సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -153
బహువృకా కృష్ణ మృగ న్యాయము
*****
బహు అంటే అధికము, సమృద్ధము, అనేకము చాలా, పెద్ద అనే అర్థాలు ఉన్నాయి.
వృకము అంటే తోడేలు.కృష్ణ మృగము అంటే సారంగము,లేడి,జింక,కురంగము అనే అర్థాలు ఉన్నాయి.
తోడేళ్ళ గుంపు మధ్య చిక్కిన లేడి వలె అనీ, లేడిపిల్ల తోడేళ్ళ గుంపుకు చిక్కినట్లయితే అవి దాని దొరికిన భాగమల్లా కొరికి చీల్చి తింటాయనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
బహు వృకా కృష్ణ మృగము అంటే అనేక తోడేళ్ళు,లేడి లేదా జింక అని అర్థం.
తోడేలు కౄరత్వానికి చిహ్నం. ఏదైనా జంతువును వేటాడటానికి తోడేళ్ళు అవసరమైతే గుంపులు గుంపులుగా కలిసి వేటకు వెళ్తాయి. లేదంటే ఒంటరిగా వేటాడుతాయి.
గుంపులు గుంపులుగా వెళ్ళినప్పుడు అన్ని వైపులా మూకుమ్మడిగా దాడి చేస్తాయి.
అలా వాటి దాడిలో చిక్కిన జంతువు ఎట్టి పరిస్థితుల్లోనూ పారిపోలేదు. దాని మీద పడి తమ పదునైన గోళ్ళతో చీల్చి దొరికిన భాగమల్లా కొరికి తింటాయి.
మరి ఇలాంటి న్యాయము గురించి చెప్పుకోవడం అవసరమా అనిపించవచ్చు.
కానీ  దీనినే మనుషులకు,వారి మనస్తత్వాలకు వర్తింప చేస్తే...
తోడేళ్ళ వంటి కౄరమైన మనుషులు ఈ సమాజంలో కొందరు ఉన్నారు.వాళ్ళకు  మహా కౄరమైన మనసు ఉంటుంది.
ఎవరైనా అమాయకంగా లేడి పిల్లలా కనిపిస్తే చాలు.వారి ఆస్తిపాస్తులను, అస్తిత్వాన్ని  మోసపు మాటలతో,చేతలతో తేలికగా మోసం చేస్తుంటారు.
వారికి జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోలేని స్థితిలోకి నెట్టి వేస్తారు.
ఈ కౄరమైన మనసు ఉన్నవాళ్ళు  ఒకరికొకరికి పడక పోయినా ఇలాంటి దుష్టమైన పని చేయడానికి మాత్రం ఏకమై పోతారు.
ఇలా తమకు నచ్చని వారి(వాళ్ళు ఎవరి జోలికి పోకున్నా సరే)పతనం చూసేంతవరకు వెనుకాడరు.
 అందుకే తోడేళ్ళ గుంపు లాంటి వారితో స్నేహం కానీ, విరోధం కానీ మహా ప్రమాదమని, వాళ్ళకు చిక్కకుండా ఎప్పటి కప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఈ "బహు వృకా కృష్ణ మృగ న్యాయము" ద్వారా గ్రహించవచ్చు. 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు