సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -189
మహానస శశ న్యాయము
******
మహానస అంటే వంట యిల్లు.శశం అంటే కుందేలు.దీనినే చెవుల పోతు,పులతకరి అని కూడా అంటారు.మహానస శశ అంటే వంటింట్లో కొచ్చిన  కుందేలు అని అర్థం.
వంటయింట్లోకి ప్రవేశించిన కుందేలు సులభముగా పట్టుబడును అనే ఉద్దేశంతో ఈ మహానస శశ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఒక్కసారి దొరికి పోయి పట్టుపడితే  ఇక తప్పించుకోలేని వ్యక్తిని గురించి "వంటింటి కుందేలు"తో పోలుస్తారు.
మరి కుందేలునే ఉదాహరణగా ఎందుకు తీసుకున్నారో తెలుసుకుందాం.
కుందేలు చాలా సుకుమారమైన జంతువు.మృదువైన మెరిసే వెంట్రుకలు ,కళ్ళతో చూడముచ్చటగా ఉంటుంది.
ఇది  చాలా చలాకీగా,ఉత్సాహంగా ఉండే జంతువే కానీ పిరికిది.అడవిలో గుబురు పొదల్లో దాని  నివాసం. వేగంగా గెంతుతూ పరుగులు తీస్తుంది.దీనిని వేట గాళ్ళు వల లేదా ఉచ్చు వేసి పట్టుకుంటారు.
దీని లక్షణాలు భలేగా ఉంటాయి. వేటగాడు వలలో పడ్డ కుందేలును చెవులు పట్టుకుని లేపుతాడు.అలా పట్టుకున్న కుందేలు చుట్టూ   గిరిలాగా గుండ్రటి గీత గీసి ఆ గీతను కొంచెం మట్టితో గోడలా కడితే అది దాన్ని దాటి బయటకు పోదట. దానికి చిన్న దారిలా  చేస్తే అది చూసి చెంగున ఎగిరి పారిపోతుందట.అది దానియొక్క బలహీనమైన లక్షణం అన్నమాట.
ఇది చదువుతుంటే మనకు పెద్ద ఏనుగును చిన్న సంకెళతో బంధించడం గుర్తొస్తుంది కదండీ!
అలాంటి కుందేలు వంటింట్లో ప్రవేశించినప్పుడు దానిని బంధించడం ఎంత సులువో అర్థం చేసుకోవచ్చు.
ఆ విధంగా దొరికిపోయిన వ్యక్తి తప్పించుకోకుండా అక్కడే తిరుగుతూ ఉంటే  వంటింటి కుందేలు అనీ, వంట ఇంటి కుందేలు అయిపోయాడని అంటుంటారు.
 ముఖ్యంగా ఈ పదబంధాన్ని భారతీయ స్త్రీలకు అన్వయిస్తూ ఉంటారు.
వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సమస్యలను చక్కదిద్దగల సామర్థ్యం ఉన్న వాళ్ళైనా వారిని వివాహ బంధంతో కట్టి పడేస్తే ,వారు ఇక ఏ ఇతర ఆలోచనలు లేకుండా ఆ వంటింటికి, కుటుంబానికి అంకితమై పోతారు.వారిని  అవమానించినా,అనాదరించినా,పనిమనిషిగా లోకువగా చూసినా కుటుంబ పరువూ,పిల్లల కోసం భరిస్తూ అలాగే ఉంటారు. అందుకే ఆడవారిని వంటింటి కుందేలని వ్యంగ్యంగా అనడం వింటుంటాం.
 కొందరు స్త్రీ వ్యక్తిత్వాన్ని,శ్రమను గౌరవిస్తూ భార్యకు చేదోడువాదోడుగా వంట ఇంట్లో సహకరించే వారిని  కొందరు వెటకారంగా  వంటింటి కుందేలు అయిపోయాడని అంటుంటారు.
'చమత్కారచణుడు'గా పేరు తెచ్చుకున్న చేమకూర వేంకట కవి విజయ విలాసము అనే ప్రబంధ కావ్యంలో ద్వారకా నగర వర్ణననలో ఆ నగరపు మేడలు చంద్రలోకం అంటుతున్నాయనీ,ఆ మేడల చంద్రశాలల్లో లలితాంగులు ఆనందంగా విహరిస్తూ "ఈ చందమామ మన మేడలో చిక్కుపడి పోయాడు ఇక ఎక్కడికీ పోలేడని అనుకున్నారని చమత్కారంగా చెబుతాడు.
ఆ గ్రంథంలో "వంట ఇంటి కుందేలు యెందు బోవును"  అని చంద్రుని గురించి రాసిన వాక్యం ఎంత బాగుందో కదా! ఎలాగూ అందడు కానీ అతి దగ్గరగా కనిపించే చంద్రుని ఆ విధంగా ఆ స్త్రీలు భావించడం ఆ కవి చమత్కార రచనకు మచ్చుతునక.
చందమామను శశి, శశాంకుడు అని పిలుస్తారు. కారణం నిండు చందమామను బాగా  పరికించి చూస్తే అందులో కుందేలు ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి శశి, శశాంకుడు అయ్యాడంటారు.
 "వంటింటి కుందేలు" అనే పదబంధాన్ని ఎవరెవరికి వర్తింప చేస్తారో ఈ "మహానస శశ న్యాయము" ద్వారా తెలుసుకోగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు