సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -156
భర్చు న్యాయము
  ****
భర్చు లేదా భర్చుడు అనేది ఒక వ్యక్తి పేరు.
ఇలా వ్యక్తి పేరుతో కూడా మన పూర్వీకులు ఓ న్యాయాన్ని  సృష్టించడం విశేషం.
పదిమంది మాటలు ఎంత నమ్మశక్యంగా ఉంటాయో,..మరి భర్చుడు బతికుండగానే పిశాచంగా ఎలా పిలవబడ్డాడో  ఆ కథేంటో చూద్దామా..!
అనగనగా ఒక రాజుకు భర్చుడు అనే మంత్రి ఉండే వాడట.అతడు రాజు ఆదేశాల మేరకు శత్రువును జయించడానికి ఇతర దేశం వెళ్ళాడు.అక్కడ శత్రువును ఓడించాడు.రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.పరిస్థితులు చక్కబడేంత వరకు  కొన్ని సంవత్సరాల పాటు ఆ రాజ్యంలోనే ఉండవలసి వచ్చింది.
ఇప్పటిలా చరవాణి సౌకర్యాలు లేకపోవడంతో   భర్చుడు అంటే పడని విరోధులకు మంచి అవకాశం లభించింది.రాజు గారు భర్చుని గురించి విచారించే సమయంలో విరోధులు రాజుతో  "ఇంకెక్కడి భర్చుడు ఎవరో శత్రువులు అతణ్ణి చంపేశార" ని చెప్పారు. దాంతో రాజు భర్చుని స్థానంలో మరో మంత్రిని నియమించుకున్నాడు.
కొంత కాలం తర్వాత భర్చుడు స్వదేశానికి తిరిగి వచ్చాడు. రాజు గారి ఆస్థానంలో తన బదులు వేరే వ్యక్తి మంత్రిగా నియమింపబడినాడని తెలుసుకుని చాలా బాధ పడ్డాడు. వైరాగ్యంతో సన్యాసం పుచ్చుకుని అడవిలోకి వెళ్ళి పోయాడు.
అలా కాలం గడుస్తుండగా ఒక రోజు రాజు వేటకని తన భటులతో అడవికి వెళ్ళాడు.
వారిలో కొందరు సన్యాసి వేషంలో ఉన్న భర్చుని చూసి బెదిరిపోయారు. పరుగెత్తుకుంటూ వచ్చి "రాజా! అదిగో భర్చుడి పిశాచము" అని గట్టిగా కేకలు వేశారు.
భర్చుడు చనిపోయాడని అంతకు ముందే రాజు గారు  విని ఉండటం వల్లనూ, భర్చుడు గడ్డాలు మీసాలతో సన్యాసి వేషంలో ఉండటం వల్లనూ  భర్చుడు నిజంగా పిశాచమయ్యాడని అనుకున్నాడు. 
అంటే పది మంది ఏదైతే చెబుతారో అదే నిజమని నమ్ముతారు. దీనికే ఓ తెలుగు సామెత ఉంది " నలుగురు నంది అంటే నంది" "పంది అంటే పంది" అన్నమాట.
దీనికి సంబంధించిన వేమన పద్యం చూద్దాం.
"పదుగురాడు మాట పాటియై ధర జెల్లు/ ఒక్కడాడు మాట ఎక్కదెందు/ఊరకుండు వాని నూరెల్ల నోపదు/ విశ్వధాభిరామ వినురవేమ "
పదిమంది మాట్లాడిన మాట ఏదైనా చెల్లుతుంది అంటే అబద్దం కూడా నిజంగా మారుతుందనీ.ఒక్కడు నిజం చెబితే చెల్లుబాటు కాదు.ఎవరూ దానిని నిజమని నమ్మడానికి ఇష్టపడరనీ."అనే అర్థంతో ఈ  న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఇదండీ "భర్చు న్యాయము" యొక్క కథా కమామీషు. ప్రస్తుతం లోకం తీరు కూడా ఇలాగే నడుస్తుంది కదండీ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు