సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -169
భూ శైత్యౌ ష్ణ్య న్యాయము
*****
భూ అంటే భూమి, పుడమి, అవని ,నేల ధరణి,ధరిత్రి మొదలైన అర్థాలు ఉన్నాయి.
శైత్యము అంటే చల్లదనం.ఔష్ణ్యం అంటే వెచ్చదనం.
భూమి చల్లదనమును, వెచ్చదనమును కూడా కలిగి వుంటుందని అర్థం. 
భూమి యొక్క స్వాభావిక గుణము గంధవత్త్వము. అనగా ఒక రకమైన పరిమళం  కలిగి ఉండటం.అందుకే భూమిని "గంధవతీ పృథివీ" అంటారు.తనకంటూ ప్రత్యేకమైన పరిమళం కలిగి ఉన్ననూ, హిమాదుల వలన చల్లబడటంతో చల్లదనమునూ,ఎండ వేడిమి మొదలగు వాని మూలమున ఉష్ణత్వమును కూడా కలిగి వుంటుంది.
 ఈ విధంగా భూమికి ఉన్న స్వాభావిక గుణము కాకుండా ఇతరముల వల్ల "చల్లదనము,వెచ్చదనము" కూడా ఉంది అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
మరి ఈ గుణాలను లేదా లక్షణాలను భూమి మంచు మరియు సూర్యుని  స్నేహము వలన అదనంగా పొందినది కదా!
ఇలాగే వ్యక్తులు కూడా పొందుతారనీ దీనిని వ్యక్తులకు వర్తింప చేస్తూ, చక్కని పోలికతో రాసిన భాస్కర శతక కారుని  పద్యాన్ని చూద్దామా!. 
"అలఘుగుణ ప్రసిద్ధుడగునట్టి ఘనుండొక డిష్టుడైతనన్/వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయగా/తెలిసి కుచేలుడొక్క కొణి దెండటుకుల్ దనకిచ్చినన్ మహా/ఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము నాతనికీడె భాస్కరా!"
అనగా ప్రఖ్యాతి గాంచిన గుణవంతుడైన స్నేహితుడితో స్నేహం చేస్తే... ప్రేమతో తనకు కొంచెం  ఇచ్చినా,ఇవ్వక పోయినా తనకు నచ్చిన, మెచ్చిన వ్యక్తికి గొప్ప మేలును కలుగజేస్తాడు.కృష్ణుడు తన మిత్రుడు కుచేలుని అధిక సంపన్నుని చేయడం ఉదాహరణగా చెప్పుకోవచ్చు."
అంటే భూమి లాంటి సుగుణం కలిగిన వ్యక్తి అంతకంటే మిక్కిలి గొప్పవాళ్ళను స్నేహితులుగా పొందినట్లయితే వారి యొక్క ప్రభావం వల్ల తనలో కూడా ఆ లక్షణాలు వచ్చి  చేరుతాయి అని అర్థం.
 మంచు వంటి శీతల స్నేహం వల్ల చల్లదనాన్ని ఇవ్వగలిగింది.సూర్యుని వంటి వెచ్చని స్నేహితుని వల్ల వెచ్చదనం, వెలుగును ఇవ్వగలిగింది.
 దీనిని బట్టి చేసే స్నేహాన్ని బట్టి దారానికి పూల సుగంధం అబ్బినట్లు,ఇనుము అయస్కాంతంతో స్నేహం చేస్తే అయస్కాంతంగా మారినట్లు ఆయా గుణాలు, స్థితి గతులు చేసే స్నేహం, వారి సాంగత్యం వల్ల మారుతాయని చెప్పేందుకు ఈ "భూ శైత్యౌష్ణ్య న్యాయము"ను చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు