విశ్వానికి సంక్రాంతి;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
తిమిరంతో సమరం చేసి
పోరాటాల విజయకేతనం చేబూని 
సమతను మమతను మానవతను
అన్ని అవకాశాలకూ గాలమేసి
సబ్బండ జనమంతా చేయి కలిపి 
అనురాగపు పరిమళాలు దివ్వెలుగా 
కదులుతున్న కలాల గళాలతో
తెలంగాణ నినదిస్తున్నది
విశ్వానికి సంక్రాంతిని తెస్తున్నది!! 

అమరత్వాన్నీ, ఆత్మ గౌరవత్వాన్నీ 
హక్కులనీ, అస్తిత్వాన్నీ
తెగింపునీ, త్యాగాన్నీ
సహజ న్యాయాన్నీ, పోరాటాన్నీ 
ఉరుసుల్నీ, ఉత్సవాల్నీ
కలగలిపి కలిసిమెలిసి పంచుకుని
ఉద్యమ కారులకు జన్మనిచ్చిన 
తెలంగాణ నినదిస్తున్నది
విశ్వానికి సంక్రాంతిని ఇస్తున్నది!!

భావ స్వేచ్ఛ నణిచిన 
పరాయి పాలనలో 
చెమట చుక్కలూ కన్నీళ్ళు కలగలిపి
కష్టాల పెను సంద్రాన్నంతా ఈది 
కళ్ళల్లో కాంతి పుంజాలు నింపుకుని 
సమైక్య పాలన కాలుష్యాల నెత్తి పోస్తూ
శిథిలమైనపూరిళ్ళ తెలంగాణ బతుకు 
నేడు ధైర్యంగా బంగారు తెలంగాణకై
తెలంగాణ నినదిస్తున్నది 
విశ్వానికి సంక్రాంతిని తెస్తున్నది!!

కవుల చేతుల్లో ఖడ్గంగా 
పెదాలమీద అగ్నిజ్వాలగా
కన్రెప్పలమీద అశ్రుధారగా 
పాదాల మీద పదాలుగా
జీవితమంతా వ్యాపించి
జీవనమంతా విస్తరించి
జీవితమే కవిత్వంగా
తెలంగాణ నినదిస్తున్నది 
విశ్వానికి సంక్రాంతిని ఇస్తున్నది!!

గతకాలపు గాయాలకు 
నవనీతపు పూతపూసి
అమరుల ఆత్మలు శాంతించాయని 
జన జీవన కల నెరవేరిందని
అంబరాన్ని చూబించిన సంబరాలు చేసుకొని 
నవ్య రాష్ట్రంగా పురుడుపోసుకొని
భూతల స్వర్గమైన భూమిగా 
విశ్వపు వినువీధిలో
తెలంగాణ నినదిస్తున్నది 
విశ్వానికి సంక్రాంతిని తెస్తున్నది!!

పంపన పాల్కురికి కవిత్వం 
రామదాసు హనుమద్దాసుల గానం
పోతన గౌరన సూరన కవనం 
కాళోజీ సురవరం నవజీవనం
సమకాలీన కవుల స్పందనగా
నిరంతరాయంగా నిర్విరామంగా 
ప్రవహిస్తూ ప్రవచిస్తూ
తెలంగాణ నినదిస్తున్నది
విశ్వానికి సంక్రాంతిని ఇస్తున్నది!!
**************


కామెంట్‌లు