వనజ శతకము(అట వెలదులు )-ఎం. వి. ఉమాదేవి
 73)
కులముమతము మనకు కూడుబెట్టగలేవు
సంఘజీవితమును సాగనీవు
నందరొక్కటైన నందమే బ్రతుకంత 
వనజ మాట మిగుల వాస్తవమ్మ!
74)
అన్నదమ్ములనిన యమితప్రేమను జూపు
నతనిభార్య యన్న నసలుపడదు
తానుగూడ గృహిణి తనవలే నెరుగరా 
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
75)
కావ్యసీమలోని కమనీయమగు పద్య
మొకటినేర్చుకున్న మోదమగును
గాయకులకునందు గణనీయ సంతృప్తి 
వనజమాట మిగుల వాస్తవమ్ము!
76)
ఆశ బ్రతుకునిచ్చునాశయే నడిపించు
క్రొత్తకోరికలకు కోటగట్టు
నిత్యచేతనమ్ము నీలోని వాంఛయే
వనజ మాట మిగులవాస్తవమ్ము !

కామెంట్‌లు