కరి మ్రింగిన వెలగపండు
 *ఏనుగు తను మ్రింగిన వెలగ పండులోని గుజ్జుని, ఆ పండుని ఏ మాత్రం పగలకొట్టకుండా, ఎలా ఆస్వాదిస్తోంది?*
🌼🌼🌼🌼🌼🌼🌼🌼
'కరి మ్రింగిన వెలగపండు’ అనగా ‘ఏనుగు తిన్న వెలగ పండు’ అని, ఏనుగు యొక్క గొప్పదైన జీర్ణశక్తి వలన, అది మ్రింగిన వెలగ పండు, అలాగే ఉండి దానిలోని గుజ్జు మాయమౌతుందని తెలుగు కవులు వ్రాశారు.
కానీ, విన్న, చదివిన, పరిశీలించిన వాటి ప్రకారం,
“అమరకోశంలో విశేషార్ధాల్లో చూస్తే, కరిః కపిత్థ కోసోత్థహా అని ఒక అర్ధం ఉంది.
"కరి అంటే, వెలగపండులో తనంత తానుగా పుట్టే ఒక పురుగు అని అర్ధం.” కంటికి కనపడని ఒక క్రిమి.”
తెలుగులో కరి అంటే ఏనుగు అనే అర్ధంలో ప్రచారంలో ఉండడం వలన, కరి అంటే ఏనుగు అని పొరపాటు పడడం వల్ల, కరి మింగిన వెలగపండు అంటే ఏనుగు మింగిన వెలగపండు అనే కధ ప్రచారంలోకి వచ్చింది. ఏనుగు వెలగపండును తిన్న తర్వాత, గుజ్జును తినేసి, పెంకు పగలకుండా వెలగపండును పండులా విసర్జించడాన్ని ఎవరూ చూడలేదు. మావటి వాళ్ళు కూడా ఎవరూ చూసినట్టు చెప్పలేదు. అందువలన ఏనుగుకు అలాంటి శక్తులేవీ లేవు.
ఈ విషయం వెలగచెట్టును గమనిస్తే స్పష్టంగా తెలుస్తుంది. వెలగ చెట్టుకు ఉన్న కాయల్లో కొన్ని డొల్లల్లా వేలాడుతూ, గాలికి ఊగుతూ కిందపడిపోతాయి. అవి పగలకొట్టి చూస్తే అందులో గుజ్జు ఉండదు. వెలగకాయలో తనంత తానుగా ఒక క్రిమి పుడుతుంది. ఈ క్రిమినే సంస్కృతంలో కరి అంటారు. ఈ పురుగు వెలగపండులోని గుజ్జంతా నల్లగా మార్చేసి డొల్లగా చేసెస్తుంది.
ఆంధ్రుల సాంఘిక చరిత్రలో, శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు కూడా ఈ విషయాన్ని చర్చించారు. సంస్కృతం లో ‘గజ భుక్త కపిత్థవత్ ’ అని గలదు. దీనికి “గజ క్రిమి రూపేణ” అని వ్యాఖ్య. కంటికి కనపడని క్రిమి వెలగ కాయ లోనికి ప్రవేశించి, గుజ్జు నంతటిని నల్లగా మార్చి వేస్తుందని, ‘కరి అనగా నలుపు ’అని, “ కరి మ్రింగిన ”అంటే, “నల్లగా మారిన ” అని అర్థం చెపుతున్నారు.
అందువలన ఇక్కడ కరి అంటే ఏనుగు అనే అర్ధంలో తీసుకోరాదని స్పష్టమౌతోంది. 
*సర్వేజనాస్సుఖినోభవంతు*
🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
Nagarajakumar.mvss

కామెంట్‌లు