భీముడికి ఆంజనేయుడి అనుగ్రహం;- - యామిజాల జగదీశ్

 ఆంజనేయుడు అనగానే మనకు గుర్తుకొచ్చేది వాల్మీకి రామాయణం. అందులోనూ సుందరకాండ మరీ ముఖ్యంగా! కానీ మహాభారతంలోనూ అనగా త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగంలో ఆంజనేయుడు వస్తున్నాడు.
అప్పుడు వాయువు అంశమైన భీముడిని కలుస్తున్నాడు ఆంజనేయుడు.
ఇలా అంటే మీరొక ప్రశ్న అడగొచ్చు.
ఆంజనేయుడు, భీముడు వాయువు అంశమే కదాని!
అవును. దేవ పురుషులు ఎన్ని రూపాలలోనైనా కనిపిస్తారు.
ఇంకొక ఉదాహరణ...కృష్ణుడు, వేదవ్యాసుడు ద్వాపరయుగంలో విష్ణుమూర్తి అంశమై జనించారు.
సరే, విషయానికొద్దాం.
ద్రౌపది కోరుకున్న సౌగంధికా పుష్పాన్ని కోసి తీసుకురావడానికి భీముడు అడవిమార్గంలో పోతున్నాడు.
అయితే అక్కడొక చోట దారికడ్డంగా ఓ వానరం కూర్చుంది.
భీముడు "ఓ వానరమా! పక్కకు తప్పుకుని దారివ్వు" అన్నాడు.
"నాకు లేచేందుకు శక్తి లేదు. నేను వృద్ధ కోతిని. తప్పనిసరిగా వెళ్ళి తీరాలనుకుంటే నన్ను దాటుకుంటూ వెళ్ళు" అంది వానరం.
"ఓ ప్రాణిని దాటుకుంటూ వెళ్ళకూడదన్నది శాస్త్రం. కనుక నేను నిన్ను దాటుకుంటూ పోదలచుకోలేదు. లేకుంటే హనుమంతుడు సముద్రాన్ని దాటినట్లు నిన్నూ పర్వతాన్నీ ఒక్క దూకు దూకి వెళ్ళే వాడినే" అన్నాడు భీముడు.
"నర శ్రేష్ఠా! సముద్రాన్ని దాటిన ఆ హనుమంతుడెవరు? నీకు తెలిస్తే నాకు చెప్పవూ. వింటాను" అన్నది కోతి.
 
"రామ ధర్మపత్నిని అన్వేషించడంకోసం నూరు యోజనాల పొడవున్న సముద్రాన్ని దాటినవాడు, నాకు అన్న అయిన హనుమంతుడు నీకు తెలీదా? బలంలోనూ నేనతనికి సమానుడను. ఓ పని మీద నేనిటు వచ్చాను. దారివ్వు. లే. నేను చెప్పింది వినకుంటే నిన్ను యమలోకానికి పంపుతాను" అని హెచ్చరించాడు భీముడు.
"ఓ వీరుడా! దోషరహితుడా! కోపాన్ని తగ్గించు. వృద్ధాప్యంవల్ల నాకు లేచే శక్తి లేదు. నన్ను దాటుకుంటూ పోవడం నీకు అభ్యంతరమనుకుంటే నా తోకను పక్కకు జరిపి వెళ్ళు. నేనేమీ అనుకోను" అన్నాడు ఆంజనేయుడు తాపీగా.
భీముడికి తన భుజబలంమీద ఒకింత గర్వముంది. ఈ వృద్ధ వానరం తోకను ఎత్తి పక్కకు తోస్తాను. అదెంతమాత్రం అనుకున్న భీముడు తోకను పట్టుకున్నాడు.
కానీ భీముడు రవ్వంత కూడా ఆ వానరం తోకను జరపలేకపోయాడు. భీముడు విస్తుపోయాడు. రెండు చేతులతోనూ లాగాలనుకున్నాడు భీముడు. కానీ అదీ కుదరలేదు. దేహమంతా చెమటతో తడిసింది. సిగ్గుపడి తల వంచి నిల్చున్నాడు.
"నువ్వెవరు? నన్ను అనుగ్రహించు. నువ్వు రుషుల దేవుడివా? గంధర్వుడివా? నువ్వెవరు? శిష్యుడడుగుతున్నాను. నీకు శరణం" అన్నాడు భీముడు.
బలవంతుడిని చూస్తే భీముడిలో ఎక్కడాలేనంత భక్తి పుట్టుకొస్తుంది.
"ఓ పాండవవీరా! సర్వలోకాలకు ప్రాణాధారమైన వాయుపుత్రుడైన హనుమంతుడను నేను. తమ్ముడా భీమా! యక్షులు, రాక్షసులు ఉండే ఈ దారిలో నువ్వెళ్తే ప్రమాదానికి లోనవుతావనే నిన్ను నేను అడ్డుకున్నాను. ఇది దేవలోకం వెళ్ళే దారి. ఇందులో మనుషులు వెళ్ళలేరు. నువ్వు వెతుక్కుంటూ వచ్చిన సౌగంధిక పుష్పవృక్షం ఉండే నీటి కొలను అదిగో అక్కడుంది" అని అటువైపు చూపించాడు ఆంజనేయూడు. 
"వానరశ్రేష్ఠా! నిన్ను చూడటంవల్ల నన్ను మించిన భాగ్యవంతుడు ఇంకెవరూ ఉండరు. సముద్రాన్ని దాటిన ఆ రూపాన్ని చూడాలని నా ఆశ" అని భీముడు నమస్కరించాడు వినయపూర్వకంగా.
వెంటనే ఆంజనేయుడు తన రూపాన్ని పెంచి మరో పర్వతంలా విస్తరించి నిల్చున్నాడు. 
భీమసేనుడు అప్పటివరకూ విని సంతోషించడమే. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా తన సోదరుడి దివ్యరూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. సంతోషించాడు.
సూర్యుడిలా ప్రకాశించే ఆ తేజస్సుకి తట్టుకోలేక కళ్ళు మూసుకున్నాడు. 
"భీముడా! ఇంతకన్నా రూపాన్ని పెంచి చూపించే సమయం కాదిది. పగవారి ముందు ఈ శరీరం మరింత పెరుగుతుంది" అన్నాడు ఆంజనేయుడు.
అనంతరం ఆంజనేయుడు పూర్వంలా తన రూపాన్ని కుదించి భీముడిని ప్రేమతో కౌగిలించుకున్నాడు. ఆంజనేయుడి ఆలింగనంతో భీముడి శ్రమ అంతా తొలగిపోయి అంతకుముందుకన్నా ఎక్కువ బలం వచ్చింది. దివ్య తేజస్సూ వచ్చిందంటాడు వ్యాసభగవానుడు.
 "వీరుడా! నువ్వుండే చోటుకి వెళ్ళు. ఎంతో ఆనందంగా ఉంది. నీకు ఏం కావాలో కోరుకో" అన్నాడు ఆంజనేయుడు.
"వానర శ్రేష్ఠా! నేను నిన్ను చూడటంతో పాండవులందరం భాగ్యవంతులమయ్యాం. నీ బలంతో మేము శత్రువులందరినీ జయిస్తాం" అన్నాడు భీముడు ఆనందంగా.
అంతట ఆంజనేయుడు "నువ్వు మహాభారతయుద్ధంలో ఎప్పుడు సింహనాదం చేస్తావో, అప్పుడు నా గొంతూ నీ గొంతుతో కలిసి శత్రువులను గజగజా వణికిస్తుంది. నీ సోదరుడు అర్జునుడి రథానికున్న పతాకంలో కృష్ణుడి ఆదేశంగా నేను కచ్చితంగా ఉంటాను. మీకు విజయం తథ్యం" అన్నాడు. 
జై శ్రీరాం! 
సర్వం కృష్ణార్పణం!!

కామెంట్‌లు