సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -163
భావార్థాధికరణ న్యాయము
****
భావము అంటే అభిప్రాయము,మనో వికారము, ఆత్మ, పుట్టుక,ధాత్వర్థ రూప క్రియ, స్వభావము, అర్థ కారణము, ఉనికి,అగుట,కలుగుట, స్థితి, పద్ధతి,భక్తి,నిష్కపటము, తలంపు,ప్రేమ, సారము, నిశ్చయము, హృదయము, ధ్యానము,మోహాభినయము, ప్రపంచము, జ్ఞానేంద్రియము,జాతకములోని 12 గృహములు... ఇలా అనేక అర్థాలు ఉన్నాయి. 
అధికరణము అంటే ఆధారము 
ఆర్థికము అంటే అర్థి సంబంధమైనది,నిజమైనది, వివేకము కలది అని అర్థం.
ఆధి అంటే మనో వ్యధ,కుదువ లేక తాకట్టు.
 భావార్థాధికరణము అంటే  భావాలకు ఆధారము మనసు.అది ఎట్లా భావిస్తే అట్లా ఉంటుంది అని అర్థం. 
మనం ఎట్లా భావిస్తే అట్లా ఉంటుంది కాబట్టి స్వర్గంగా భావించుకోవాలి. అది ఎట్లా,దేని చేత అని ఆలోచించాలనే అర్థంతో ఈ న్యాయము ముడిపడి ఉంది.
దీనికి సమానార్థం వేదంలో "యద్భావం తద్భవతి" అని చెప్ప బడింది.
అంటే మనసులో దేనిని నింపుకుంటామో వాటిని బట్టే మన దృష్టి, ఆలోచనలు,చేతలు, ఉద్దేశాలు, అంచనాలు ఆధారపడి ఉంటాయి. ఆ భావనల ధోరణే వాస్తవ రూపం దాలుస్తుంది.
ముందుగా మన మనసులో భయమా,భక్తా, ఈర్ష్యా,అసుయా,ధైర్యమా,నిరాశా, నిస్పృహ ‌.. వీటిలో ఏది నింపుకున్నామో గ్రహించాలి.
మనసును మభ్యపెట్టుకోకుండా మంచి   పనిని గురించి తీవ్రంగా వాంఛిస్తే, త్రికరణశుద్ధిగా నమ్మితే, నిశితంగా పరిశీలించి ఆలోచిస్తే,  నిరాశ నిస్పృహలకు తావు లేకుండా ఉత్సాహంతో ప్రయత్నం చేస్తే ఏదైనా తప్పకుండా జరిగి తీరుతుంది.
దీనికి సంబంధించిన ఓ కథ ఉంది. ఓ వ్యక్తి భగవంతుని కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి, ప్రత్యక్షమై మూడు సార్లు ఏం కోరుకుంటే అదే జరుగుతుందని  వరమిస్తాడు.
ఆ వ్యక్తి వెంటనే రాజ భవనము లాంటి భవనం కోరుకోగానే వెంటనే రాజభవనము, రెండోసారి అందమైన అమ్మాయితో వివాహం అనగానే వివాహం అవుతుంది. ఇవి రెండూ జరిగే సరికి సంభ్రమాశ్చర్యాలకు లోనైన ఆ వ్యక్తి  ఇవన్నీ మాయమైతే ఎలా అనుకుంటాడు. అంతే మరుక్షణమే ఉన్నవన్నీ మాయమై పూర్వపుస్థితికి వచ్చేస్తాడు.
దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయో ఫలితాలు అలానే ఉంటాయనేది ఈ కథలోని నీతి.
ఈ భావాన్నే శ్లోకంలో "యాదృశ్రీ భావనా యత్ర సిద్థిర్భవతి తాతృశి" అంటారు వేదాంతులు.
మహా భారతంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా చూద్దామా!
ఒకసారి శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచి వాళ్ళను వెతికి తీసుకుని వస్తే అమూల్యమైన వరాలను ఇస్తాను అంటాడు.
అలాగే ధర్మరాజును పిలిచి  చెడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే, వారిని తీసుకుని వస్తే అమూల్యమైన వరాలు ఇస్తాను అంటాడు.
దుర్యోధనుడు, ధర్మరాజు  ఇద్దరూ వెతకడానికి వెళ్తారు.
దుర్యోధనుడికి ఒక్కరు కూడా మంచి వారు కనబడరు. అలాగే ధర్మ రాజుకు ఒక్క  చెడ్డ వాడు కూడా కనబడడు.అదే విషయాన్ని శ్రీకృష్ణుడికి చెబుతారు.
దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనలో మంచితనం ఉంటే మనకు అందరిలో మంచితనమే కనబడుతుంది. మనలో చెడు భావనలు ఉంటే అందరూ చెడుగానే కనబడతారు. 
"భావార్థాధికరణ న్యాయము" అంటే ఇదేనని  పై ఉదాహరణల ద్వారా తెలుసుకున్నాం కదా!
మన మనసులో ఇంకా ఏ మూలనైనా చెడు భావనలు ఉంటే వాటిని తొలగించుకుందాం. ఆ ఖాళీని కూడా మంచి మానవతా విలువలతో నింపుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు