"వెన్న దొంగ";- - యామిజాల జగదీశ్
కృష్ణుడు మొదటిసారిగా వెన్న దొంగిలించిన విషయం ఆసక్తికరమైనది. 
కృష్ణుడు చిన్నోడిగా ఉన్నప్పుడు తల్లి యశోద కృష్ణుడికి అప్పుడప్పుడూ కొద్ది కొద్దిగా వెన్న ఇచ్చేది. కృష్ణుడికి వెన్న రుచి ఎంతో ఇష్టం.
 
వెన్న ఎక్కడి నుంచో రావడంవల్లే కాబోలు అమ్మ తనకు కొద్ది కొద్దిగానే వెన్న ఇస్తోందనుకున్నాడు కృష్ణుడు. 
కానీ ఓమారు కృష్ణుడు, బలరాముడు పాక్కుంటూ పాక్కుంటూ ఓ గదివైపు వెళ్ళారు. ఆ గది చీకటిగా ఉంది. లోపల ఏముందాని చూడ్డానికి వెళ్ళారు. అక్కడ బోలెడన్ని కుండలు కనిపించాయి. వాటిలో ఏముందో చూడాలన్పించింది. మెల్లగా ఓ కుండలోకి చెయ్యి పెట్టగా వెన్న ఉండటం తెలిసింది. అంతే అమాంతం ఇద్దరూ కుండలోంచి వెన్నను తీసి తినడం మొదలుపెట్టారు.ఇంట్లో ఇంత వెన్న పెట్టుకుని అమ్మ కొద్దకొద్దిగా ఇవ్వడమేంటని అనుకుని ఆట్లాడటం మాని వెన్న తిన్నారు.
ఇంతలో పిల్లల్ని వెతుక్కుంటూ యశోద అక్కడికి వచ్చింది. 
కృష్ణుడు వేసుకున్న ఆభరణాల మెరుపులలో వెన్నను చూసింది యశోద.
"ఏంటీ వెన్నను దొంగిలించి తింటున్నావా" అని అడిగింది యశోద.
వెంటనే కృష్ణుడు ఏం చెప్పాలో తెలీక "అబ్బే లేదమ్మా... నన్ను ఆభరణాలతో అలంకరించావుగా.... ఈ ఆభరణాలతో నా దేహం వేడెక్కిపోయింది. చల్లబడటం కోసం వెన్నకుండలో చేతులుపెట్టా" నన్నాడు. 
"మరి నీ బుగ్గల నిండా నోటినిండా వెన్న ఉండటమేమిటీ?" అని అడిగింది యశోద.
 
అయ్యో దొరికిపోయాం కదా అనుకున్న కృష్ణుడు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించాడు. 
"చీకటిగా ఉన్న ఈ గదిలో చీమలు నామీద పాకుతుండటం తెలీలేదు.  చీమలు నా బుగ్గలను కుడుతుంటే చురుక్కుమన్పించింది. వాటిని నా వెన్న  చేతులతో తోసానమ్మా. ... అందుకేనమ్మా నా బుగ్గలనిండా వెన్నంటుకుదమ్మా" అన్నాడు కృష్ణుడు.
అయ్యో...నా కృష్ణుడ్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నానుగా అనుకుంటూ యశోద కృష్ణుడ్ని ప్రేమతో ఎత్తుకుంది.
అప్పుడు కృష్ణుడు  "నేను అమ్మను అబద్ధాలాడి నమ్మించాను కదూ. అయినా అదంతా వెన్న కోసమే కదా....నాకేమో వెన్న మరీ మరీ ఇష్టం..." అనుకుంటూ ఇక ఎవరింట్లోనైనా వెన్న దొంగిలించి ఏదో ఒకటి చెప్పి అమ్మను నమ్మించొచ్చు అనుకున్నాడు.
ఇలా కృష్ణుడు మొదటిసారి తన ఇంటే వెన్న దొంగిలించి తిన్నాడు. 
 

కామెంట్‌లు