కృషివుంటే ....!!------శ్రీమతి సత్యగౌరి.మోగంటి .-- ఉపాధ్యాయిని (రిటైర్డ్ )


 మొన్న 'అమ్మాయి పి.హెచ్.డి 'చూసి మా విద్యార్థులు గుర్తుకొచ్చారు.
వీలైనప్పుడల్లా వారి వివరాలు అందరికీ తెలియజేయాలని సంకల్పించాను.
ఈ రోజు మా అమ్మాయి క్లాస్ మేట్,స్నేహిత అయిన 'పార్వతి' గురించి చెప్పాలని.
పల్లెల్లో పాఠశాలలకు వచ్చే వారిలో అధికులు పేదవారే.
పార్వతికి చదువు,ఆటలు చాలా ఇష్టం.
ఇంట్లో అమ్మ గృహిణి.
నాన్న కూలి పని.
నలుగురు పిల్లల్లో ఈమె పెద్దది.
బడి మానిపించేశామని పంపనప్పుడల్లా మా టీచర్స్ ఇద్దరమో,ముగ్గురమో వెళ్లి బతిమాలి తీసుకొచ్చిన పిల్లల్లో పార్వతి ఒకమ్మాయి.
తల్లిదండ్రులు '"మా ఇళ్లల్లో పెద్దదైన ఆడపిల్లలని బయటకు పంపం.
మీకేం మీరు సదువకున్నోరు..మేము కూలినాలి చేసుకుకునే వోళ్లం.
మా బాధలు మీకేటి తెలుత్తాయి లెండి'" అనేవారు.
ఇంట్లో అమ్మకు సాయ చేస్తూ,చెల్లెళ్లనూ,తమ్ముని ఆడిస్తూ ఎలాగో  కష్టపడి 10 పూర్తి చేసింది.
మేము ట్రాన్స్ఫర్ అయి కాకినాడ వెళ్లిపోయాము.
ఓ రోజు మా వారు చెప్పారు.
శంఖవరం మన పార్వతి ఇక్కడే ఉంటోంది.
బాబు,పాప తనకు.
వాళ్లు నా స్కూలే అని.
ఆశ్చర్య్పపోయా.
చదువుకునే వయసు కదా తనది అని.
మరో రోజు సడన్ గా పూలు,పళ్లు,స్వీట్లు పట్టుకుని వచ్చి మా కాళ్లకి దణ్ణం పెట్టి మేడమ్ నేను డి.ఎస్.సి.లో స్కూల్ అసిస్టెంట్ గా సెలెక్ట్ అయ్యా. నాది  తొమ్మిదో రాంకు అని చెప్పింది.
నాకు సంతోషం పట్టలేకపోయా.
సార్లు,మీరు చాలా ప్రోత్సాహాన్నందించారు మేడమ్ అప్పుడు నాకు,ఇప్పుడు మా పిల్లలకు కూడా అని చెప్పింది సంతోషంగా.
తరువాత తెలిసింది.
10 తరువాత  ఓ తాపీ మేస్త్రి తో పెళ్లి చేసారని,కాకినాడ వచ్చామని చెప్పింది.
భర్త చాలా మంచివాడని,తన మరియు తోబుట్టువుల ప్రోత్సాహంతో పది సంవత్సరాల తరువాత ఇంటర్,ప్రయివేటుగా డిగ్రీ చదివి బి.యిడి టీచర్ ట్రైయినింగ్ చేశానని చెప్పింది.
ఇక అక్కడ నుండీ మాకు టచ్ లోనే ఉంది.
ఒకసారి హైస్కూల్ గెట్ టుగెదర్ లో చెప్పింది.(ఇంకా ఆడపిల్లలు కూడా చెప్పారు చాలా)
నేను వారి రోల్ మోడల్ అని.
నాలా బాగా చదువుకుని సోషల్ టీచర్ కావాలని అప్పటి నుండే అనుకున్నాని.
ఆశ్చర్యపోయా వారి ప్రేమకు.
మనం ప్రత్యేకంగా చేసేదేముంటుంది,చదువు చెప్పడం,వెనకబడిన వారిని కాస్త ప్రత్యేక దృష్టి పెట్టడం,
మనకు చేతనైన సహాయం చేయడం.
జీతం తీసుకునే కదా పనిచేసేది.
ఆవగింజంత సహాయానికి అపారమైన ప్రేమాభిమానాలు చూపించడం వారి గొప్పతనం.
ఇప్పుడు తన ఆ పిలల్లిద్దరూ డిగ్రీలై,సివల్స్ కోచింగ్ తీసుకుంటున్నారని మొన్న ఫోన్ లో చెప్తే విని ఆనందశ్చర్యాలలో మునిగి అభినందించాము.
ఈసారి మమ్మల్నిహైదరాబాదు వచ్చినప్పుడు కలుస్తామని చెప్పింది.
వాళ్లాయన ఓ మంచి బిజినెస్ లో సెటిలయ్యారని చెప్పింది.
ఆయనను మేమూ చూశాము.
మగవాడు చదివితే తను విద్యావంతుడు అవుతాడు.
అదే ఆడపిల్లైతే కుటుంబమూ,సమాజమూ కూడా విద్యావంతులవుతారు కదా. 
ఇలాంటి విద్యార్థులు,వారు ఇప్పటికీ మాతో అనుబంధం కలిగి ఉండటం మా అదృష్టం.
కోట్లు ఇచ్చినా ఇటువంటి సంతృప్తి,సంతోషం దొరకవు
                              ***
కామెంట్‌లు