సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -167
భీమ భాస దృఢ న్యాయము
*****
 భీమ అంటే భయంకరము, శివుడు, పాండవులలో రెండవ వాడు అనే అర్థాలు ఉన్నాయి.
భాస అంటే ప్రకాశము కాంతి,ఒక మహా కవి అనే అర్థాలున్నాయి.
దృఢ అంటే స్థిరమైన, బలమైన,అలయిక లేని,గట్టి,పుష్టి నొందిన, గట్టిగా కట్టబడిన అనే అర్థాలు ఉన్నాయి.దృఢం అంటే ఆధిక్యం అని కూడా అర్థం.

అతి భయంకరమైన ఆధిపత్యంతో ప్రకాశిస్తూ అహంకారంతో ఎగిరెగిరి పడేవాడు  ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా కింద కూలుతాడు అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
  కొందరు శరీరాకృతిని ఒంట్లో బలాన్ని చూసుకుని గర్వంతో ప్రవర్తిస్తారు.మరి కొందరు ధన మదంతో తమను మించిన వారు లేరని ఎవరినీ లెక్క చేయకుండా మిడిసిపడుతూ ఉంటారు.
కానీ ఇలాంటి వారికి ఎప్పుడో ఒకప్పుడు గట్టి దెబ్బే తగులుతుంది అంటారు పెద్దలు.
తీసుకునే తప్పుడు నిర్ణయాలకు, దుష్ట చేతలకు తగిన శాస్తి జరుగుతుందని అంటారు. పరిస్థితులు,కాలం అనేవి  చాలా బలీయమైనవనీ ,ఆలాంటి వారిని సమయం వచ్చినప్పుడు తిరిగి తలెత్తనంత పతనావస్థకు తీసుకుని వెళ్తాయని చెబుతుంటారు .
అహంకారం, గర్వంతో కళ్ళు మూసుకుపోయిన కొందరి జీవితాలు చివరి దశలో చాలా దయనీయంగా మారడం  చూసినప్పుడు,ఎలాంటి వాళ్ళు ఎలా ఐపోయారు  అనిపిస్తుంది. పెద్దలు చెప్పిన మాటలు అక్షర సత్యాలు అని అర్థం అవుతుంది. ఆ సమయంలో ఈ "భీమ భాస దృఢ న్యాయము" గుర్తుకు రాకమానదు.
 ఇంతెందుకు రామాయణ మహాభారతాలు తరచి చూసినప్పుడు ఇలాంటివెన్నో వ్యక్తుల జీవితాలు  కనబడుతుంటాయి.
 రావణాసురుడు మహా బలాడ్యుడు,శివ భక్తుడు, అపార జ్ఞానాన్ని కలిగిన వ్యక్తి.రావణ బ్రహ్మగా పేరు పొందాడు.ఐతేనేం అతడు తనలోని అరిషడ్వర్గాలను జయించ లేక పోయాడు.
 అహంకారం గర్వంతో ఎగిరెగిరి పడుతూ చివరికి ఏమయ్యాడో మనందరికీ తెలుసు. దీనికి సంబంధించిన వేమన పద్యాన్ని చూద్దాం.
" లక్ష్మి యేలి నట్టి లంకాధిపతి పురి/ పిల్ల కోతి సేన కొల్లగొట్టె/ జేటు కాలమయిన జెఱుప నల్పులె జాలు/ విశ్వధాభిరామ వినురవేమ!!"
 లంకాధిపతి రావణాసురుడు.తన లంక ఎవ్వరూ కొల్లగొట్టలేని దుర్భేద్యమైన రాజ్యమని, తన రాక్షస భటులు, సేవకులు మహా పరాక్రమం కలిగిన వారనీ, తాను స్వయంగా తపస్సు చేసి ఈశ్వర అనుగ్రహం పొందిన వాడినని గర్వంతో విర్రవీగాడు.ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డాడు. సీతమ్మను చెరబట్టాడు.
లంక సిరి సంపదల నిలయం లక్ష్మీ దేవే ఏలినప్పటికీ... ఏం జరిగింది. రావణుని గర్వం అణిగేలా  కింద కూలిపోయి మళ్ళీ లేవలేనంతగా పిల్ల కోతుల గుంపుచేత ఓడిపోయాడు.  కోతి మూక లంకకు నిప్పు అంటించి నాశనము చేసింది కదా!
 అహంకారం,మద మాత్సర్యములు అణిగే రోజు ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదు. అలా వచ్చినప్పుడు సామాన్యుల చేత భంగ పడక తప్పదని ఈ "భీమ భాస దృఢ న్యాయము" ద్వారా తెలుసుకోవచ్చు.
కాబట్టి  చివరికి మిగిలేది మనం చేసే మంచేననీ,మనసులో దుర్గుణాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించుకోవాలని ఈ న్యాయము ద్వారా గ్రహించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు