కలవరపడని ఎడిసన్; - - జగదీశ్ యామిజాల
 శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బుని కనుగొన్నాక దానిని తన మిత్రులకు, తోటి శాస్త్రవేత్తలకు చూపడం కోసం ఓ సమావేశం ఏర్పాటు చేశాడు. 
ఆయన ప్రయోగశాలలోనే పైఅంతస్తులో ఈ సమావేశం ఏర్పాటైంది.
ఎడిసన్ తన అసిస్టెంటుని పిలిచి విద్యుత్ బల్బుని పైకి తీసుకురమ్మన్నాడు. 
అయితే ఆ అసిస్టెంటు బల్బుని తీసుకొస్తుండగా అది చేజారి కింద పడి పగిలిపోయింది. 
విషయం తెలిసి అందరూ ఆందోళన చెందారు. ఎడిసన్ ఏమంటారో అని అసిస్టెంట్ భయపడ్డాడు. కానీ ఎడిసన్ ఏమాత్రం చలించలేదు.
వేయి ప్రయోగాలు చేసి విఫలమై బల్బుని తయారుచేసిన ఎడిసన్ కి మరో బల్బు తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాదుగా.
అప్పటికప్పుడు కాస్తంత శ్రమపడి కొత్త బల్బుని తయారుచేశాడు ఎడిసన్. దానిని తీసుకురావలసిందిగా తన అసిస్టెంటుతో చెప్పాడు.
మొదటిసారి బల్బుని ముక్కలు చేసిన అతనినే మళ్ళీ బల్బుని తెమ్మంటున్నారేమిటీ అని కొందరడిగారు.
అప్పుడు ఎడిసన్ "అతను బల్బు పగలకొట్టినా మరో బల్బు నేను తయారు చేయగలను. కానీ నా సహాయకుడి మనసుని గాయపరిస్తే దానిని నేను మళ్ళీ సరిచేయలేను కదా?  అందుకే అతనినే బల్బు తీసుకురమ్మని చెప్పాను. అతను తనకు అప్పగించిన పనిని, బాధ్యతను గుర్తెరిగి, నేను అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయక అతనీసారి సవ్యంగానే బల్బు తీసుకొస్తాడనే నమ్మకం నాకుంది" అన్నాడు. 
ఆ క్షణమే ఎడిసన్ విజయం సాధించడంలో పాటించిన సహనాన్ని అందరూ గ్రహించారు.
ఎడిసన్ వేయి సార్లు ఓటమి చవిచూసి విద్యుత్ బల్బుని కనిపెట్టాడు. తీరా ఆ బల్బు సహాయకుడి చేజారి కింద పడి పగిలినప్పుడు సైతం ఎడిసన్ ఏమాత్రం కలవరపడలేదు. ఆందోళన చెందలేదు. ఆ క్లిష్టపరిస్థితిలోనూ ఎడిసన్ శాంతంగానే ఉం
డిన గొప్ప వ్యక్తి.

కామెంట్‌లు