మానవత్వం పరిమళించాల్సిన ఆవశ్యకత ఎంతో వుంది;- సి హెచ్. సాయిప్రతాప్
 సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదని, మానవత్వం లేని మతం రాణించదు అని శాస్త్రాలు బోధిస్తున్నాయి.. మతాలన్నీ మానవత్వాన్ని కలిగి వుండమని తప్పక బోధిస్తాయి. మానవత్వం లేని భక్తులకు స్వర్గం లభించదు.

మానవత్వం అంటే కరుణ,ప్రేమ,దయ,అహింస మానవ ప్రేమే మానవ ఆదర్శం అన్న సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా నమ్మి జీవితంలో ఆచరించడం. ఇతర విలువల కంటే మానవ విలువలే మిన్న అన్న ప్రాతిపదికన వసుధైక కుటుంబ నిర్మాణం జరగాలి.
అయితే ఈ అపురూపమైన విలువలకు పాతరేసి కొందరు జనారణ్యంలో ముసుగులు వేసుకుని తిరుగుతున్న మానవ మృగాలు.. ఉన్మాదంతో ఊగిపోతున్నాయి. అమాయక ఆడపిల్లల ఉసురు తీసి ఊరేగుతున్నాయి. పసి కూనలైనా.. పండు ముదుసలైనా వాటికి ఒకటే.. స్ర్తి ఒంటరిగా కనిపిస్తే చాలు, కసిదీరా కాటేస్తున్నాయి. ఎన్నడూ మహిళలను చూడనట్లు ఆబగా చూసే కళ్ళు.. అనె్నం పునె్నం ఎరుగని చిన్నారులు, మహిళలపై దాడి చేసి దాహం తీర్చుకుంటున్నాయి. మానవత్వం క్రమ క్రమంగా మంట కలిసిపోతోందనడానికి ఇటివలి సంఘటనలు ఒక ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
మీలో మానవత్వం చచ్చిపోయుంటే, మీకు ఎన్నో నీతిబోధలు అవసరమౌతాయి. మీలో మానవత్వం సజీవంగా, పొంగి పొర్లుతుంటే, మీరు సహజంగానే మీకూ, మీ చుట్టూ ఉన్నవారికందరికీ ఉత్తమమైనదే చేస్తారు అని సద్గురు జగ్గీవాదుదేవ్ అత్యద్భుతంగా చెప్పారు.


దేవుడు గుడిలో ఉంటాడో లేదో తెలియదు కానీ మనం చేసే మంచి పనిలో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు.  దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు ప్రతి వారి గుండెల్లో ఉండే మానవత్వం. మన మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో మన జీవితం కూడా అంతే ఆనందంగా ఉంటుంది.. మానవత్వం చేతలలో ఆచరిస్తే మనసు నిర్మలం అయ్యి తద్వారా భగవత్ కటాక్షం తప్పక కలుగుతుంది.

కామెంట్‌లు