నాన్న ఒక సంద్రం;- శిరందాస్ శ్రీనివాస్- నిజాం వైద్య విజ్ఞాన సంస్థ- 9441673339
నాన్న ఒక సంద్రం
ఒడ్డు కు కొట్టుకొచ్చే కెరటాల
ఘోష వినిపిస్తుంది కానీ
పడిలేచే అలల వెనక 
అలజడి కన్పించదు.

నడి సంద్రంలో 
ఎంత  భయంకర ప్రశాంతత
దాగి ఉందో అర్థం కాదు.
ఆ ప్రశాంతత వెనక
ఎంత ఆనందం, ఆవేదన 
ఆరాటం దాగి ఉంటుందో తెలియదు..

నాన్న నీ మూలం
నిన్ను ఓ మహా వృక్షంలా
చూడాలని కలగంటాడు.. 
ఆ కలలు ఈడేరాలని
నీకు నిచ్చెన మెట్లు అవుతాడు.

నీవు వేసే బుడి బుడి అడుగులకు
ఆసరాయై నడిపిస్తూనే
ఎక్కడ పడిపోతాడో నని
ఆదుర్ధాపడే ఆరాటం అతడిది.

విత్తు మొలకెత్తి 
ఒక్కో ఆకు చిగురుస్తుంటే 
ఎంత ఆనందమో..
కొమ్మ కొమ్మా విస్తరిస్తూ..
నలుగురికీ నీడనిస్తుంటే
ఆ గుండెల చాటున 
ఎంత గర్వమో..
అదంతా గుండెల చాటున దాచుకొని గంభీరాన్ని 
మీసం మెలేసి చాటుతాడు. 

నాన్న కళ్ళల్లో నీ కోసం 
ఎన్ని రంగుల కలలో
ఆ కలలు నిజం కావాలని
ఎన్ని నిద్ర లేని రాత్రులో..
తన గురించి మరచి
నీ చదువు సందెల కోసం 
ఎంత ఆరాటమో కదా..

నీవెదిగిన కొద్దీ బలం పెంచుకున్న  నాన్నకు
నీవో భరోసా..
ఆలి వచ్చాక అమ్మా నాన్నలు పరాయి వారు కాగా..
కని పెంచిన వారినే 
భారంగా భావిస్తే..
రెక్కలు వచ్చిన నీవు
గూడు విడిచి పోతే
ఆ గుండెకు 
ఎంత 
రంపపు కోతో కదా..
కడుపులోనే దాచుకున్న 
ఆ దుఃఖం ఎంత అగాధాన్ని సృష్టిస్తుందో కదా ..

నీ కొడుకుపై నీకు ఎంత మమకారమో ఉంటుందో కదా..
మరి నీ నాన్నకు నీపై ఉండేది
అది ఏ నుడి కారం?
నారు, నీరు పోసిన రైతు 
మొక్కను ఎంత పదిలంగా చూసుకుంటాడో.. 
నిను కని పెంచిన అమ్మా నాన్న 
అంత కన్న ఎక్కువే కదా..

అక్కరకొస్తుందని అమ్మకు
బుక్కెడు కూడు పెడతావేమో గానీ
నాన్నకు కసిరింపులు ఈసడింపులే కదా బహుమానాలు..

అమ్మ పోయి నాన్న ఉంటే
అనాధ ఆశ్రమమే కదా గతి
నీకంటూ ఓ జన్మ నిచ్చి
నీ బతుకికి కారణమైన
నాన్నకు
నువ్వు ఇచ్చే 
బహుమానం ఓల్దేజ్ హోమా..
వయో వృద్ధుల అశ్రమమా...
అది అమ్మా నాన్నలకు
శరణాలయమా...

నీవు తిట్టినా కొట్టినా 
నిన్నూ నీ పిల్లల చూస్తూ 
గడపాలని కోరుకునే నాన్నకు
అది గోల్డెజ్ హోమా...

ప్రాణం అంతా మీ పై పెట్టుకొని
ప్రాణం లేని నాలుగు గోడల మధ్య 
అనుభవించే నరకం 
అనుభవమైతే కదా తెలిసేది..

భూమి గుండ్రమే కదా
ఆ అనుభవం
ఎంతో దూరం కాదు సుమా..
అప్పుడు దుఖించినా 
శోకించినా ఫలితం శూన్యం..

వారి కంట తడి 
కారాదు నీకు శాపం..
వారి ముఖాన ఆనందం
అవుతుంది నీకు వరం..

అందుకే అమ్మా నాన్నల
జన్మనిచ్చిన దైవాళ్ళా భావించు
నాన్న చేతి కర్రవై నడిపించు.
అమ్మ గోరు ముద్దవై తినిపించు.
కామెంట్‌లు
Mahesh basaveni చెప్పారు…
Nice words sir about father 😍
Mahesh basaveni చెప్పారు…
Nice words about father sir 😍