సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-177
మజ్జనోన్మజ్జన న్యాయము
******
మజ్జనం అంటే స్నానము,మునుక అని అర్థం.మజ్జనోన్మజ్జ అంటే ప్రవాహములో మునిగి తేలడమని అర్థం.
జన్ అంటే పుట్టడం లేదా ఉత్పత్తి చేయడం.జన అంటే మనుజుడు,జీవి,మహర్లోకమునకు పైనున్న లోకము.
ప్రవాహంలో పడి మళ్ళీ గట్టు చేరలేకపోయే వాడు మునుగుచూ,తేలుచూ, రక్షించే వారికై వెదుకుతూ చాలా బాధ పడుతూ వుండటమనే ఉద్దేశంతో ఈ మజ్జనోన్మజ్జన న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు. 
అంటే సంసార సాగరములోని జీవుని వలె.
 సంసారాన్ని సాగరంతో పోలుస్తూ ఉంటారు.అందులోకి దూకిన తర్వాత ఎవరికి వారే ఈత ఈదాలి. మునగడం తేలడం వ్యక్తి యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది.
 సంస్కారం అనే సాగరం నల్లేరు మీద నడకలా ఉండదు.అన్నీ ఆటుపోట్లు సుడిగుండాలే. కొందరి కష్టాలు అలల్లా కొట్టుకొని పోతూ వుంటే, మరి కొందరి జీవితాలు సుడిగుండాల్లో చిక్కుకుని అక్కడక్కడే బయటికి రాలేక అల్లాడుతూ, తిరుగుతూ ఉంటాయి.
అందుకే  సుమతీ శతక కర్త ఇలా అంటాడు.
"మాయల సంసారముకై/ మాయలలో బొరలుచుండు మనుజుడు మరితా/మాయను మదిలో దలచిన/ మాయలనే ముక్తి గలుగు మహిలో సుమతీ !"
మాయదారి సంసార మోహములో నిండిన  మనిషి ఆ మాయలోనే మునిగి పోతూ ఉంటాడు.ఆ మాయలను తొలగించుకొంటేనేే మనిషికి ముక్తి అంటారు.
ఏ తీరుగ నను దయ చూచెదవో/ ఇనవంశోత్తమ రామా-నా తరమా భవ సాగర మీదను నలిన దళేక్షణ రామా "...అని భక్త రామదాసు పాడుతారు.
ఇలా సంసార సాగరాన్ని, బతుకనే సముద్రాన్ని ఈదే వారందరికీ తెలుసు. అది ఎంత కష్టమో... "మునగడమా ,తేలడమా! అవలీలగా తీరం చేరడమా! "అనేది ఆయా వ్యక్తుల మోహ వ్యామోహాలపై,మనో ధైర్యం, స్థైర్యంపై ఆధారపడి ఉంటుందనేది ఈ "మజ్జనోన్మజ్జన న్యాయము" ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు