సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -172
భ్రమర న్యాయము
******
భ్రమరము అంటే తుమ్మెద, తేనెటీగ ముంగురులు,అభినయ హస్త విశేషము.
తేనెటీగ పూవులకు అంటి వున్న ముండ్లను వదిలి దానిలోని మకరందాన్ని మాత్రమే తాగుతుంది.
అలాగే అది మకరందం, సువాసన లేని పూల వద్దకు పోదు.
మరొక విశేషం ఏమిటంటే తేనెటీగకు ముల్లు ఉంటుంది.అది మకరందం సేకరించే వేళ మృదువుగా ఉన్న పూవుకు ఎలాంటి హానీ కలుగజేయదు.
ఇలా  బుద్ధిమంతుడు, గుణవంతుడు ,మానవీయ విలువలు కలిగిన వ్యక్తి కూడా తేనెటీగ లాంటి వాడనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
తేనెటీగ ముండ్లతో ఉన్న పూవుల నుంచి ఎంతో ఒడుపుగా ముళ్ళు గుచ్చుకోకుండా వాటిలోని తేనెను మాత్రమే గ్రహిస్తుంది.
అలాగే బుద్దిమంతుడైన వ్యక్తి ఎదుటి వారి లోని దుర్గుణాలను వదిలేసి వారిలోని సుగుణాలను మాత్రమే స్వీకరిస్తాడు.
తేనెటీగ సువాసన , మకరందం ఉన్న పూవుల వద్దకే వెళుతుంది కానీ వాసన, మకరందం లేని పూల వద్దకు వెళ్ళదు.
అలాగే గుణవంతుడైన వ్యక్తి సజ్జనుల సాంగత్యమే చేస్తాడు కానీ గుణ హీనులు, అప్రయోజకులైన వారి చెంతకు చేరడు. వారికి దూరంగా ఉంటాడు.
తేనెటీగకు స్వీయ రక్షణ కోసం ముల్లు అనే అవయవం ఉంటుంది కదా!.అది దానితో కుడితే తేలు కుట్టినంత బాధ కలుగుతుంది.దద్దుర్లు కూడా వస్తాయి.ఆ మొనదేలిన ముల్లుకు కర్రకు సైతం రంధ్రం చేయగలంత బలం ఉంది.
అంతటి శక్తి గల  ముల్లు ఉన్నా తేనెటీగ సుకుమారమైన పూవుకు తన ముల్లుతో ఎలాంటి హానీ చేయదు.
అలాగే మానవీయ విలువలు కలిగిన వ్యక్తి  బలం,శక్తి సామర్థ్యాలు,ప్రతిభ లాంటివి ఉన్నా మాటలతో గానీ, చేతలతో గానీ ఇతరులెవరికీ ఎలాంటి కష్టం, నష్టం కలగకుండా చాలా మృదువుగా ప్రవర్తిస్తాడు. 
ఈ విధంగా మనిషి వ్యక్తిత్వం  భ్రమరంలా ఉండాలనే ఉద్దేశ్యంతో దీనిని నిశితంగా పరిశీలించిన  మన పెద్ద వాళ్ళు ఈ "భ్రమర న్యాయము " గురించి వ్యక్తులకు వర్తింప చేసి చెప్పారు.
 ఈ న్యాయమును సదా గమనంలో ఉంచుకొని మంచికి మారు పేరుగా జీవిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు