"తానొకటి తలిస్తే దైవమొకటి తలచాడు"( సామెత కథ)- ఎం బిందుమాధవి

 మనిషి అన్నీ తన ఇష్టప్రకారమే జరుగుతుందని...జరిపించుకునే తెలివి, సత్తా తనకున్నాయని భావిస్తాడు. కొందరికి మాత్రమే అలా అనుకున్నవి జరుగుతాయి. చాలా మంది విషయంలో చదువు, పెళ్ళి, జీవితం అనుకున్న పంధాలో కాక వేరే విధంగా జరుగుతాయి. 
అందమైన భార్య కావాలని కోరుకున్న వ్యక్తి కారణాంతరాల వల్ల ఒక అనాకారిని జీవిత భాగస్వామిగా స్వీకరించవలసి రావచ్చు! కొందరికి అనుకున్న దాని కంటే మెరుగుగా ఉండచ్చు..మరి కొందరి విషయంలో పూర్తి విరుద్ధంగా జరగచ్చు. 
ఇంజనీరింగ్ చదవాలనుకుని డాక్టర్స్ అయిన వారుంటారు. పెద్ద సాంకేతిక విద్యలు చదివి సంబంధమే లేని సంగీత కళాకారులుగా..నటులుగా..తమది కాని రంగంలో పారిశ్రామిక వేత్తలుగా స్థిరపడతారు. 
అలాంటప్పుడు ఈ సామెత వాడతారు. 
@@@@
ఎల్ ఐ సి లో మేనేజర్ గా  పని చేస్తున్న కుటుంబరావు గారి ప్రధమ సంతానం శ్రియ. తరువాత నాలుగైదేళ్ళ తరువాత వరుసగా పుట్టిన పిల్లలు రఘు..ప్రతాప్. 
కుటుంబరావు గారికి కూతురు శ్రియ అంటే పంచ ప్రాణాలు. 
తను ఇంట్లో ఉన్నంత సేపు కూతురిని ఏదో ఒక కారణంతో పిలిచి పక్కన కూర్చోపెట్టుకుని కబుర్లు చెబుతూ ఉంటాడు. 
"అమ్మాయి మ్యాత్స్ పీజి కోసం చెన్నై ఐఐటి లో చేరతానంటోందండి" అన్నది సావిత్రి. 
"దాన్ని చూడకుండా నేనుండలేను అని నీకు తెలుసు కదా సావిత్రీ. ఏదో ఒకరకంగా నచ్చ చెప్పాలి కానీ..నువ్వు కూడా దానితో చేరి తాళం వేస్తే ఎలా" అన్నారు. 
"నాన్నా ప్రీమియర్ సంస్థల్లో చదివితే ఆ విలువే వేరుగా ఉంటుంది! మా ఫ్రెండ్ కి మైక్రో బయాలజీ లో సీట్ వచ్చింది. మేమిద్దరం కలిసి ఒకే రూం లో ఉంటాం. చెన్నై కి కలిసి వెళ్ళి కలిసి రావచ్చు. నేనేం ఒంటరిగా ఉండక్కరలేదు. ప్లీజ్ నాన్నా" అన్నది. 
"ఇక్కడ పీజి సెంటర్ లో చేరితే హాయిగా ఇంట్లోనే ఉండి వెళ్ళి రావచ్చు. ఎక్కడైతే ఏముందమ్మా? అంతా నీ తెలివితేటలే కదా" అన్నారు కుటుంబరావు గారు..కూతురి చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ. 
@@@@
"ఏమండి మొన్న బొమ్మల కొలువు పేరంటంలో ఒక పెద్దావిడ కలిసింది. తన మనవడికి సంబంధం కోసం తెలిసిన వారందరి దగ్గర వాకబు చేస్తోందిట. ఆ అబ్బాయి రిలయన్స్ కంపెనీలో పని చేస్తున్నాడుట. అమెరికా వెళ్ళే ఆసక్తి లేని అమ్మాయిల కోసం వెతుకుతున్నారుట. ఇంజనీరింగ్ పూర్తయి..సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే ఆడపిల్లలైతే..రేపో మాపో ప్రాజెక్టని అమెరికా వెళ్ళటానికే  ఇష్టపడతారు. అందుకని ఇంజనీరింగ్ చదువు కాని అమ్మాయిల కోసం వెతుకుతున్నారుట."
"మమ్మల్ని పేరంటానికి పిలిచిన ఆవిడ...మన అమ్మాయి గురించి చెప్పింది. ఆ పెద్ద ఆవిడ నా దగ్గర కూర్చుని మాట్లాడి తన వివరాలు చెప్పి..మన వివరాలడిగింది. ఆ సంబంధం కనుక్కుందామా" అన్నది సావిత్రి. 
"ఇప్పుడే దాని పెళ్ళికి తొందరేముంది. ఈ కాలం ప్రమాణాల్లో అది ఇంకా చిన్న పిల్లే. పైగా మొన్నే కదా పీజి లో చేరింది. హాయిగా చదువుకోనీ దాన్ని. ఇప్పటి నించీ అత్తగారు ..బాధ్యతలు ..ఆరళ్ళు .." అన్నాడు కుటుంబరావు గారు. 
"నాకు ఆ ఈడుకి పెళ్ళి అవలేదా? మీ చెయ్యి పుచ్చుకు మీ ఇంటికి రాలేదా? మీది మరీ చోద్యం..మీ అమ్మాయి అయితే ఒక లెక్క..పరాయి అమ్మ కన్న పిల్ల అయితే ఒక లెక్కానా" అన్నది నవ్వుతూ! 
"మీ నాన్న ముగ్గురికి చెయ్యాలి కనక తొందర పడ్డారు. నాకేముంది ముచ్చటగా ఒక్క కూతురు. నా కూతురికి రాజా లాంటి సంబంధం వస్తుంది. రెండేళ్ళాగి దాని చదువు అయ్యాక చూద్దాంలే" అని పేపర్లో తల దూర్చేశాడు. 
ఈ మధ్య కుటుంబ రావు గారికి క్యాంపులెక్కువయ్యాయి. నెలలో మూడొంతులు బయట ఊళ్ళల్లోనే ఉంటున్నారు. 
ఇంటి బాధ్యత అంతా సావిత్రే చూసుకుంటోంది. 
రెండేళ్ళు ఇట్టే గడిచిపోయి శ్రియ పీజి అయిపోయింది. క్యాంపస్ సెలెక్షన్ లో ఉద్యోగం వచ్చింది. చేరతానని తండ్రితో చెబితే..
"ఉద్యోగం లో చేరితే అలిసిపోతావమ్మా. పెళ్ళి సంబంధాలు చూస్తున్నాం. మన బంధువులందరికీ చెప్పి పెట్టాం. వచ్చే అబ్బాయి ఒక చోట, నువ్వొక చోటా అయితే ఇబ్బంది పడతారు. ఒక సారి ఉద్యోగంలో అంటూ చేరాక అతనున్న చోటికి నువ్వు మారాలా..నువ్వున్న చోటికి అతను రావాలా అనే పంతాలు వస్తాయి. సమస్యని అంత దూరం ఎందుకు తీసుకెళ్ళటం" అన్నారు. 
శ్రియ సంబంధాల వేటలో భాగంగా ..పెళ్ళి సంబంధాల గురించి అయిన వాళ్ళ దగ్గరనించి ఏ సమాచారం రాకపోయేసరికి... ఆన్లైన్ పెళ్ళిళ్ళ బ్యూరో లో వివరాలు రిజిస్టర్ చేశారు. శ్రియ వివరాలు నచ్చి ఫోన్ చేసిన పెళ్ళికొడుకులెవ్వరూ కుటుంబరావు గారికి నచ్చలేదు. వీళ్ళకి నచ్చిన సంబంధాలు  అవతలి వారికి నచ్చట్లేదు..పిల్ల ఉద్యోగం చెయ్యట్లేదని..వేరే దేశాలు పంపించటం ఇష్టం లేదంటున్నారని వగైరా వగైరా కారణాలతో... 
అలా కాలం నడుస్తూ ఉండగా..ఈ మధ్య కుటుంబరావు గారికి తరుచూ దగ్గు..అడపా దడపా జ్వరం రావటం జరుగుతోంది. "క్యాంపులు ఎక్కువ అవటం వల్ల మీ ఆరోగ్యం దెబ్బ తిన్నది రావు గారూ. మీ సమస్య టీబి...బాగా ముదిరింది. బలమైన ఆహారం తీసుకుంటూ... మంచి మందులు వాడుతూ..రెస్టుగా ఉంటే తప్ప కోలుకోవటం కష్టం" అన్నారు డాక్టర్ సంపత్. 
కుటుంబ రావు గారు కొన్నాళ్ళు ఊళ్ళోనే ఆఫీసుకి వెళ్ళొచ్చారు. ఇప్పుడు అదీ లేదు..సెలవులో ఉంటున్నారు. 
"సావిత్రీ ఈ విషయం పిల్లలకి తెలియనివ్వకు..ముఖ్యంగా నా చిట్టి తల్లికి. అది బెంగ పడుతుంది. ఈ ఏడు ఎలాగోలా దాని పెళ్ళి చేసేస్తే..మగ పిల్లలు ఎలాగోలా బతికేస్తారు" అన్నారు. 
కుటుంబ రావు గారికి అనారోగ్యం వచ్చి చూస్తూ చూస్తూ ఆరు నెలలు గడిచాయి. పిల్ల పెళ్ళికి అనువైన సంబంధం కుదరలేదని మనో వ్యధ పట్టుకుంది కుటుంబ రావు గారికి. ఆ దిగులుతో ఆరోగ్యం మరింత దిగజారింది. ఏ మందులు ఆయన రోగాన్ని నయం చెయ్యలేక పోయాయి. 
ఈ మధ్య రావు గారి హృదయం కూడా చెప్పిన మాట వినక ఇబ్బంది పెడుతోంది. 
సిక్ లీవ్, మెడికల్ లీవ్ కూడా అయిపోయింది. ప్రస్తుతం లాస్ ఆఫ్ పే లో ఉన్నారు. 
ఏ విషయాన్నైనా దాచచ్చు కానీ శరీరంలోని అనారోగ్యాన్ని కుటుంబ సభ్యుల ముందు దాచటం కష్టం! శ్రియకి నాన్నగారి టీబి గురించి..ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి స్పష్టంగా తెలుసు. పైకి మాట్లాడితే ఆయన ఇంకా దిగులు పడతారని గుంభనగా తిరుగుతోంది.
"అమ్మా...బంగారు తల్లీ నా ఆరోగ్యం ఇప్పుడు చాలా నయంగా ఉంది. ఎటు పోయి ఎటొచ్చినా ఇంటికి పెద్ద కూతురిగా తమ్ముళ్ళని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమ్మా! రఘు ఇంజనీరింగ్ ఇంకో ఏడాది అయితే అయిపోతుంది. వాడికి మంచి ఉద్యోగమే వస్తుంది. ప్రతాప్ ఇంకా మొదటి సంవత్సరంలోనే ఉన్నాడు. వాళ్ళ చదువులు పూర్తయ్యేవరకు నీకు కొంచెం భారంగా ఉండచ్చు. నా పిఎఫ్, గ్రాచ్యుయిటీ వాళ్ళ చదువులకి సరిపోవచ్చు. నా వైద్యానికి బాగానే ఖర్చు అయింది. అమ్మకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. తిండికి, గుడ్డకి లోటు ఉండదు."
"పెళ్ళికి ముందు మీ అమ్మ ఉద్యోగం చేస్తుంటే నేనే మానిపించాను. మిమ్మల్ని పోషించటానికి..తన జీవితంలో ఏర్పడే శూన్యం నించి బయటపడటానికి.. ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు మళ్ళీ ఉద్యోగంలో చేరలేదు."
"నిన్ను కూడా ఉద్యోగంలో చేరద్దని నేనే ఆపాను. నా మాటని నువ్వు, మీ అమ్మ కూడా గౌరవించారు. నేనే తప్పు చేశాను. కానీ ఇప్పుడు..ఈ స్థితిలో మిమ్మల్నందరినీ నిరాధారంగా చేసి వెళుతున్నాను."
"ఏదీ మనమనుకున్నట్టు జరగదు. అదే జీవితం! ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో తెలియనివ్వదు! ఎట్టి పరిస్థితుల్లోను ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు."
"తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది" అంటారు పెద్దలు. 
"నా చిట్టి తల్లికి బంగారం లాంటి వరుడ్ని తెచ్చి పెళ్ళి చేసి నా కళ్ళ ముందే ఉంచుకోవాలనుకున్నాను. అలా ఆలోచించే క్రమంలో తెలియకుండా పెద్ద పొరపాటే చేశాను. నా తప్పుకి నన్ను క్షమిస్తావా అమ్మా" అన్నారు. 
"నాన్నా అలా మాట్లాడకండి. మీరు మంచి ఉద్దేశ్యంతోనే ఆలోచించారు. మమ్మల్ని ప్రేమతో పెంచారు. మంచి-చెడు నేర్పారు. అనుకోని పరిస్థితులు ఎదురవ్వటమే జీవితమని మీరే చెప్పారుగా నాన్నా. అమ్మని, తమ్ముళ్ళని బాగా చూసుకుంటానని మాటిస్తున్నాను నాన్న" అన్న కూతురు మాట చెవిన పడిన మరుక్షణం కుటుంబ రావుగారి ప్రాణాలు అనూహ్యంగా గాలిలో కలిసిపోయాయి. 
@@@@
కుటుంబరావు గారు శివైక్యం అయి నెల రోజులు గడిచింది. 
ఆయన సహోద్యోగి..శ్రేయోభిలాషి పట్టాభిరామయ్య సలహా మీద ...లాంఛనాలు అన్నీ పూర్తి అయ్యాక శ్రియ కుటుంబ రావు గారి ఆఫీసులో సానుభూతి ఆధారంగా ఇచ్చే ఉద్యోగాలు (compassionate grounds) లో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టింది. 
శ్రియకి వయసు ముప్ఫై దాటింది. అప్పటి వరకు ఉద్యోగానుభవం లేదు. ఏ ఇంజనీరింగో చదివి ఉంటే ఆ దారి వేరు. ఏ కంప్యూటర్ డిప్లొమానో  చేసి ఉంటే ఐటి శాఖలో వేసేవారు. అదీ ఇదీ కాకుండా ....ఆమె చదివిన మ్యాత్స్ సబ్జక్ట్ కి ఆ ఆఫీసులో అకౌంట్స్ శాఖలో జూనియర్ పోస్ట్ లో వేశారు.
'నాన్నా మా ఫ్రెండ్స్ కంప్యూటర్ కోర్సులు చేస్తున్నారు...నేను కూడా జాయిన అవ్వనా' అంటే 'వద్దమ్మా ...నా కూతురు జాబ్ చెయ్యాల్సినంత అగత్యం ఏముంది'..అన్న నాన్న ఆఫీసులోనే గుమాస్తాగా చేరాల్సి వచ్చింది అనుకుంది శ్రియ మనసులో! 
నీడ పట్టున తల్లిదండ్రుల ప్రేమాభిమానాల మధ్య హాయిగా సాగిపోతున్న శ్రియ బతుకు ఇప్పుడు రోడ్డున పడింది. తల్లిని, తమ్ముళ్ళని చూసుకోవలసిన బాధ్యత తన భుజ స్కంధాల మీదికెత్తుకోవలసి వచ్చింది. పెళ్ళి గురించి ఆలోచించే పరిస్థితే లేదు. 
"ఓడలు బళ్ళు అయ్యాయమ్మా.. పెళ్ళి చేసి పంపించ వలసిన ఒక్కగానొక్క కూతురు నెత్తి మీద ఇంటి పోషణ బాధ్యత  పెట్టాం. ఒక్క పెన్షన్ తో జీవితాలు సజావుగా సాగవు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నేను కూడా నా డిగ్రీ పుస్తకాలు దులిపి నెమ్మదిగా ట్యూషన్స్ చెప్పటం మొదలుపెడతాను. ఇంటికి ఆసరా అవుతుంది. రేపు నీకు పెళ్ళి కుదిరితే... చెయ్యాలన్నా చేతిలో డబ్బుండాలి". 
"రెండేళ్ళల్లో మన జీవితాలు గాడిన పడతాయని ఆశిస్తున్నాను. కాలాతీతమైనా మన పరిధిలో మంచి సంబంధం చూసి నీకు పెళ్ళి చేస్తే నాన్న గారి ఆత్మ శాంతిస్తుంది" అన్నది మనస్ఫూర్తిగా కూతురిని దగ్గరకి తీసుకుని. 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం