సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-181
మధు మక్షికా న్యాయము
******
మధు మక్షికా అంటే తేనెటీగ.
"తేనెటీగ సేకరించిన తేనె మనుష్యుల పాలు అయినట్లుగానే మనుష్యులు సంపాదించిన సొమ్ము కానీ, కష్టం కానీ  ఇతరుల పాలు అవుతుందనే అర్థం వచ్చేలా ఈ "మధు మక్షికా న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు ."
కష్టపడి సంపాదించిన సొమ్ము పరుల పాలు ఎలా అవుతుందో చెప్పిన వేమన పద్యాన్ని చూద్దాం.
ధనము కూడబెట్టి ధర్మంబు సేయక /తాను తినక లెస్స దాచుగాక/ తేనెటీగ గూర్చి తెరువరికీయదా/విశ్వధాభిరామ వినురవేమ" 
తేనెటీగ ఎంతో కష్టపడి సంపాదించిన తేనెను దారిలో పోయే మనుషులెవరో  దోచుకు పోయినట్లు, తాను తినకుండా కష్టపడి దాన ధర్మాలు చేయకుండా కూడబెట్టిన ధనాన్ని ఎవరో ఒకరు దోచుకోకుండా ఉండరు  అని అర్థం.
అర్థం ఇదే అయినా  అహంకారి, పిసినారి సంపాదించిన సొమ్ము తాము తినలేరు. చివరికి వారి సొమ్ము ఇతరుల పరం అవక తప్పదని  కాకుత్సం శేషప్ప కవి  ఏమన్నారో చూద్దాం.
 "...విత్తమార్జన చేసి విర్రవీగుటె  కానీ/ కూడ బెట్టిన సొమ్ము కుడువబోడు/ పొందుగా మరుగైన భూమిలోపల పెట్టి/ దాన ధర్మము లేక దాచి దాచి/ తుదకు దొంగల కిత్తురో? దొరలకవునో?/ తేనె జుంటీగలియ్యవా  తెరువరులకు.."
 ఇవి రెండూ ఇంచుమించు దగ్గరగా ఉన్నా మరో కోణంలో చూస్తే ఎంతో మంది శ్రమ జీవులు అలుపెరుగని  కష్టం చేస్తుంటే ఆ కష్టం యొక్క  ఫలాలను సుఖ సౌఖ్యాలను  ఆధిపత్య రూపమైన యజమానులు పొందుతున్నారనే కోణంలో చెప్పవచ్చు.
 ఏది ఏమైనా  "కష్టమొకరిది సుఖం మరొకరిది" అని ఈ "మధు మక్షికా న్యాయము" ద్వారా మనం తెలుసుకోగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది కదండీ!"
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు