జ్ఞాన సంపదే శ్రేష్టం; -:సిహెచ్.సాయిప్రతాప్
వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసులోనే పరిపూర్ణజ్ఞానం గలవారిని జ్ఞానవృద్ధులంటారు.  అనుభవ జ్ఞానం అన్నింటికన్నా గొప్పదంటారు. కొందరికి పుట్టుకతో లభించే జ్ఞానం కూడా తక్కువేమీ కాదు. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి శిష్యులు ఉచ్చారణ దోషాలను ఎత్తి చూపి శాప గ్రస్తుడయ్యాడని పురాణ కథ. ప్రపంచ భౌతిక  సంపదలకు హెచ్చు తగ్గు లుంటాయి కాని జ్ఞాన సంపద పంచిన కొద్దీ పెరుగుతుంది.అందుకు ఉదాహరణ విదురుడు కారణ జన్ముడు. జ్ఞాన వృద్ధుడిగా పేరెన్నికగలవాడు. ధృతరాష్ట్రుడు వంటి వారికి నీతి బోధ చేసినవాడు. అనేక ధర్మ సందేహాలను తీర్చిన ప్రాజ్ఞుడు. ఆయన బోధలు విదురనీతి పేరుతో లోక ప్రసిద్ధం. ఆయన జ్ఞానసంపద వలనే లోక ప్రసిద్ధం అయ్యాడు. అందుకే జ్ఞానసంపదే శ్రేష్టం అని శాస్త్రం చెబుతోంది.

మానవులు వికాసవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి, తమ జన్మను చరితార్ధం చేసుకోవడానికి అవసరమైన ప్రధాన సంపద జ్ఞాన సంపదేఆధ్యాత్మిక వేత్తల్ల నిశ్చితాభిప్రాయం. ఈ జ్ఞానసంపద గలవారు ధన, ధాన్య, గృహ, ధైర్య, వస్తు, వస్త్ర, వాహనాది సంపదల్లో కొన్నిటిని లేదా అన్నిటినీ ప్రయత్నంతో సమకూర్చుకొనగలుగుతా రు. కానీ, ధనధాన్యాది ఇతర సంపదలు గలవారు సులభంగా జ్ఞానసంపదను చేజిక్కించుకోలేరు. ఇతర సంపదలెన్ని ఉన్నా శ్రద్ధాసక్తులు, పట్టుదల, తగిన ప్రయత్నం లేకుండా జ్ఞానసంపద దరిచేరదు. లోకంలో ఎన్ని సంపదలున్నా అవేవీ జ్ఞానధనంతో సమానం కాలేవు. జ్ఞానధనమే ధనాలన్నిటిలోనూ ప్రధానమైనది. 

కామెంట్‌లు