సుప్రభాత కవిత ; - బృంద
చీకటికి వెలుగంటే 
చెప్పలేనంత ప్రేమ
తూరుపు గుమ్మంలో
తొలి కిరణం కనపడగానే
తను మొత్తం దాసోహమంటుంది.

వేకువలో మెలకువ రాగానే
స్వప్నాలన్నీ సందడిగా
ఉనికిని వెదుకుతూ
ఉరుకులు పరుగులు

అన్నీ మరచిన మనసేమో
నునువెచ్చని కిరణాల
స్పర్శని ఆస్వాదిస్తూ
ప్రశాంతంగా ప్రకృతిని
ప్రేమగా పరికిస్తుంది.

సాగే గాలుల గుసగుసలు
ఊగే ఆకుల గలగలలూ
ఎగిరే గువ్వల కిలకిలలు
నవ్వే పువ్వుల కళకళలు

అన్నీ ఎంత ఆనందంగా
స్వాగతిస్తున్నాయో!!
అందమైన మరో ఉదయాన్ని!

పరుగులాపి కాసేపు
ప్రకృతిని పలకరిస్తే
ఎన్ని ముత్యమంటి క్షణాలో
జీవనసాగరంలో!

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు