సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -203
మృద్ఘట న్యాయము
    *****
మృద్ఘటము అంటే ఎర్రమట్టితో చేసిన కుండ.
మృద్ఘట న్యాయము అంటే కుండ యొక్క ఆది మధ్యావసానముల అంటే మొదలు మధ్య చివర్లో ఉండేది అంతా మట్టియేననీ. కొంత కాలం ఆ రూపంలో ఉన్న కుండ తర్వాత మళ్ళీ మట్టిలో కలిసిపోతుందని అర్థం.
ఆధ్యాత్మిక దృష్టితో చూసినట్లయితే ఈ జగత్తు యొక్క ఆదిమధ్యావసానముల వుండునది బ్రహ్మ పదార్ధమేననీ, ఈ జగత్తు స్వరూపమంతా బ్రహ్మ సృష్టి విలాసమేననీ అర్థం వచ్చేలా ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఇదే అర్థంతో వేమన గారు రాసిన పద్యాన్ని చూద్దాం.
"బ్రహ్మ ఘటము మేను ప్రాణంబు తగగాలి/ మిత్రచంద్ర శిఖులు నేత్రచయము/ మఱియు బ్రహ్మమనగ మహి మీద లేదయా/ విశ్వధాభిరామ వినురవేమ!"
 బ్రహ్మ సృష్టించిన మనిషి జన్మను చూసినట్లయితే దేహము ఒక ఘటం లాంటిదనీ,ప్రాణము నిల్పేది గాలి వల్లననీ,సూర్య చంద్రులు రెండు కళ్ళనీ ,ఇదే  ఈ భూమ్మీద బ్రహ్మ సృష్టి విలాసమనీ అంటారు వేమన.
అలాగే బూదరాజు రాధాకృష్ణ గారు" తెలుగు జాతీయాలు"అనే పుస్తకంలో  ఈ "మృద్ఘట న్యాయము"నకు సంబంధించి రాసిన విషయాలు చూద్దామా...
బ్రహ్మ సృష్టి కర్తగా ఈ భూగోళాన్ని కుండలాగా తయారు చేశారట.ఆ కుండ కూడా గుండ్రంగా ఉండకుండా గుడ్డులో తయారు చేశారట.
 అందువల్ల వల్ల భూమి వంటి ఇతర గోళాలను కలుపుకుని బ్రహ్మాండం లేదా బ్రహ్మాండ భాండం ( కుండ) అనీ,దానికో కప్పెర (కర్పరం) ఉంటాయనేది విశ్వాసం.
పెద్ద రాక్షసులు గర్జించినా, పెను యుద్ధాలు వచ్చినా, గొప్ప అస్త్రాలను సంధించి వదిలినా బ్రహ్మాండ భాండం బద్దలై పోతున్నట్లు,భూమీ ఇతర గ్రహాలు కుమ్మరి సారెలాగా గిరగిరా తిరిగినట్లు కవులు వర్ణిస్తుంటారు.
ఈ రెండింటి అర్థంలో ఘటం లాంటి దేహం ఈ భూమ్మీద శాశ్వతం కాదని, ఘటం కొంత కాలం ఉండి మరల ఈ బ్రహ్మాండంలో కలిసి పోతుందనే అనే నిగూఢమైన అర్థం ఇందులో ఇమిడి ఉంది.
 వేదాంతులు ఆధ్యాత్మిక చింతనతో చెప్పినా, సామాన్యులు తమకు తెలిసిన భావంలో అవగాహన చేసుకున్నా... పంచభూతాల నిలయమైన ఈ ప్రపంచంలో మానవులైన మనలోనూ పంచభూతాలు ఉన్నాయనీ, దేహంలోని వాయువు చలించడం మానేసిన వెంటనే నిర్జీవంగా మారి వీటిల్లో కలిసి పోతాయని అర్థం చేసుకోవచ్చు.
ఈ విషయాన్ని ప్రతి క్షణం గమనంలో పెట్టుకొని,కుట్రలూ, కుతంత్రాలూ,కక్షలూ, కార్పణ్యాలనూ మానేసి జీవితాన్ని మంచి పనులతో ఫలవంతం చేసుకోవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు