'పదో తరగతి వరకు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి'; - హెచ్.ఎం. ఈర్ల సమ్మయ్య

 వివిధ సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యంతో పాటు పిల్లల మానసిక, శారీరక, వికాసాభివృద్ధి ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధించబడుతుందని, పిల్లల్ని పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కాల్వశ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. శనివారం ఆయన కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో పాఠశాల ఉపాధ్యాయినులతో కలిసి పిల్లల తల్లిదండ్రుల ఇండ్లను సందర్శించి కరపత్రాలను అందజేశారు. పిల్లల్ని ఎస్సీ కాలనీ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులు, యువతీ, యువకులు, గ్రామస్తులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డబ్బులు ఊరికే రావని, ఎంతో చెమటోడ్చి కష్టించి సంపాదించిన ప్రతి పైసా చాలా విలువైందని, వాటిని వృధా చేసుకోకుండా పిల్లల భవిష్యత్తు అవసరాలకు వినియోగించాలన్నారు. కొందరు పనిగట్టుకొని ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయుల పట్ల దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని తల్లిదండ్రులు నమ్మకూడదని, మాయ మాటలకు మోసపోకుండా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చేర్పించి, సకల సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యను పొందాలన్నారు.  విజ్ఞానం, వివేకం, శాస్త్రీయ దృక్పథం ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమవుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలన్నారు. తన ఇద్దరు పిల్లల్ని పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాననని ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య గుర్తు చేశారు. కొంతమంది ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలుస్తున్నారని, వారిని త్వరలోనే 'మేఘన సాహితీ కళావేదిక' ఆధ్వర్యంలో సన్మా నిస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 'మన ఊరు మన బడి' పథకం కింద సుమారు రూ. 15 లక్షల వ్యయంతో పాఠశాల ఆధునికరణ, అన్ని వసతులతో పాఠశాలను అందంగా, ఆకర్షణీయంగా తయారు చేశామని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ఈ పాఠశాలలో పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రత్యేకంగా సన్మానిస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, విద్యార్థినీ, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు