మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ఉదయభారతి గురుకులంలో వేదాంత పరంగా కూడా బోధనలు ఉండేవి. ఒకరిపై ప్రేమ ఆదరణ జాలి నీతి నిజాయితీ క్రమశిక్షణ ఒకరికొకరు సహాయం సానుభూతులు కలిగి ఉండడం  నైతిక విలువలు వాటి విశిష్టతలు నేర్పినది  విద్యార్థులు నేర్చుకున్నది  ఆ జ్ఞాపకాలు వారిలో జీర్ణించుకుపోయి చివరి వరకు మంచి జీవితాన్ని అనుభవిస్తున్న వారే  ఇదంతా ఆశర్మ గారి చలవే అని భావిస్తూ ఉంటారు  కులం మతం వర్గం లేకుండా అంతా ఒకే కులం ఒకే జాతి అనే భావాన్ని పెంపొందింప చేసింది ఉదయభారతి  అక్కడే ఒకసారి బెజవాడ గోపాల్ రెడ్డి గారు వచ్చి ఈ పరిస్థితులు చూసి చాలా సంతోషించారు  అలాగే చాలామంది పెద్దలు వచ్చి చూసి వెళుతూ ఉండేవారు  వారు నేర్పుతున్న ప్రతి పద్ధతిని ఎంతో  ఆనందంగా అభినందించేవారు. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద పాములు వస్తుండేవి
త్రాచులు జెర్రిగొడ్డులు మొదలైన వాటిని కొంతమంది కుర్రాళ్లు పెద్దవాళ్ళు సులువుగా పట్టి నేలకు కొట్టి చంపేవారు  తేళ్లు మండ్ర గబ్బలు సరే సరి. రాత్రి ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉండేవి కొందరు పిల్లలు దయ్యాలను గురించి రకరకాల కథలు చెప్పేవారు. దెయ్యాలు పల్లకిలో మోస్తూ చేసే శబ్దాలు వినిపించాయని  కొరివి దయ్యాలు కాగడాలతో పోతుంటే చూసామని ఎన్నో కథలు చెప్పేవారు  అసలే అడవిలో ఉండేది అన్నీ తాటి చెట్లు దెయ్యలకు మూలంగా ఉండేది చిన్న పిల్లలు కూడా ఉండేవారు కదా ఆ పిల్లలకు ధైర్యం గొలిపే కథలు  భారత రామాయణ ఘట్టాలు చెప్పేవారు  ఎవరి కుటీరాలలోని వారికి వారి ఉపాధ్యాయులు అక్కడ హాస్పిటల్ కూడా పెట్టారు అంతా బాగానే ఉంది  అయితే సరియైన సౌకర్యాలు లేక ఉపాధ్యాయుల కొరత ఉండేది. అందుచేత విద్య పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పవచ్చును  ఈ గురుకులం నుంచి కాశీ విశ్వవిద్యాలయం నిర్వహించే మెట్రిక్ పరీక్షలకు కాశీకి పంపేవారు  అయితే ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండేవి కావు  ఈ విధంగా 1942 వరకు ఇక్కడ నడిపారు ఆ తర్వాత పూర్తి సౌకర్యాలు లేనందున ఈ గురుకులాన్ని విజయవాడకు మార్చడానికి నిర్ణయించుకున్నారు  తేలప్రోలు నుంచి ఏలూరు కాలువ గుండా పడవల పైన విద్యార్థిని విద్యార్థులను విజయవాడ చేర్చారు  ఈ పడవ ప్రయాణం చాలా అనుభూతిని కలిగించేది మరుపురాని సంఘటన  ఉయ్యూరు కుమార్ రాజా గారు గుణదల్లో తన దగ్గర ఉన్న భూమిని ఉదయభారతి గురుకులానికి రాసి ఇచ్చారు  1947 నుంచి గుణదల్లో రెండు మూడు సంవత్సరాలు నడిపారు తర్వాత గురుకులం సాగక మూసివేశారు.

కామెంట్‌లు