సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -176
మండూక మక్షికా న్యాయము
******
మండూకము అంటే కప్ప, శాలూకము,మక్షికా అంటే ఈగ.
మండూక మక్షికా న్యాయము అంటే  కప్ప ఈగను తినబోవుట.మరి అందులో చెప్పుకోవాల్సింది ఏముందని మనకు అనిపించవచ్చు. కానీ ఈ కప్ప మామూలు స్థితిలో లేదు. తనే ప్రాణాపాయ స్థితిలో ఉంది.పాము నోటికి చిక్కింది.అయినా  అది ఈగను చంపబోతోంది.
కప్ప పాము నోటిలో వుండి కూడా ఈగను  చంపబోవడం అంటే తాను ఆపదలో ఉండి కూడా మరొకరికి ఆపద తలపెట్టే స్వభావం అన్న మాట.దీనినే మండూక మక్షికా న్యాయముతో పోల్చారు మన పెద్దలు.
 అంటే కొందరు వ్యక్తులు తామెంత ఆపదలో ఉన్నా  సరే.వారిలోని దుష్టాలోచన, దుష్టత్వం అస్సలు మారవు. ఏమాత్రం అవకాశం దొరికినా ఎదుటి వారికి హాని చేయాలనే దురాలోచన వారిలో ఎప్పుడూ ఉంటుంది.
 బాధాకరమైన పరిస్థితుల్లో  ఉన్న  అలాంటి వారిని చూసి మనసులో జాలి,దయ పుడుతుంది."అయ్యో! పాపం" అనిపిస్తుంది. కానీ వారి ప్రవర్తన గమనిస్తే ఛీ కొట్టాలని పిస్తుంది.
అందుకే అలాంటి దుష్టమైన బుద్ధి కలవారిని గురించి "పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో గాని పోదు" అంటారు. కొందరు వ్యక్తులు ఇలాగే ఉంటారు.
తేలుకు కుట్టే బుద్ధి ఉంటుందని అందరికీ తెలుసు కదా!
ఓ రోజు తేలు నీటిలో కొట్టుకు పోతుంటే‌‌ ఓ వ్యక్తి చూసి దానిని రక్షించడానికి పట్టుకున్నాడట‌. తనకు ప్రాణ భిక్ష పెట్టిన ఆ వ్యక్తికి కృతజ్ఞత చెప్పాల్సింది పోయి అతడిని కుట్టిందట.అంటే నీళ్ళలో కొట్టుకొని పోయి చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పటికీ దాని హీన గుణం మార్చుకోలేదు.
అందుకే వేమన దీనిని మనుషులకు వర్తింప చేస్తూ ఇలా అంటాడు...
"లెక్క లేని యాశ లీలమై యుండగా/తిక్క యెత్తి నరుడు తిరుగు గాక/ కుక్క వంటి మనసు కూర్చుండ నిచ్చునా/ విశ్వధాభిరామ వినురవేమ!"
దుర్మార్గుడిలోని దుష్టగుణాలు కుదురుగా ఒకచోట ఉండనీయవు.చచ్చిపోయే పరిస్థితిలోనూ ఆ గుణాలు బయట పడతాయి.
ఇలాంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొనే  కాబోలు.మన పెద్దలు తాము ప్రకృతిలోని జీవులను నిశితంగా చూసి మనుషులకు అన్వయం చేస్తూ వారి మనసులు ఎలా ఉండాలో? ఉండకూడదో ఇలాంటి న్యాయాల ద్వారా చెప్పారేమో అనిపిస్తుంది కదండీ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు