో వున్నాయి. దీన్ని గనుక నాకిస్తే వాటిలో నీకిష్టమైనది నీకు ఇస్తా" అన్నాడు. దాంతో ఆ పిల్లోడు సరేనని దుర్భిణి ఆ మంత్రగానికి ఇచ్చి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు.
అక్కడ రకరకాల వింత వింత వస్తువులు వున్నాయి. రివ్వున ఎగిరే పావుకోళ్ళు, సర్రున దూసుకుపోయే మాయా తివాచి, మనుషులందరినీ జంతువులుగా మార్చే మంత్రదండం, కోరుకున్న ఆహారాన్ని చిటికలో ఇచ్చే అక్షయపాత్ర, మాటలు చెప్పే మరబొమ్మ, నాట్యం చేయించే నాదస్వరం, నువ్వు ఏమి కోరుకుంటే అది చూపే వింత అద్దం, నిమిషనిమిషానికి రంగులు మార్చే రత్నాల హారం... ఇలా ఒక్కొక్కటే చూస్తూ వెళుతుంటే ఒకచోట గోడకు తగిలించిన ఒక పెద్ద గడ్డి కోటు కనబడింది. దానిని ఆశ్చర్యంగా చూస్తూ “ఓ తాతా... ఇదేంది అందరూ మంచి ఊలుతోనో, ఉన్నితోనో కోటు అల్లించుకుంటే నువ్వు గడ్డితో అల్లించుకున్నావు. ఇదేమి చలినాపుతుందా... వాననాపుతుందా...” అని అడిగాడు. దానికి ఆ మాంత్రికుడు చిరునవ్వు నవ్వి “ఇది అలాంటిలాంటి అల్లాటప్ప కోటు కాదురా... మాయాకోటు. దీన్ని ఎవరైనా వేసుకుంటే చాలు మరుక్షణంలో మాయమైపోతారు. మరలా ఈ కోటు విప్పేంతవరకు ఎవరికీ కనబడరు" అని చెప్పాడు. 
ఆ పిల్లోనికి ఆ గమ్మత్తయిన గడ్డి కోటు బాగా నచ్చింది. వెంటనే "తాతా... అయితే నా దుర్భిణి బదులు ఈ గడ్డికోటు నాకివ్వు” అని అడిగాడు. మాంత్రికుడు సరేనని దానిని ఆ పిల్లవాని చేతిలో పెట్టాడు.
అసలే వాడు పెద్ద కోతి. దానికి తోడు ఆ మాయాకోటు దొరికింది. ఇంకేముంది దానిని వేసుకున్న మరుక్షణమే మాయమైపోయాడు. అందరి మధ్య పోతున్నాడు గానీ ఎవరూ వాన్ని గుర్తుపట్టడం లేదు. దాంతో కోతి చేష్టలు మొదలుపెట్టాడు. ఒకతను కూరకాయల గంప నెత్తిన పెట్టుకొని పోతుంటే వెనుక నుంచి ఒక్కసారిగా దొబ్బాడు. అతను కిందపడి తోసిందెవరో అర్థంకాక దిక్కులు చూస్తుంటే పకపకా నవ్వుకున్నాడు. ఒకని జుట్టు పీకితే, మరొకని చెంప పగలగొట్టాడు. ఒకని చేతిలోని ఆపిల్ పండు గుంజుకుంటే మరొకని గొడుగు లాగేసుకున్నాడు. కళ్ళముందే వస్తువులు గాలిలో ఎగిరిపోతుంటే, ఎవరో వెనుక నుంచి హఠాత్తుగా దొబ్బుతుంటే, తింటున్నవి చేతుల్లోంచి లాక్కుంటూ వుంటే, పంచ పట్టుకుని గుంజుతూ ఉంటే, అవన్నీ ఎవరు చేస్తున్నారో... ఎలా చేస్తున్నారో... తెలియక జనాలంతా బెదిరి పారిపోతావున్నారు. అది చూసి వాడు సంబరంగా గంతులు వేయసాగాడు. అలా కనపడిన వాళ్లందరినీ ఏడిపించి రాత్రి ఇంటికి చేరుకున్నాడు.
గడ్డికోటు తీసి ఇంట్లో ఒక చిలుక కొయ్యకు తగిలించి కమ్మగా కడుపునిండా తిని హాయిగా నిద్రపోయాడు. పొద్దున్నే వాళ్ల అమ్మ ఒక్కొక్క గదే కసువు వూడ్చుకుంటూ వాని గదిలోకి వచ్చింది. వాడు హాయిగా గురుకలు కొడతా నిద్రపోతా వున్నాడు. ఆమెకు చిలక కొయ్యకు తగిలించిన గడ్డికోటు కనబడింది. బాగా దుమ్ము కొట్టుకుపోయి చూడ్డానికి చాలా గలీజ్ గా వుంది. ఆమె దాన్ని చూసి "వీడు ఎక్కడెక్కడి పనికిరాని వస్తువులన్నీ తీసుకొచ్చి ఇంట్లోనే పెడుతుంటాడు. ఇల్లు శుభ్రం చేయలేక చస్తా వున్నా” అనుకుంటా ఆ గడ్డి కోటును తీసుకుపోయి పొయ్యిలో పెట్టేసింది. అంతే... అది నెమ్మదిగా కాలి బూడిదైపోయింది.
వీడు పొద్దున్నే లేచి చూస్తే ఇంకేముంది... గడ్డి కోటు కనబడలేదు. అదిరిపడి ఎక్కడన్నా పడిపోయిందా అని గదంతా కిందికీ మీదికీ వెదికాడు. ఉంటే కదా కనబడ్డానికి. దాంతో వురుక్కుంటా వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి "అమ్మా నిన్న రాత్రి ఒక గడ్డికోటు తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టా. నువ్వేమైనా చూశావా" అని అడిగాడు. దానికి ఆమె “ఆ చిలక కొయ్యకు తగిలిచ్చిందేనా... మాసిపోయి కంపు కొడతావుంటే తీసుకుపోయి పొయ్యిలో పెట్టేశా" అని చెప్పింది. వాడు అదిరిపడ్డాడు. "అయ్యో అమ్మా.. ఎంత పని చేశావు" అంటూ లబలబలబలాడుతూ పొయ్యి దగ్గరికి వురికాడు. చూస్తే ఇంకేముంది... బూడిద తప్ప ఒక్క గడ్డి పరక కూడా కనపడలేదు.
ఆ బూడిదలో ఏమన్నా మహత్యం వుందేమో చూద్దామని దానిని తీసుకొని చేతిమీద పూసుకున్నాడు. అంతే... చేయి మాయమైంది. కాలుమీద పూసుకుంటే కాలు మాయమైంది. "అరెరే... ఇదేదో బాగుందే" అని పొయ్యిలోని బూడిదంతా తీసుకొని సందు ఖాళీ లేకుండా వంటి మీదంతా పూసుకున్నాడు. అంతే... మరలా వాడు ఎవరికీ కనపడకుండా మాయమైపోయాడు. ఇంక వానికి సంబరం సంబరం కాదు. మరలా జనాలను ఏడిపించడానికి వురుక్కుంటా వీధుల్లోకి పోయాడు.
ఒక ఫలహారశాల దగ్గర జనం గుంపులు గుంపులుగా కనబడ్డారు. వాళ్లను తోసుకుంటూ, నెత్తిమీద కొట్టుకుంటూ, వీపుమీద గుద్దుతూ, పంచలు అంగీలు లాగుతూ, నెత్తిమీద టోపీలు విసిరి పడేస్తూ, జడలు గుంజుతూ, మీసాలు పీకుతూ... లోపలికి పోయాడు. ఎవరు తోస్తున్నారో... ఎవరు దొబ్బుతున్నారో... ఎవరు తంతున్నారో... అర్థంకాక జనాలు పిచ్చి వాళ్లలా దిక్కులు చూస్తున్నారు. వాడు సక్కగా వంట గదిలోకి పోయి లోపల వున్న కరకరలాడే కమ్మని దోసె ఒకటి అందుకున్నాడు. వాడు ఎవరికీ కనబడడు గదా... దాంతో దోసె ఒక్కటే పైకి లేచి గాల్లో తేలియాడసాగింది. అందరూ నోరు వెళ్ళబెట్టి చూడసాగారు. ఎవరో తింటున్నట్టు కొంచెం కొంచెం మాయం కాసాగింది. చివరికి కళ్ళముందే దోసె మాయం అయిపోయింది. చూస్తుండగానే పూరీలు, గులాబ్ జాములు, మైసూరు పాకులు... ఒక్కొక్కటి గాల్లో పైకి లేసి మాయం కాసాగాయి. జనాలంతా తినడం మానేసి ఆ విచిత్రాన్ని భయం భయంగా చూడసాగారు.
వాడు అన్నీ తినేసరికి బాగా దాహమైంది. తాగడానికి నీళ్ల చెంబు తీసుకున్నాడు. ఎత్తి గడగడగడ తాగుతూ వుంటే అందులోంచి కొన్ని నీటి చుక్కలు జారి వాని చేతి మీద పడ్డాయి. దాంతో అక్కడి బూడిద తొలగిపోయి చేయి ఒక్కటి బయటపడింది. జనాలు ఇదేదో వింతగా వుందే... చేయి ఒక్కటి కనపడుతుందే... మిగతా శరీరం ఎక్కడ వుంది." అనుకుంటూ దాని చుట్టూ గుమికూడారు.  
వానికి ఆ గుంపులో నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. కంగారులో వాని చేతిలోని నీళ్లచెంబు జారి వాని కాలు మీద పడింది. అంతే రెండు కాళ్ళ మీద బూడిద పక్కకు పోయి అవి కూడా బయటపడ్డాయి. పైన ఒక చేయి, కింద రెండు కాళ్లు అందరికీ కనపడసాగాయి. ఆ ఫలహారశాల యజమాని ఒక బిందె నిండా నీళ్లు తెచ్చి ఆ చేతి మీద గుమ్మరించాడు. అంతే... చేయి దగ్గరనుంచి నడుమూ, కాళ్లు చేతుల వరకు మొత్తం బయటపడ్డాయి. ఒక్క మొహం మాత్రమే కనబడడం లేదు. జనాలు వాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఒకడు చెంబుతో నీళ్లు తీసుకువచ్చి మొహం మీద పోశాడు.
అంతే బూడిదంతా పోయి వాని మొహం బయటపడింది. దాంతో దొంగ ఎవరో అందరికీ తెలిసిపోయింది.  
“ఒరేయ్ దొంగ వెధవా... నువ్వా అప్పటినుంచీ అందరినీ కొడుతూ, దొబ్బుతూ, మేము తింటున్నవన్నీ లాక్కొని అల్లరి చేసింది. వుండు నీ సంగతి చెబుతాం" అంటూ వానిని పట్టుకుని కిందామీదా ఏసి పిచ్చికుక్కను కొట్టినట్టు కొట్టసాగారు.
అప్పుడే అటువైపు వచ్చిన ఒక పెద్ద మనిషి... ముక్కు మొహం పగిలి ఒళ్లంతా హూనమైన వాన్ని చూసి అందరిని ఆపాడు. "ఏం జరిగింది... ఎందుకిలా వాన్ని కిందామీదా వేసి మెత్తగా తంతా వున్నారు" అని అడిగాడు. వాళ్ళు జరిగిందంతా చెప్పారు.
ఆ మాటలు విన్న ఆ పెద్దమనిషి "ఏరా ఆ మాంత్రికుని దగ్గర నేర్చుకోవడానికి ఎన్ని మంచి విద్యలు లేవు. వాటిని నేర్చుకొని నీ జీవితాన్ని బాగు చేసుకోక ఇలాంటి చెత్తపని చేసి అందరినీ ఇబ్బంది పెడతావా. మనకున్న తెలివితేటలతో పదిమందికి ఉపయోగపడాల గానీ అల్లరి పనులు చేసి అందరితో తిట్లు తినకూడదు" అంటూ బాగా బుద్ధి చెప్పి “చిన్న పిల్లోడు తెలియక చేసింటాడు. ఈసారికి వదిలేయమని” జనాలకు సర్ది చెప్పాడు. దాంతో వాళ్లు సరే అని వాన్ని వదిలేసి "ఇంకొకసారి ఇలాంటివి చెయ్యకు. చేస్తే గుండు కొట్టించి, సున్నం బొట్లు పెట్టించి, గాడిద మీదికి ఎక్కించి, ఊరు ఊరంతా ఊరేగిస్తాము జాగ్రత్త" అని హెచ్చరించారు.
“ఇంక జన్మలో ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు" అనుకుంటా వాడు అక్కడి నుంచి ఇంటికి పరుగు తీశాడు.
*********
కామెంట్‌లు