ఔను, తల్లీకొడుకులు ప్యాసయ్యారు!;- - యామిజాల జగదీశ్
 మహారాష్ట్రలో పదవ తరగతి ఫలితాలు వెలువడ్డాయి. అవును పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు వెలువడుతాయి...ఇది మామూలే. చెప్పుకోవడానికేముంది అనొచ్చు. కానీ విషయం ఉంది కాబట్టే ఈ నాలుగు మాటలూ చెప్తున్నాను. 
2022 - 23 విద్యా సంవత్సరం కోసం మహారాష్ట్ర సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో తల్లీ కొడుకులు ప్యాసవడం విశేషం. ఈ పరీక్షా ఫలితాలు జూన్ రెండున వెలువడ్డాయి.
43 ఏళ్ళ తల్లి మోనికా తెలంగే 51.8 శాతం మార్కులతోను, ఆమె కొడుకు మందన్ తెలంగే 64 శాతం మార్కులతోను పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు.  పూణెలోని హదప్సర్ ప్రాంతంలో ఉంటారీ తల్లీకొడుకులు. 
మోనికా చెత్తను సేకరించే పని చేస్తుంటారు. 
శ్రద్ధగా చదువుకుంటే మరో పనికి పోవచ్చనుకున్న మోనికా చదువుపట్ల దృష్టి మళ్ళించారు. ఓవైపు పని చేసుకుంటూనే పరీక్షలకు సన్నద్ధమయ్యారు.
పదవ తరగతి చదువుతున్న తన కొడుకుకి వాట్సప్ గ్రూపులో ఆయా సబ్జెక్టులకు సంబంధించి వచ్చిన విషయాలను తానూ చదువుతుండేవారు తల్లి మోనికా. ఈ విషయాన్ని గమనించిన కొడుకు తల్లికి అన్ని విధాలా సహకరించాడు.
మోనికా మాట్లాడుతూ "నేను చెత్త ఊడ్చే పని చేస్తున్నాను. చదువుగానీ ఉండి ఉంటే ఇంకేదైనా మంచి నౌకరీకి వెళ్ళి ఉండేదాన్ని కదా అనుకున్నాను. ఆ అవకాశం కోసమే చదువుతున్నానని మా అబ్బాయితో చెప్పానొకరోజు. అప్పటి నుంచి వాడు తన వంతు సహకారమందించాడు.అంతేకాదు, నాతో పని చేస్తున్నవారుకూడా నన్ను ప్రోత్సహించారు. చదువుతున్నాను గానీ పరీక్ష రాస్తే ప్యాసవుతానా అనే సందేహం ఉంటూ ఉండేది. కానీ నా మార్కులు చూసేసరికి నా ఆనందానికి అంతులేదు. నా కొడుకు పాత్ర ఇందులో ఎక్కు శాతం ఉంది. వాడు చదువుకుంటూ నేనెలా చదువుకోవాలో చెప్తుండేవాడు. ఒక్కొక్క రోజు ఇప్పుడది అవసరమా అని నీరసపడినప్పుడల్లా నన్ను ఉత్సాహపరిచేవాడు. చదువుకోవడానికి వయస్సు అడ్డంకి కాదు అని నేను నా ప్యాసైన తీరుని నాకు తెలిసిన పది మందికీ చెప్తున్నాను. నర్సుగా పని చేయాలనుంది. పన్నెండో తరగతి పరీక్షలుకూడా రాసి  నర్సింగ్ కోర్సులో చేరాలని ఉంది" అని చెప్పారు. ఆమె మాటల్లో కొండంత ఆత్మవిశ్వాసం ఉంది. ఆనందమూ ఉంది.
ఇలావుండగా ఆమె కొడుకు మందన్ మాట్లాడుతూ తాను నీట్ పరీక్షలకు ప్రిపేరవుతున్నానన్నాడు.  తనకు డాక్టరవ్వాలని ఉందన్నాడు.


కామెంట్‌లు