సుప్రభాత కవిత - బృంద
తరలివచ్చిన కిరణాలు
వెలుగు తెచ్చిన మెరుపులు
కలుగున దాగిన తిమిరాలు
కరిగిపోయిన కలతలు

సిగ్గుపడ్డ తూరుపు
నింపుకుంది బుగ్గల ఎరుపు
మౌనమైన  గిరిశిఖరాలను
ముద్దాడుతున్న మబ్బులు

తీరంతో కెరటాల సయ్యాటలు
నురగ మిగిల్చి కడలి చేరిన అలలు
కాలచక్ర వేగానికి
ఇసుకలా జారిపోయే క్షణాలు

కడుపున బడబాగ్నిని దాచి
గంభీరంగా  కనపడే  సంద్రం
అంతులేని ఎదురుదెబ్బలకు
కరడుకట్టిన అంతరంగం

ఆరాట పోరాటాల
కెరటాల కేళి.. జీవితం
అస్తిత్వానికి పోరాటం
అన్నీ కావాలనుకునే ఆరాటం

చిత్రమైన జీవన రీతులు
కేవలమైన బ్రతుకు విలువలు
అంతంలో అర్థమయే అంతరాలు
దిద్దుకోలేని తప్పిదాలు

కోరుకున్న కోరికలన్నీ
తాయిలంగా తెచ్చే
ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు