విప్లవించాలి;- - డాక్టర్.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఈ తెలంగాణ గడ్డలో ఏమున్నదో
ఇది మొదటినుండీ పోరాటాల పురుటిగడ్డే
అప్పుడు, కోటలతోకొట్లాట,గడీలతోగడబిడ
నిజాముతో జజ్జనకరి జనారే
ఆతర్వాత, అస్తిత్వంకోసం,ఆత్మగౌరవంకోసం
నాన్ ముల్కీ,ఇడ్లీ సాంబర్ గోబ్యాక్ ఉద్యమాలు
మొన్నటికిమొన్న మానవహారాలు, మిలియన్ మార్చులు
రోడ్డుమీదభోజనాలు,సకలజనులపోరాటాలు
ఆమరణదీక్షలు,ఆత్మబలిదానాలు
కలాలకవాతులు,ఆటపాటలధూంధాంలు
ఫలితందక్కి తెలంగాణ సాధించాం
ఆచార్య జయశంకర్ గారి ఆశయసాధన
తెలంగాణరాష్ట్ర ఆవిర్భావం మాత్రమే
అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే
మనరాష్ట్రం హరితవిప్లవం సాధించి
తెలంగాణతల్లి మెడలో హరితహారం వేయాలి
క్షీరవిప్లవంతో ఆతల్లికి పాలాభిషేకం చేయాలి
పంటలవిప్లవంతో మనతల్లి చిరునవ్వు చూడాలి
చేతివృత్తులవిప్లవంతో మనపల్లెలన్నీ మురిసిపోవాలి
చెత్తవిప్లవంతో స్వఛ్ఛతెలంగాణగా మెరవాలి
పారిశ్రామికవిప్లవంతో మన తెలంగాణ 
ఎందులోనూ తక్కువకాదని చాటాలి
చతుష్షష్టికళలవిప్లవంతో తెలంగాణ పునరుజ్జీవంపొందాలి
శాంతితెలంగాణ కోసం,భద్రతెలంగాణ కోసం
సుఖతెలంగాణ కోసం,సౌఖ్యతెలంగాణ కోసం
ఆనందతెలంగాణ కోసం, బంగారుతెలంగాణ కోసం
ఆచార్య జయశంకర్ గారు కలలుగన్న
అద్భుతరాష్ట్రంగా తయారుకావాలంటే
మనతో మనం ప్లవించాల్సిందే విప్లవించాల్సిందే !!!
*********************************

కామెంట్‌లు