శరణాగతి;- - యామిజాల జగదీశ్
 పరాశర భట్టు ఓరోజు అడవిలో పోతున్నారు. అక్కడ ఓ దృశ్యాన్ని చూసి స్పృహతప్పి పడిపోయారు. గురువుగారెంతసేపటికి తిరిగి రాకపోవడంతో శిష్యులు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళారు.
కింద పడిపోయి ఉన్న గురువుగారిని చూశారు. ఆయనను ఇంటికి తీసుకొచ్చారు.
స్పృహలోకి వచ్చిన గురువుగారిని అడవిలో ఏమైందని అడిగారు శిష్యులు.
"నేనొక దృశ్యాన్ని చూడటంతోనే పడిపోయాను" అన్నారు గురువుగారు.
"ఏమిటా దృశ్యం" అని అడిగారు శిష్యులు.
అప్పుడు గురువుగారిలా చెప్పారు...
ఒక వేటగాడు ఓ కుందేలు పిల్లను పట్టుకున్నాడు. దానిని ఓ సంచిలో పెట్టుకున్నాడు. దానినో మూటలా భుజాన వేసుకుని పోతున్నాడు.
అది చూసిన కుందేలు తల్లి ఆ వేటగాడిని వెంబడించి అతని కాళ్ళను పట్టుకుని బతిమాలింది.
తన పిల్లను విడిచిపెట్టమని కోరింది.
తల్లి కుందేలు దీనావస్థను చూసి మనసు చలించిన వేటగాడు కుందేలు పిల్లను విడిచిపెట్టాడు.
ఇదంతా చూసి నేను స్పృహకోల్పోయానన్నారు గురువుగారు.
గురువుగారు చెప్పినదంతా విన్న శిష్యులు
"స్పృహ తప్పి పడిపోవలసినంత ఏముందండీ?" అని నెమ్మదిగా అడిగారు. 
అంతట గురువుగారు
"శరణాగతి ఎలా చెయ్యాలని ఆ కుందేలు తల్లికి ఎవరు చెప్పించారు? లేక శరణాగతి కోరితే వారిని కాపాడాలని ఆ వేటగాడికి ఎవరు చెప్పించారు? కుందేలు శరణాగతిని మన్నించి వేటగాడు కుందేలు పిల్లను విడిచి పెట్టడం సామాన్యమైన విషయం కాదు. వేటగాడి కరుణ అసామాన్యం. శరణాగత వత్సలుడైన స్వామివారిని నువ్వే నాకు దిక్కు అని వేడితే  ఎంతలా అనుగ్రహిస్తాడో కదా?! దేవుడు మనల్నెప్పుడూ విడిచిపెట్టడు. తప్పక కాపాడుతాడనే నమ్మకం నా మనసులో ఇంకా కలగలేదేమిటాని నా బాధ. అందుకే స్పృహతప్పి పడిపోయాను" అన్నారు.

కామెంట్‌లు