కుల,మతాలకు అతీతంగా అన్ని పండుగల మాదిరిగానే పీర్ల పండుగను ( సవార్ల పండుగ) నా చిన్నప్పుడు మా ఊర్లో జరుపుకోవడం నాకు జ్ఞాపకం.. ఊరు ..మా ఊరు చర్లపల్లి.. నల్గొండ టౌనుకు ఆరు కిలోమీటర్ల దూరం.అక్కడ హిందూ, ముస్లింలు కలిసిమెలిసి ఉండటమే కాకుండా అక్కడ ఏ పండుగైన
అందరూ కలిసి చేసుకునేవారు.వివిధ కుల వృత్తులు
చేసుకుంటూ ఎవరి కష్టం మీద వాళ్ళు జీవనం సాగిస్తుండేవారు...
నలబై ఏళ్లు క్రితంలోకీ పోతే, చర్లపల్లి గ్రామం
ప్రధాన రహదారికి ఇరువైపులా ఒక కిలోమీటరు పొడవు, ఒకవైపు చివరన రంగనాయకమ్మ తోట,ఈ తోట గురించి,ఆమె గురించి తర్వాత ప్రత్యేకంగా రాస్తాను.ఆ తరువాత నల్లవాగు. మరొకవైపు,పాలకేంద్రం, బస్సు స్టాండ్, పోస్ట్ రాజయ్య హోటల్,అదే లైనులో పెద్ద బావి లాస్ట్.ఇక వెడల్పు ఊరి చివర చెరువు వరకు విశాలంగా ఉంటుంది.
అద్బుతమైన ఊరు.. ఎప్పుడూ నీళ్ళతో కళ కళలాడే అందమైన చెరువు.చెరువును ఆనుకొని శివాలయం..విడిచి రాలేని ప్రదేశం.ఊరు మధ్యలో పెద్ద బజారు.. అక్కడ అన్నీ కిరాణా దుకాణాలు ఉండేవి. వాటిని,ఆనుకొని ఒక దారి ఆంజనేయ స్వామి గుడి వైపుకు వెళుతుంది.గుడి పక్కన ఒక చేయి విరిగిపోయిన గాంధీ విగ్రహం,గుడి ఎదురుగా పీర్ల కొట్టం ఉండేది.
దాని పక్కన గాలిబ్ ఇల్లు ఉండేది. గాలిబ్ అప్పట్లో రిక్షా కార్మికుడు.మాకు ఎంతో ఆత్మీయుడు.మేము నల్గొండ వెళ్ళేందుకు అతని రిక్షానే ఎక్కేవాళ్ళం.గాలిబ్ పాపం కాలం కలిసి రాక, రిక్షా తొక్కేవాడే కానీ, అతను అద్భుతంగా డ్రమ్స్ వాయిస్తాడు.చాలా బాగా మాట్లాడేవాడు.ఏదో అవ్వాలని అనుకుంటే,నసీబ్ బాగాలేక చివరికి ఈ పరిస్థితి ఏర్పడిందనీ బాధపడేవాడు.వాళ్ళ అన్న జానీ కానిస్టేబుల్ గా
పనిచేసేది.పీర్ల పండుగ నాలుగు రోజులు ఆయన సెలవు పెట్టుకొని వచ్చి ఆరంబాజా(డమ్స్) వాయించేవాడు.వీళ్ళతో పాటు మంగలి వెంకటేశం,మాల ఎంకులు ఆరంబాజా వాయించేవాళ్ళు.నాలుగు పీర్లు ఖాసిం, చిన్న లాల్, పెద్ద లాల్,రడబూషన్(రన్ హూసేనీ..ఇమామ్ హుస్సేన్ ) లను ఘనంగా పూజించేవారు.హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా మొక్కుబడి తీర్చుకోవడానికి సవారి దట్టి అంటే పీర్లకు కట్టే వస్త్రం, ఇచ్చేవారు.ఊరు రోడ్డుపై ఒక హోటల్ ఉండేది.దాని ఓనర్ మియన్ భాయ్.ఆ హోటల్ పక్కన జానీ
మటన్ షాపు ఉండేది.ఆ హోటల్ కి రోజూ వచ్చే ఆంధ్ర ప్రభ పత్రిక చదవడానికి ఊరోళ్ళంతా లైను కట్టేవాళ్ళు.
మియన్ భాయ్ ..ఈయన పీర్ల పండుగ అప్పుడు ముజావర్ గా వ్యవహరించేవాడు.ముజావర్ అంటే వాళ్ళ పద్దతి ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించేవాడనీ అర్థం.
ముజావర్ ఈ నాలుగు రోజులూ పీర్లు బయలుదేరే ముందు ఆ పీర్ల పేరు మీద ఫతేహా చదివి
ఊదు కాల్చడం,రడబూషన్ పీర్ నీ తీసేముందు మేకను కోయడం,పీర్లతో పాటు ఇంటింటికీ వెళ్లడం చేసేవాడు. ఆయనకు సహాయంగా బషీర్, మౌలానా,మన్సూర్ లు ఉండేవారు. నాలుగు పీర్లలలో, పెద్ద లాల్ పీరీనీ గౌడ కులస్తులు కమ్మంపాటి మల్లయ్య ఎత్తుకొనెటోడు, చిన్న లాల్ పీరీనీ మంగలి లక్ష్మయ్య
కొడుకు లాలయ్య,ఖాసిం పీరినీ చాకలి బాల నర్సింహ,ఎత్తుకునేవాళ్ళు.
ఆఖరికి రడబూషన్ పీరీ...ఇది చాలా పవర్ ఫుల్... దీన్ని చాకలి బుగ్గయ్య ఎత్తుకునేవాడు.అప్పట్లో ఆయన ఆ పీరీ ఎత్తుకొని వీధుల్లోకి వస్తుంటే,అందరూ భయపడేవారు..అంటే భక్తి తో కూడిన భయం.
నాలుగు రోజులు రోజుకో పీరీ గాలిబ్ ఆరంబాజాతో,మియన్ ముజావర్ వెంట నడుస్తూ ఊర్లో ఇంటింటికీ వెళ్లడం ఆనవాయితీ.ప్రతి ఇంటి ముందు ఆ ఇంటి వాళ్ళు పెద్ద బిందె నీళ్ళతో పీరీనీ ఎత్తుకున్న వాళ్ళ కాళ్ళను కడిగేవారు.ఆ తరువాత తమకు తోచిన డబ్బులు అంటే అప్పట్లో ఒక రూపాయి
రెండు రూపాయలు ముజావర్ కి ఇస్తే ఆయన ఆ నోటును పిన్నీసుతో,పీరీ సవారి దట్టికి కట్టేవాడు.అనంతరం ఏదో మంత్రం చదివి ఆ ఇంటి కుటుంబ సభ్యులకు విభూతి పెట్టేవాడు.ఈ నాలుగు రోజులు రాత్రి సమయాల్లో జాతరలో అగ్ని గుండాలు ఎలా జరుగుతాయే అలా పీర్లను ఎత్తుకొని నిప్పుల మీద నడిచేవారు.దానని అలావ్ అంటారు.ఊర్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు గానీ మరే ఇతర బాధలుంటే ఆ నలుగురిని తలుచుకొని నిప్పుల మీద నడుస్తే సమసిపోతాయనీ నమ్మకం.
ఈ నాలుగు రోజులు రాత్రి సమయాల్లో
పీర్ల కొట్టం దగ్గర ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తూ గడుపుతారు.అలా పీర్ల పండుగను మా ఊర్లో జరుపుకునేది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి