సుప్రభాత కవిత ; - బృంద
చినుకు కురిసిన సంతోషం
కనుల విందైన దృశ్యం 
ఇలకూ నింగి మేఘసందేశం
అలక తీర్చిన వైనం

వరుణుడి ప్రేమకు
తడిసి ముద్దైన పుడమి
ప్రతి చినుకునీ ఆత్రంగా
ఒడిసి పట్టుకుంది..

కలహించి విడిపోయిన
ఆలూమగల రీతి
విడిచి ఉండలేమని
అర్థమైన తీరున

కోపమంతా తీరిపోయి
నింగి కరిగి నీరై 
నేలనంతా తన ప్రేమతో 
తడిపి ముద్ద చేయగా

అణువణువూ ఆనందం
ఆకుఆకున కొత్త మెరుపులు
తడిసి తరించిన నేల
వెదజల్లు మట్టి పరిమళం

నదిగా కలిసిన కడలికి
ఆవిరిగా మార్చిన ఎండకు
నీటితో నిండిన మబ్బులకు
చినుకుగా కురిసిన వానకు

వర్షమిస్తూ అనుగ్రహించే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸
 

కామెంట్‌లు