అమరులు వాళ్లు!!!; - ప్రతాప్ కౌటిళ్యా
యుద్ధంలో సైనికులు చనిపోతే
భక్తి అది దేశభక్తి!!!

విముక్తి కోసం సామాన్యులు చనిపోతే
అది పోరాటం విముక్తి పోరాటం!!!

విముక్తి కోసం పౌరులు చనిపోతే
అది అమరత్వం వాళ్లు అమరులు!!!?

ఇంద్రధనస్సులో ఎక్కు పెట్టబడిన
సూర్యుళ్ళు వాళ్ళు!!

ఉరుములు మెరుపుల ఉరితాళ్ళకు
కాకతీయుల తోరణాలకు వేలాడిన
శిరస్సులు వాళ్లు!!!

ప్రాణాలు వదిలి తెగిపడిన 
కిరణాలు వాళ్లు!!

కాలం నుంచి కాలిపోయిన
క్షణాలు వాళ్లు!!!

గాయం గేయంతో మూగబోయిన
కంఠాలు వాళ్ళు!!!

ఫిరంగులు కాదు పింకు రంగులతో
దిక్కులు పిక్కటిల్లెల పేలిన
తెలంగాణ మందు గుండు సామాన్యులు వాళ్లు!!!?

భూమిని భయపెట్టాలంటే
బాంబులు పేల్చాలి
భయాన్ని చూపెట్టాలంటే
విద్యుత్తును పట్టుకోవాలి కానీ

ఒక చెట్టు తోటవుతుంది
ఒక చెట్టు వనమవుతుంది
ఒక చెట్టు అరణ్యమవుతుంది
అక్కడ పులులు సింహాలు పుడతాయి
అలా పుట్టి గిట్టిన వాళ్లు వాళ్లు అమరులు!!!

రాలి పడిన ఉల్కలు కాదు
భూమిపై రాలి పడి వెలిగిన
నక్షత్రాలు వాళ్ళు అమరులు!!!

చీకటి పై యుద్ధాన్ని ప్రకటించిన
చిరు దివ్వెలు వాళ్ళు!!!
వెలుగులు ప్రసాదించిన
చిరునవ్వులు వాళ్ళు అమరులు!!!

నదులు పుడతాయి పారుతాయి
మరణిస్తేనే
మహాసముద్రం అవుతుంది!!!

రాళ్లు మట్టి చెట్టు కలిసి
ఎదిగితేనే
మహా పర్వతమవుతుంది!!
కదలని సమాధులవుతాయి!!!

అది అమరులదనం
అది అమరుల గొప్పదనం!!

వెలుగుతున్నది
అమరుల జ్యోతి కాదు
తెలంగాణ జాతి!!!

తెలంగాణ అమరుల స్మారకం అమర జ్యోతి ప్రారంభోత్సవ సందర్భంగా రాసిన కవిత

Pratap Kautilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏 8309529273-(22/06/2023)

కామెంట్‌లు