లక్ష్య సాధన మీదే గురి; - సి.హెచ్.సాయిప్రతాప్
 ప్రపంచంలోని ప్రతి మనిషికీ తాను అనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన ఉంటుంది. కానీ వారిలో కొంత మంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యం వైపు నిష్టగా పయనించి చివరకు విజయం సాధిస్తారు. లక్ష్యం గురించి ఆలోచించేవారు అవరోధాల దాటుకుంటూ.. లక్ష్య సాధనకు అనువైన మార్గం గురించి శోధించాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది.ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైన లొంగిపోకూడదు.. కుంగిపోకూడదు. ఆత్మవిశ్వాసంతో అవరోధాలపై ఆధిపత్యం సాధించగలిగితే విజయం తథ్యం. విజయం కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు సాగాలి. ప్రతీ శ్వాసలోనూ తాము నిర్దేశీంచుకున్న లక్ష్యాన్నే గుర్తు చేసుకుంటూ వుండాలి. ఈ ప్రయాణంలో ఎదురయ్యే కొన్ని ముఖ్యమైన అవరోధాలు:  ఒకటి అత్యాహారం, రెండవది అనవసర ప్రయాస, మూడవది వ్యర్థ సంభాషణ చేయడం, నాలుగవది నియమాలను మొక్కుబడిగా పాటించడం, ఐదవది దుష్ట జనసాంగత్యం, ఆరోది అత్యాశ. ఈ అవరోధాలను అతిశులభంగా దాటాలంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన 'పరం దృష్ట్వా నివర్తతే' అనే మాటను ఎప్పటికీ గుర్తు చేసుకోవాలి.  ఎప్పుడైతే మనిషి ఉన్నత విషయాల అనుభూతిని పొందుతాడో అప్పుడు అల్ప విషయాల నుండి బయటపడతాడు. ఈ నేపధ్యంలో ఎడసన్ జీవితంలో జరిగిన ఒక ముఖ్య విషయాన్ని మననం చేసుకోవడం ఎంతో అవసరం.
ఎడిసన్ బల్బ్ కనిపెట్టడానికి ముందు 3000 సార్లు విఫలమయ్యారు.
బలమైన కోరిక, దృఢ నిశ్చయం మాత్రమే లక్ష్యానికి చేరువయ్యేలా చేస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ తన లక్ష్యాలను చేరుకునే దిశలో ఎడిసన్ ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నది కూడా పరిశీలించవలసిన ముఖ్య విషయం.
ఆయన ఒక ప్రయోగం విఫలమవ్వగానే మరో ప్రయోగానికి గాలివాటంగా మళ్లలేదు. విఫలమైన ప్రతీసారి తన ఆలోచనలను తానే విశ్లేషించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగారు.
"ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించుకుని, అది విఫలమయ్యేవరకూ దాని మీదే పని చేస్తాను. అది విఫలం అయ్యిందని తెలిసాక మరో కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాను" అని ఎడిసన్ 1890లో హార్పర్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

కామెంట్‌లు