తమిళ చిత్రకారులలో ఒకరైన మారుతి కుంచె ఆగింది. అందమైన చిత్రాలతో మనసుని కట్టిపడేసే చిత్రకారుడు మారుతి.
గుండెజబ్బుతో బాధపడుతున్న మారుతి జూలై ఇరవై ఏడో తేదీన కన్నుమూశారు.
ఆయన వయస్సు ఎనబై ఆరేళ్ళు. పుణెలో తన కుమార్తె ఇంట్లో ఉంటున్న మారుతి కుంచె ఆగింది గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు.
1938 ఆగస్ట్ 28వ తేదీనపుదుక్కోట్టయ్ లో వెంకోబరావు, పద్మావతి బాయి దంపతులకు జన్మించిన మారుతి అసలు పేరు రంగనాథన్. ఆయన మారుతి పేరుతో తమిళపత్రికలలో బొమ్మలు వేసి పేరుప్రఖ్యాతులు గడించారు.
తంజావూరుకు చెందిన ప్రభుత్వ ఉద్యోగిణి విమలను పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. సుభాషిణి, సుహాషిణి.
ఆనందవిగడన్ (వికటన్), కుంగుమం, కుముదం, కన్మణి తదితర పత్రికలకు ముఖచిత్రాలు సింగారించిన ఈయన వేల కథలకు , కవితలకు బొమ్మలు గీశారు.
ఆయన చిత్రరచనలను ప్రశంసిస్తూ తమిళనాడు ప్రభుత్వం కళైమామణి బిరుదుతో సత్కరించింది. బొమ్మలు గీయడమే కాకుండా ఉలియిన్ ఓసై, పెణ్ సింగం వంటి సినిమాలకు డిజైనర్ గా కూడా పని చేశారు.
ఈయన కుంచెలో జీవం పోసుకున్న లెక్కలేనన్ని దేవతలకు అభిమానుల సంఖ్య అపరిమితం.
1969లో సినిమా బ్యానర్లకు బొమ్మలు వేయాలనే ఆశతో చెన్నైకి వచ్చిన ఈయన మైలాపూరులో ఓ సంస్థలో చేరారు. అక్కడ బొమ్మలు గీస్తూ అక్షరాలు దిద్దుతూ కొన్ని పత్రికలకూ బొమ్మలు వేస్తూ వచ్చారు. ఆయన కుంచెలో పుట్టుకొచ్చిన అమ్మాయిల అందం చూసేవారిని ఇట్టే ఆకట్టుకునేది.
మారుతి తన గురించి చెప్పుకున్న విషయం ఆయన మాటల్లోనే చూద్దాం...
తండ్రి ఓ స్కూల్ టీచర్. నాతోడ పుట్టిన వారు అయిదుగురు. ముగ్గురు సోదరులు. ఇద్దరు సోదరీమణులు. అయిదారేళ్ళకు కులప్పట్టి బాలయ్య స్కూల్లో చేరాను. నేను చదువుకుంటున్న ఆ రోజుల్లోనే దేశానికి స్వాతంత్ర్యం రాబోతోంది. నాన్న చిన్న చిన్న డిజైన్లు వేసేవారు. వరలక్ష్మి వ్రతంరోజున కలశానికి రంగులు పులిమి ఓ డిజైన్ వేసేవారు. అప్పుడు నేనూ ఆయనకు సహకరించేవాడిని. అప్పుడే నా చిత్రకళకు పునాది పడింది. ఆ తర్వాత నేనుగా బొమ్మలు గీయడం మొదలుపెట్టాను. పి. యు. చిన్నప్ప, త్యాగరాజ భాగవతార్, శివాజీ, ఎంజిఆర్ వంటి పోస్టర్లు చూసి బొమ్మలు గీస్తుండేవాడ్ని. ఆ తర్వాత పత్రికలలో వచ్చే బొమ్మలమీద దృష్టి మళ్ళింది. మా ఇరుగుపొరుగు ఇళ్ళల్లో ఏ ఏ పత్రికలు కొంటున్నారో చూస్తుండేవాడిని. సరిగ్గా ఉదయం వారిళ్ళ ముందు నిలిచేవాడిని. కొందరు అప్పుడే పేపర్ ఇచ్చేవారు. కొందరేమో తర్వాత రా అనేవారు. ఇంకొందరు అసలు ఇచ్చేవారు కాదు. మరికొందరు గడువు పెట్టేవారు. నేనలా పత్రికలను ఇంటికి తెచ్చుకుని వాటిలోని బొమ్మలను చూసి గీసేవాడిని. నాన్నకు పత్రికలు కొనేంత జీతం ఉండేది కాదు. ఆయన జీతం అరవై ఏడు రూపాయలు. ఆ డబ్బులతో మేము ఏడుగురం బతకాలి. నేల మీదా గోడల మీదా బొమ్మలు వేస్తుండేవాడిని. మేమున్నది అద్దె ఇల్లు. గోడనిండా బొమ్మలు గీస్తుండేవాడిని. నాన్న టీచర్ అవడంతో సుద్దముక్కలకు లోటు లేదు. ఓరోజు ఇంటికొచ్చిన హోస్ ఓనర్ నేను గోడమీద గీస్తున్న బొమ్మ చూశారు. తిడతారనే అనుకున్నాను. కానీ పొగిడారు. అంతేకాదు, గోడమీదా నేలమీదా గీయకు. వాటివల్ల లాభం లేదు. కాగితాలపై బొమ్మలు వెయ్యి. బాగా ప్రాక్టీస్ అవుతుంది. చేయి తిరుగుతుంది అన్నారు. అప్పుడే నువ్వు ఆ బొమ్మలను తీసుకెళ్ళి ఎవరికైనా చూపించగలవు అన్నారు. ఆయనలా చెప్పిన తర్వాతే కాగితంమీద బొమ్మలు వేయడం మొదలుపెట్టాను. బొమ్మలు గీయడం మీదున్న ఆరాటం చదువుమీద ఉండేది కాదు. అయితే ఎట్టాగో గట్టెక్కాను. అమ్మకూ నాన్నకూ నా గురించి దిగులు. బొమ్మలు గీయడం మీదున్న ఆరాటంతో పబ్లిక్ పరీక్షలలో ఫెయిలైపోతానేమోనని వారి భయం. వారి ఆందోళన సబబే. ఫోర్త్ ఫాంలో (అంటే ఇప్పుడు తొమ్మిదో తరగతి) లో ఫెయిలయ్యాను. టీచర్ కొడుకే ఇలాగైతే అని నాన్న ఎంతో కోప్పడ్డారు. ఇప్పట్లాగా అప్పట్లో వెంటనే అన్నీ రాయడం కుదరదు. మళ్ళీ ఏడాదంతా ఆ తరగతిలో చదవాల్సిందే. ఈ సమయంలోనే మదురైకి చెందిన ఓ చిత్రకారుడు ఒకే స్ట్రోక్ లో బొమ్మలు గీసేవారు. అప్పట్లో ఓ పార్టీ గుర్తు ఎడ్ల బండి. ఆయన అచ్చం అలానే గీసేవారు. ఆయన ఎక్కడల్లా గీసేవారో అక్కడ నిలబడి చూస్తుండేవాడిని. దానిని ఇంటికొచ్చి అలాగే గీసేవాడిని. ఇది అమ్మకూ నాన్నకూ మరింత ఆందోళన కలిగించింది. నువ్వు ప్యాసైతే ఆర్ట్స్ కాలేజీలో చేర్చాలనుకుంటున్నాం. ఆర్ట్ అనే మాటతో ఆసక్తితో స్కూల్ ఫైనల్ ప్యాసయ్యాను. ఆ తర్వాత కాలేజీ. పియుసి ఓ ఏడాది చదివాను. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ. నేను అప్పటి వరకూ చదువుకున్నది తమిళ మీడియం. కాలేజీలో అంతా ఇంగ్లీషు. ఏమీ అర్థమయ్యేది కాదు. ఇక లాభం లేదనుకుని నాన్నతో భయం భయంగానే చెప్పేశాను చదువెక్కడం లేదని.
దాంతో నా చదువు అటకెక్కింది. అయితే నా శక్తిసామర్థ్యాల మీద అంటే బొమ్మలు గీయడంమీద నాకు అపార నమ్మకముంది. ఉదయం లేచి గుడికి వెళ్ళి అక్కడ కూర్చుని విగ్రహాలను చూసి బొమ్మలు గీసేవాడిని. చిత్రకారుడు శిల్పికి నేను అభిమానిని. చిత్రకారుడు మాధవన్ ని మానసిక గురువుగా భావించాను. చెన్నై నుంచి వచ్చే చిత్రకారులను కలిసి అక్కడికెళ్తే ఉపాధి లభిస్తుందాని అడిగేవాడిని. అయితే వాళ్ళు వొట్టి బొమ్మలు వేస్తే సరిపోదు, అక్షరాలు కూడా రాయడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. అప్పుడే సినిమా పోస్టర్లు తయారు చేసే చోట ఉద్యోగం దొరుకుతుందన్నారు. వారి సూచనతో అప్పటి నుంచి బొమ్మలు గీయడమే కాకుండా అక్షరాలు రాయడం (లెటరింగ్) కూడా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. అనంతరం చెన్నైకి బయలుదేరాను.
ఓ సినిమా పోస్టర్ ప్రకటనలు తయారు చేసే చోట ఉద్యోగం లభించింది. జీతం యాబై రూపాయలు. ఎంజిఆర్, శివాజీ ఫోటోలు కత్తిరించి అతికించి, వాటిలో శీర్షిక, వివరాలు రాయడం పని. నాకు పత్రికలో పని చేయాలని ఆశ. కుముదం (ఇది ఓ తమిళ వారపత్రిక) ఆఫీసుకి వెళ్ళాను. నాకు పని చేసే అవకాశం ఇవ్వమని అడిగాను. అక్కడ అప్పట్లో ఫ్రీలాన్స్ ఆర్టిస్టులకు ఎక్కువ వకాశాలు ఉండేవి. నాకు ఏదో ఒక విషయం చెప్పి బొమ్మలు గీయమనేవారు. వాష్ డ్రాయింగ్. అంటే, ఒకే రంగులో గీసే చిత్రాలు. ఒకటి గీసి చూపించాను. అది చూసి ఇటువంటి బొమ్మలు మేము వేసుకోం అని చెప్పి ఆ బొమ్మ తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ వాష్ చిత్రమే ఆ పత్రిక ముఖచిత్రంగా అచ్చయ్యింది. అది ఆయన కెరీర్ లో ఓ మలుపు అని మారుతి చెప్పుకున్నారు.
అంతే ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. ఓ ప్రముఖ చిత్రకారుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నారు.
అవును. మారుతి చిత్రాలు ఒక్కొక్కటీ మాట్లాడుతాయి. వాటిని చూస్తుంటే ఓ ఉత్సాహం వస్తుంది. కొట్టొచ్చే వర్ణాలు. చాలా సహజంగా ఉండేవి. ఆయనకు మారుతి అనే పేరు పెట్టుకోవలసిన సమయం వచ్చింది.
దాని గురించి ఆయన చెప్తూ చెన్నైకి వచ్చిన కొత్తలో నేను ఓ గుడిసెలో ఉండేవాడిని. నెలకు ఒకటి రెండు పనులే వచ్చేవి. సినిమా ప్రకటనలతో వచ్చే డబ్బులతో నెలంతా గడిచేది. ఆ సినిమా పోస్టర్లు తయారు చేస్తూనే పత్రికల్లోనూ బొమ్మలు గీసే అవకాశం కోసం తిరిగాను. ఓరోజు పత్రికలకు వెళ్ళి బొమ్మలు గీసి నేను పని చేసే సినిమా పోస్టర్ల ఆఫీసుకి ఆలస్యంగా వచ్చి యజమానికి పట్టుబడ్డాను. ఎందుకు లేటుగా వచ్చావు...అని అడగ్గా నిజం చెప్పేసాను. వెంటనే ఆయన ఇక్కడ మాత్రమే పని చేసేటట్టయితే చెయ్యి, లేకుంటే మానేసే అని హెచ్చరించారు. కానీ నాకేమో పత్రికలు విడివటం ఇష్టం లేదు. అది నా శ్వాస. అయితే అదే సమయంలో సినిమా ప్రకటనల ఉద్యోగాన్ని మానుకోలేని స్థితి. అప్పట్లో అన్నం పెట్టేదదే. అందువల్ల ఏదన్నా మారుపేరుతో పత్రికలకు బొమ్మలు వేయాలనుకున్నాను. ఏం పేరు పెట్టాలా అని ఆలోచించాను. నేను ఉంటున్న ఇంటికి పక్కనే మారుతీ ఫార్మసీ ఉంది. ఆ మారుతీ పేరు నాకు నచ్చింది. ఎందుకంటే, మా నాన్న ఆంజనేయుడి భక్తుడు. ఆ క్షణమే పత్రికలకు వేసే బొమ్మలకు నా పేరు మారుతీ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నా అసలు పేరైన రంగనాథన్ అంటే ఎవరికీ తెలీదు. మారుతీ అనే మారుపేరే అందరికీ పరిచయం.
బొమ్మలు మాత్రమే కాక సినిమాలకు డిజైన్లు వేసి ఓ గుర్తింపు పొందిన మారుతీ ప్రభుత్వం నుంచి సన్మానం కూడా పొందారు.
సెంగోట్టయ్ శ్రీరాం అనే ఆయన మారుతి వీరాభిమాని. ఆయన మారుతిని తరచూ కలుస్తుండేవారు. ఓమారు మారుతి ఇంకా పెళ్ళి చేసుకోలేదేమిటండీ అని అడగ్గా, శ్రీరాం చెప్పిన జవాబు...
సార్, మీరు గీస్తున్న అందమైన స్త్రీ ముఖారవిదం కోసం చూస్తున్నానండి. ఇప్పటికీ నాకు అటువంటి అందమైన అమ్మాయి దొరకలేదండి అని.
మారుతీ గీసే ప్రతి బొమ్మా ఓ అందమైన కవితే. ఇలా చెప్పడం ఓ చిన్న మాటే.
కళ్ళు పరస్పరం కలుసుకున్నప్పుడు తెలిసొస్తాయి మనసూ, అనుభూతీ.
ఆడ మగో...ఒకరి మనసుని అంచనా వేయడానికి కళ్ళే దోహదపడతాయి. కళ్ళు ఒకరు నిజం మాట్లాడుతున్నారా అబద్ధం మాట్లాడుతున్నారా అని చెప్పేవి కళ్ళే. నాకు కూడా కళ్ళలోకి చూసి మాట్లాడటమే ఇష్టం. కొందరి కళ్ళు తీక్షణకు భయపడి చూపులు అటు ఇటూ దిక్కులు చూస్తుంటాయి. అంతేతప్ప తిన్నగా కళ్ళలోకి చూసి మాట్లాడలేరు. నాకు ఇష్టమైన చిత్రకారులు అనేకులు. వారిలో మారుతి ఒకరు. ఆయన చిత్రాలు మాస పత్రికలు, నవలలను సింగారించాయి. ఆయన గీసే బొమ్మల కళ్ళను చూస్తే మనల్ని మనం మైమరచిపోతాం. ఆ కళ్ళు అంత అందంగా కనిపిస్తాయి. కబుర్లు చెప్తాయి. నవ్విస్తాయి. మనసుకి ఉత్తేజాన్ని ఇస్తాయి. వాటికి అబద్ధమేదో నిజమేదో బాగా తెలుసు. అబద్ధం చెప్పేవారి మాటలను వినడం దేనికీ, కాలాన్ని వృధా చేసుకోవడమే అంటాయి కళ్ళు. అవును, కొందరు కళ్ళు మూసుకుని మాట్లాడతారు. ఎందుకంటే కళ్ళను తెరిచి మాట్లాడితే వినే కళ్ళు తెరచుకుంటాయి కదా.
ఏదేమైనా మారుతీ సృష్టించిన బొమ్మలకు ఇదే నా నివాళి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి