సుప్రభాత కవిత ; - బృంద
పచ్చని పట్టుచీర
కుచ్చిళ్ళు సర్దుకోవాల్సిన
పుత్తడి పుడమిని తడిపే
ముత్తెపు చినుకుల జాడేదీ??

పరుగులు పెడుతూ పోయే
పాలమబ్బులకు రగిలే నేల
ఎగిసే సెగల వేడి భుగల
పొగలు కనిపించవెందుకూ??

స్వార్థం పెరిగిన మానవాళికి
పాఠం చెప్పాలనుకుందా?
చేసిన తప్పులకు చెప్పకనే
శిక్ష విధించి చోద్యం చూడాలనుకుందా?

మబ్బులును ఆపే గాలులు
ఇచ్చే అడవులు నరికిన పాపమా?
చెట్లకు సైతం చోటివ్వక
అంతస్థులు కట్టిన అత్యాశా?

తరాలకు కూడబెట్టే తలపులో
తరువులు పెంచాలని
ముందు తరాలకు ఊపిరి 
ముఖ్యంగా ఇవ్వాలని
తెలియని అజ్ఞానమా?

భరిస్తోందని భవనాలు కట్టి
సహిస్తోందని తవ్వకాలు జరిపి
సహజ శోభలను కాలరాచి
వసుమతికి చేసిన పరాభవమా?

తప్పులు కొందరివైనా
తిప్పలు మాత్రం అందరివీ
ముప్పును తప్పించే దారి
తప్పక అలవాటు చేసి

గిరులను తరులను
ధరణిలోని వనములను
కాపాడే సద్గుణమిచ్చి
కరుణించి కటాక్షించే

వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు