పవిత్రమైన మనస్సు--: సి.హెచ్.సాయిప్రతాప్
 నైతిక విలువలకు నిజమైన సాధకుడు ఎంతో ప్రాధాన్యతను ఇస్తాడు. నైతిక విలువలకు మూలం సున్నితమైన, పవిత్రమైన మనస్సు. అటువంటి సున్నితమైన మనస్సు లేకపోతే పారమార్థిక జీవనం గడపలేము. . ఓ పవిత్రమైన మనస్సు మాత్రమే పరమాత్మను గురించి నిరాటంకంగా ధ్యానించగలదు. పవిత్రమైన మనస్సు కోసం ధార్మికమైన జీవనం రావాలి. అందుకు ఆహార శుద్ధి అనేది ఒక ముహ్యమైన మార్గం.ఆహార శుద్ధి అంటే అన్నం శుద్ధి, శాఖాహారం అని కాదు...ఇంద్రియములకు ఇచ్చే ఆహారం .ఆహార శుద్ధి వలన ఇంద్రియ శుద్ధి, తద్వారా సత్వగుణములు ఏర్పడుతాయి. ఇంద్రియములకు పవిత్రమైన విషయములనే ఆహారంగా ఇవ్వాలి.
కోరికలకు బానిస కాకుండా నిరంతరమైన అభ్యాసంతో మనస్సును భగవంతునిపై కేంద్రీకరించాలి. మనస్సును పవిత్రమైన ఆలోచనలతో నింపితే చివరికి ఆ పవిత్రమైన ఆలోచనలు మాత్రమే మనలోనుంచి బయటకు వస్తాయి. అపుడు మనస్సు శుభ్రపడుతుంది.
మితాహారము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమ ధర్మములను సక్రమంగా నిర్వర్తించుటవల్లనూ, ఉపవాస, వౌనవ్రత దీక్షలు జరుపుటవల్ల సాత్వికాహారం భుజించటంవల్ల మనం తప్పనిసరిగా మనస్సును నిగ్రహించుకోవచ్చును.

భగవంతుడు ఈ సృష్టి నిర్మాత. ఆయన ఒక్కడే ఈ ప్రపంచానికి ప్రభువు. ఆయన సృష్టించిన ఈ మనుషుల్లో కులతత్వపు అడ్డుగోడలెందుకు? ప్రతి మనిషికి సమానమైన హక్కులు భగవంతుడు కల్పించాడు. ప్రతిఒక్కరు తమ కర్తవ్యాన్ని పవిత్రంగా, నిష్కల్మష హృదయంతో, నిస్వార్ధ భక్తితో నిర్వర్తించాలి.  మనస్సు, ఆత్మ నిర్మలంగా ఉన్నప్పుడూ మన ఇంటి తొట్టిలోని నీళ్ళు కూడా గంగా జలంతో సమానం అన్న సంత్ రవిదాస్ బోధలు ,మానవాళికి ఆచరణీయం.

జ్ఞాన, భక్తి, కర్మ మార్గములలో నైతికత చాలా అవసరం. పవిత్రత లేకుండా ఏ మార్గములోనైనా సరే ముందుకు సాగలేము. శారీరికంగా, మానసికంగా, ఇంద్రియపరంగా పరిశుద్ధంగా పవిత్రంగా వున్నప్పుడే నైతిక విలువలను సాధించగలము ...నైతిక విలువలను, ధార్మిక విలువలను కాపాడుకొన్నప్పుడే సమాజాన్ని రక్షించుకోగలం.

కామెంట్‌లు