సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -154
బాణోష్ట్రీ న్యాయము
    *****
బాణము అంటే శరము,అమ్ము,అస్త్రం,అంబు అనే అర్థాలు ఉన్నాయి.ఉష్ట్రము అంటే ఒంటె. 
ఒక సారి కొండ చిలువ ఒంటెను పట్టి చంపే ప్రయత్నములో వుండగా అది చూచిన ఒంటె యొక్క యజమాని కొండ చిలువను బాణముతో  చంపి తన ఒంటెను రక్షించుకున్నాడు.అయితే ఇందులోని ధర్మధర్మాలు, పాప పుణ్యాల పరంగా చూస్తే ఆ యజమాని చేసిన పని ధర్మాధర్మాలు,పాప పుణ్యాల కతీతమైనదని చెప్పడమే ఈ" బాణోష్ట్రీ న్యాయము" యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఎందుకంటే వానిలో రెండూ చంపదగనివే; రెండూ చావ దగినవే. కొండ చిలువ ఆహారం జంతువులు.దాని నోటి ముంగలి సిద్ధాన్నమును తీసి వేయుట పాపము.మరి అక్కడ కొండ చిలువ వలన  ఓ జంతువైన ఒంటె బలైపోతోంది. అలా దానిని రక్షించడం ధర్మమే కదా! అందుకే దాన్ని రక్షించడానికి  మానవుడు చేసిన పని పుణ్యమే అవుతుంది.
 
అయితే ఇక్కడ యజమాని ఇతర ఏ జంతువునైనా కొండ చిలువ చంపుతున్నట్లయితే దాన్ని రక్షించడానికి వెళ్ళే వాడు కాదేమో. అది చంపేది తన అధీనంలో ఉన్న జంతువు.దానిని రక్షించాల్సిన బాధ్యత తనదే కాబట్టి అతడు కొండ చిలువను చంపేసి ఒంటెను రక్షించుకున్నాడు.
ఇలా రెండు కోణాల్లోంచి చూసినా  ఒంటె యజమానికి పాపాపాపములు బాధించవు అనే అర్థం ఇందులో ఇమిడి ఉంది.
 శిబి చక్రవర్తికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. పావురాన్ని డేగ నుండి రక్షించడానికి ప్రయత్నించిన శిబితో "శ్యేనాః కపోతాన్ ఖాదయంతి" అది నాకు సిద్ధాన్నము. వేద విహితమైన ఆహారము నా నోటి ముంగలి ఆహారాన్ని నీవు  రక్షిస్తానంటే ఎలా?" అంటుంది.
అప్పుడు శిబి " శరణు కోరి వచ్చిన పావురాన్ని చంపుతానంటే ఇవ్వడం  ధర్మం కాదు. " కావాలంటే పావురం కంటే బలమైన జంతువుల్ని వేటాడి ఇస్తాను" అంటాడు.
ఇలాంటిదే మరో కథ కూడా ఉంది.
ఓ దొంగను రాజ భటులు వెంటాడుతూ ఉండగా పరుగెత్తుకుంటూ వెళ్ళి తపస్సు చేస్తున్న ముని ఆశ్రమంలో తలదాచుకుంటాడు.రాజ భటులు వచ్చి దొంగ గురించి మునిని  అడుగుతారు.అప్పుడు ఆ ముని ధర్మం తప్పకుండా, పాపం బాధించకుండా యుక్తిగా ఇలా అంటాడు.
"కళ్ళు చూశాయి కానీ చెప్పలేవు, నోరు చెప్పగలదు కానీ చూడలేదు కాబట్టి మీరే అర్థం చేసుకోండి"అని వాళ్ళు అడిగిన దానికి జవాబు అలా చెబుతాడు . ధర్మాధర్మాలకు అతీతంగా మాట్లాడిన ముని మాటలకు ఏమీ చేసేది లేక ఆ భటులు అక్కడ నుండి వెళ్ళి పోతారు.
ఇలాంటి సందర్భాలు, సంఘటనలు ఎదురైనప్పుడు మనసున్న మనిషిగా పాప పుణ్యాల కతీతంగా  చేయాల్సిన ధర్మం గురించి చెప్పడానికి,ధర్మ సంకట పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో       ఈ "బాణోష్ట్రీ న్యాయము" ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు