సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -160
భస్త్రికా లవిత్ర న్యాయము
*****
భస్త్రికా అంటే కొలిమి తిత్తి లేదా నీరు నింపుకునే తోలు సంచి.
లవిత్రం అంటే కొడవలి, కోయుటకు ఉపయోగించు పనిముట్టు. 
కమ్మరి వృత్తి వారికి కొలిమి చాలా అవసరమైన వస్తువు. ఊదుటకు అనువుగా ఏర్పరచిన మేకతోలు సంచి.ఈ సంచి ద్వారా బొగ్గులను మండించి తద్వారా వచ్చే వేడిలో ఇనుమును కాల్చి వస్తువులను అంటే కత్తులు, కొడవళ్ళు,గొడ్డళ్లు మొదలైనవి తయారు చేస్తారు.
 భస్త్రికా లవిత్రము అంటే తోలుతిత్తిలో కొడవలి.అనగా తోలు తిత్తిలో కొడవలిని దాచినట్లు అని అర్థం.
మరి తోలుతిత్తిలో  కొడవలిని దాయగలమా? అనేది అందరికీ వచ్చే సహజమైన సందేహం.
 ఈ న్యాయాన్ని లోతుగా అధ్యయనం చేస్తే రెండు విషయాలు బోధపడతాయి.
ఈ న్యాయాన్ని జీవితానికి అన్వయించుకుని చూస్తే  తోలు తిత్తిలాంటి దేహంలో దాచుకున్న భయంకర రహస్యం గానీ, చేదు నిజం కానీ కొడవలి లాంటిదే.అది ఎటు కదిలినా,మెదిలినా దేహాన్ని గాయం చేయడం ఖాయం. అలా అని బయటికి చెబుదామా అంటే చెప్పలేని విపత్కర పరిస్థితి. ఇది ఎలా ఉంటుంది అంటే పాత సినిమాల్లో ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పొద్దని ఒట్టేయించుకున్న సీన్లలా ఉంటాయి.చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక అక్కడ విషమిస్తున్న స్థితిని చూస్తూ ఏమీ చేయలేక మనసు గిలగిల్లాడటం చూస్తుంటాం.
ఇక మరో కోణంలో చూస్తే  కడుపులో కత్తుల్లాంటి విషం దాచుకుని పైకి మంచివారుగా నటిస్తూ ఉంటారు.వాళ్ళు  వెన్ను పోటు పొడిచేంత వరకు తోలుతిత్తి లాంటి దేహంలో దాచుకున్న విషపు కత్తుల గురించి ఎవరికీ తెలియదు.
 ఇదంతా గమనించిన ఓ తత్వవేత్త  ఇలా అంటాడు. "తోలు తిత్తి ఇది ( దేహంలో)తూట్లు( నవ రంధ్రాలు) తొమ్మిది.తుస్సుమనుట ఖాయం/ తెలుసుకోరా జీవా ఈ నిజం."
 ఎప్పుడు పోతుందో తెలియని ఈ బూర లాంటి తోలుతిత్తి  దేహంలో  కుట్ర,ఈర్ష్య, అసూయలు నింపుకోవడం ఎందుకు?  ఎప్పుడు ఈ బూరలో గాలి ( ప్రాణం) పోతుందో ఎవరికీ తెలియదు కదా " అంటాడు.
కాబట్టి "భస్త్రికా లవిత్ర న్యాయము"యెక్క అంతరార్థం తెలుసుకుని మసలుకుందాం. 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు