అన్నదాన మహిమ; - సి.హెచ్.ప్రతాప్
 చాలా మందికి ఆకలితో ఉన్నపుడు జీవితం చేజారి పోతున్నట్లుగా అనిపిస్తుంది. మనం అస్సలు ఏమి తినకుండా ఉంటే, మనం చనిపోతాము. కాబట్టి అన్నదానం అనేది జీవాధారం.అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు. అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం వుందనే అర్ధం.అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. "దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న" అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని శాస్త్రం చెబుతోంది.
అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే . అంతే కాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసినవన్ని అన్నమే . కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని శాస్త్రాలు చెప్తున్నాయి . ఏదైనా దానం చేసేప్పుడు విచక్షణ అవసరం కానీ అన్నదానానికి మాత్రం ఈ నియమం లేదు . ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అది అత్యంత శ్రేష్టం అయినది.
ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు. అన్నం కోసం ఎన్ని దారుణాలైనే చేస్తాడు. అటువంటి దశలో మీ దాన బుద్ధి ఎంత గొప్పదో దేవతలు గ్రహిస్తారు. దయగలవారే ఆశలకు దూరం కాగలరు. ఈ రెండూ ఉన్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే ప్రాణికి యింత అన్నం పెట్టడం కంటే ఏ దానము గొప్పదికాదు.

 " ప్రేమ, అంకిత భావంతో తో  వడ్డించి, అన్నదానం చేయడం ద్వారా మీకు ఎదుటి వారితో ఒక లోతైన సంబంధం ఏర్పడుతుంది  మీరు దీనిని గొప్ప అంకిత భావంతో చేస్తారు ఎందుకంటే దీని ద్వారా ఒకరికి జీవితాన్నిచ్చే అవకాశం మీరు పొందుతున్నారు. ఇది ఎంతో ప్రాముఖ్యమైంది, ఎందుకంటే ఒకరు మిమ్మల్ని తమ కన్నా ఎక్కువగా చూస్తూ మీ నుండి స్వీకరిస్తున్నారు" అని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నదాన ప్రాశస్త్యం గురించి అద్భుతంగా చెప్పారు. 

కామెంట్‌లు