సుప్రభాత కవిత ; - బృంద
క్షణానికో అల పుట్టుకొచ్చి
తీరం వైపుకు పరుగు పెట్టి
గమ్యం చేరకనే  పలచబడి
కనపడకుండా కడలిలో కలిసిపోయే

అల లాటి ఆలోచనలు మనకెన్నో!!
జోరుగా మొదలై హోరుమని సాగి
చివరకు కుదరదని అర్థమై 
వ్యర్థమైపోతుంది

తీరం  చేరిన అల అయినా
నురుగు వదిలి తిరిగి చూడకుండా
వెనక్కు మళ్ళి నీటిలో
కలిసిపోతుంది.

బ్రతుకు మీద ఆశ ఎంత వున్నా
అనుమతి ఉన్నంతవరకే ...
ఎంత కోరుకున్నా గడువు
తీరనంతవరకూ బ్రతుకు తప్పదు

నత్త గుల్లలు  దొరికినన్ని
ఆణి ముత్యాలు దొరకవు
పిచ్చి శంఖులు  దొరికినన్ని
దక్షిణావృతాలు దొరకవు

కొన్ని స్నేహాలు మనసును
మురిపిస్తే....
కొన్ని బంధాలు ఆత్మతో
ముడిపడతాయి.

మరపురానివి మరువలేనివి
ఊపిరైనవీ...ఊరటిచ్చేవీ
అనుకోనివి.. ఆశించనివీ
అన్నీ బంధాలూ మనసుకే!

ఆశా  పాశాల అల్లికలే
అభిమానాలు ఆత్మీయతలు
రక్తసంబంధం  ఉండక్కర్లేదు
ఋణానుబంధాలే పరిచయాలన్నీ!

కదిలిపోయే కఠినమైన
కాలచక్రగమనంలో
నిన్నటి కొనసాగింపైన
నేటి వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు