మాటలు వచ్చిన చిలుక ;- -డా.ఎం.హరికిషన్

 ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను ఒకసారి సంతలో ఒక మాటలు వచ్చిన చిలుకను కొన్నాడు. ఇంటిలో ఒక అందాల పంజరం తయారు చేయించి అందులో ఉంచాడు. రకరకాల రుచికరమైన పళ్ళు తెచ్చి దానికి పెట్టసాగాడు.
ఒకసారి ఆ చిలుక "అయ్యా... నేను పక్షిని. హాయిగా రెక్కలు చాచి ఆకాశమంతా తిరుగుతూ వుంటే ఆనందంగా ఉంటుంది. అలాంటి నన్ను ఇంత చిన్న పంజరంలో బంధించడం నీకేమైనా బాగుందా. నన్ను వదులు. ఎక్కడికీ పారిపోను. ఇక్కడే ఎగురుతూ మీతోనే ఉంటా" అంది.  
కానీ ఆ ధనవంతుడు దాని మాటలు నమ్మలేదు. "నిన్ను చాలా ఖరీదు పెట్టి కొనుక్కున్నాను. నువ్వు ఎగిరిపోవని ఎలా నమ్మడం. నేను విడవను" అన్నాడు.
పాపం ఆ చిలుక చాలా దిగులు పడింది. సరిగా తినేది కాదు. ఎవరితోనూ మాటలాడేది కాదు. ఎప్పుడు మౌనంగా ఆకాశం వైపు గాలిలో ఎగిరే పక్షులను చూస్తూ ఉండేది.
దాంతో ఆ ధనవంతునికి బాగా కోపం వచ్చి చిన్న కట్టె తీసుకొని చిలుకను బాగా కొట్టాడు. "నువ్వు ఇలాగే మౌనంగా వున్నావంటే గొంతు పిసికి కాలువలో పారవేస్తా చూడు. ఏమనుకుంటా వున్నావో" అని బెదిరించాడు. పాపం అది బాధతో కళ్ళనీళ్ళు పెట్టుకుంది.   
ఆ ధనవంతునికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు. లేక లేక ఎంతో కాలానికి పుట్టాడు. అల్లారుముద్దుగా పెంచుకునేవారు. ఒకరోజు అందరూ పడుకున్నాక ఒక విషపు పాము ఇంటిలోకి వచ్చింది. అది పిల్లవాడు నిద్రపోతున్న ఉయ్యాల పైకి ఎక్కడం మొదలుపెట్టింది. చిలుక దానిని చూసి వెంటనే "పాము... పాము..." అంటూ గట్టిగా రెక్కలు కొట్టుకుంటూ, పంజరాన్ని అటూ ఇటూ ఊపుతూ అరవసాగింది.   
ఆ చప్పుడుకి అందరూ అదిరిపడి లేచారు. గబగబా దీపాలు వెలిగించారు. ఇంకేముంది పాము ఉయ్యాల మీదికి ఎక్కుతూ కనబడింది. వెంటనే ఆ ధనవంతుడు ఆ పాము తోక పట్టుకొని గిరగిరగిర తిప్పుతూ విసిరి ఇంటి బయట పడేశాడు. ఉయ్యాల నుంచి బాబును బయటికి తీసి గుండెలకు అదుముకున్నాడు.     
కళ్ళనీళ్ళతో చిలుక దగ్గరికి వచ్చి "నిన్ను ఎంత బాధ పెట్టినా... కొట్టినా... తిట్టినా... నువ్వు అవేమీ మనసులో పెట్టుకోకుండా నా బిడ్డను కాపాడావు. నీవు చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేను. హాయిగా ఎక్కడికైనా నీ ఇష్టం వచ్చిన చోటుకి ఎగిరిపో" అంటూ పంజరం మూత తెరిచాడు.     
చిలుక కిలకిలకిల నవ్వి "రోజూ మూడు పూటలూ సమయం తప్పకుండా కమ్మగా కడుపునిండా భోజనం పెట్టే మీ అందరినీ వదిలిపెట్టి నేనెక్కడికి పోతాను. ఈ ఇంటిలోనే హాయిగా ఎగురుతూ మీతోనే ఉంటాను" అంది బయటికి వచ్చి బాబు భుజం మీద వాలుతూ.
**********
కామెంట్‌లు