సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -228
లాంగూలతరణ న్యాయము
*****
లాంగూలం అంటే తోక.తరణం అంటే ఓడ,పడవ, స్వర్గము,దాటుట,జయించుట అనే అర్థాలు ఉన్నాయి.
లాంగూలతరణము అంటే తోక పట్టుకొని దాటడం.దేనితోక అంటే కుక్క తోక అనే అర్థంతో ఇక్కడ తీసుకోబడింది.
దీనినే తెలుగులో "కుక్క తోక పట్టుకొని గోదావరి నీదినట్లు" అనే సామెతతో పోలుస్తారు.
 గోదావరి లాంటి మహా నదిని కుక్క తోక పట్టుకొని ఈదడం సాధ్యమా? కాదు అనే అర్థంతో ఈ "లాంగూలతరణ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
అసలు కుక్క గజ ఈతగాడా కాదు.ఈదే సామర్థ్యమే చాలా తక్కువ. అలాంటి కుక్క తోక పట్టుకొని గోదావరి దాటాలని అనుకోవడం అసమర్థుల సహాయం తీసుకుని  ఎంతో గొప్పగా తలపెట్టిన పనిని పూర్తి చేయాలనుకోవడం లేదా సాధించాలనుకోవడం  అవివేకమే కానీ అయ్యే పని కాదు.
దీనినే భాస్కర శతక కర్త ఏమంటారో చూద్దాం.
"లోను దృఢంబు గాని పెను లోభినమ్మియు సాధ్య కార్యముల్/ గానక పూనునే నతడు గ్రక్కున గూలును నోటి పుట్టిపై/ మానవుడెక్కి పోవ నొక మాటు పుటుక్కున ముంపకుండునే/ దానొక లోతునం గడిపి దాని ధరింపగ లేక భాస్కరా!"
అంటే స్థిరమైన నడవడి లేని వాడిని నమ్మి గొప్ప కార్యమును సాధించాలని అనుకోవడం కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే అనగా ఓటి పడవను నమ్ముకుని మహా ప్రవాహమును దాటాలని ప్రయత్నం చేయడము లాంటిది అని అర్థము.
దీనికి దగ్గరగా ఉన్న మరో సామెత"తెప్పతో సముద్రము దాట ప్రయత్నించినట్లు" అంటే తెప్ప అనేది చాలా చిన్న పడవ.చాలా ప్రాచీనమైనది.దీనిని చేపలు పట్టుకోవడానికి,నీటి మీద కొంత దూరం ప్రయాణించడానికి ఉపయోగిస్తారు కానీ దానితో సముద్రం  దాటడమనేది చాలా కష్టంతో కూడుకున్న పని, సాధ్యం కాదు కూడా.
 తలపెట్టిన మహా కార్యం లేదా గొప్ప ఆశయంతో కూడిన పనిని అసమర్థులతో , అలవికాని వాటిని ఉపయోగించి చేయడం సాధ్యం కాదని ఈ "లాంగూలతరణ న్యాయము" ద్వారా గ్రహించవచ్చు.
 కాబట్టి " సహాయం పొందాలి అనుకున్నప్పుడు సమర్థులైన వారిని ఎంచుకోవాలి." అనే విషయాన్ని ఈ న్యాయము ద్వారా తెలుసుకుని కార్య సాధనకు పూనుకోవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు