నానుడి కథలు ; ౼ డా.దార్ల బుజ్జిబాబు
 కరటక దమనకులు
ఇతరులను మోసం చేసే ఇద్దరు వ్యక్తులు జంటగా తిరుగుతుంటే వారిని కరటక దమనకులు అని పిలుస్తారు. వారితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ వుంటారు. మంచిగా ఉన్నట్టు నటిస్తూ కపట ఉపాయాలు పన్నే మిత్రులను కరటక దమనకులు అని వ్యవహరిస్తారు. ఈ నానుడి పంచతంత్ర కథలలో నుండి వచ్చింది. 
       పంచ తంత్రాలలో మిత్ర భేదం ఒకటి. ఒక ధనవంతుడైన వర్తకుడు తన ఎద్దుల బండిపై సరుకులుతో అడవిలో వెళుతూవుంటే ఒక ఎద్దుకు కాలు బెణుకుతుంది. బండిని లాగా లేక పోతుంది. వర్తకుడు ఆ ఎద్దును అక్కడే వదిలేసి మరో ఎద్దును తెచ్చుకుని సరుకుల బండి తీసుకుని వెళ్ళిపోతాడు. కొన్నాళ్లకు అడవిలోని పచ్చటి గడ్డి తిని ఎద్దు బాగా బలిసింది. ఎద్దు కాలు కూడా బాగవుతుంది. ఓ రోజు సంతోషంతో గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు చెరువులో మంచినీరు త్రాగుతున్న అడవిరాజు సింహం విని, ఏదో కొత్త జంతువు అరుపు అనుకుని భయపడుతుంది. దానికి  కరటకుడు దమనకుడు అనే రెండు నక్కలు మంత్రులుగా ఉండేవి. అవి దుష్ట బుద్ధి గలవి.  అవసరమైన చోట ప్రాణమిత్రులుగా, సహాయం చేసేవారిగా నటిస్తూ మోసం చేసేవి.  వాటికి అడవిలోని అరుపు ఎద్దుదే అని తెలుసు. అయినా ఆ విషయం రాజుకు చెప్పకుండా సింహాన్ని ఇంకా  ఎక్కువగా బెదిరిస్తూ ఉండేవి. ఎలాగైతేనేం ఎద్దును రాజు వద్దకు తెచ్చి కలుపుతాయి. రాజు,ఎద్దు  మంచి మిత్రులవుతాయి. వాటి స్నేహానికి ఈ నక్కలు ఈర్ష్య పడేవి. రాజుకు, ఎద్దుకు మధ్య చిచ్చుపెట్టి  రాజుచేత ఎద్దును చంపిస్తాయి. ఇది కథ.
   ఇక్కడ కరటక దమనకలు అనే ఈ రెండు నక్కలు చూపెట్టిన ఈర్ష్య ద్వేషాల వల్లనే ఎవరికి ఏ కీడు చేయని ఎద్దు చనిపోవలసి వచ్చింది. ఇలాంటి దుష్టపన్నాగాలు పన్నే వారిని ఈ కథలోని నక్కల పాత్రలతో పోల్చుతూ వాటి పేర్లు పైన కరటకదమనకులు నానుడి వాడుకలోకి వచ్చింది.
౼ డా.దార్ల బుజ్జిబాబు

కామెంట్‌లు