న్యాయాలు -220
రాసభరటిత న్యాయము
*****
రాసభము అంటే గాడిద.రాస అంటే కలకల ధ్వని,శబ్దము.
గాడిద అఱపు మొదట దీర్ఘంగా, పెద్దగా మొదలై క్రమంగా రాన్రానూ సన్నగిల్లుతుంది.
దీనినే 'రాస భరుత న్యాయము'అని కూడా అంటారు.
గాడిద అఱపును ఓండ్ర పెట్టడం అంటారు. అది అరవడం మొదలు పెట్టడం గట్టిగా,కర్ణ కఠోరంగా ఉండి క్రమంగా తగ్గుతుంది.
గాడిద అఱపుతో ఉన్న ఈ "రాస భరటిత న్యాయము"ను ఆరంభశూరత్వానికి ఉదాహరణగా చెబుతుంటారు.
ఏదైనా పనిని మొదట అట్టహాసంగా ప్రారంభించి చివరిదాకా సమగ్రంగా పూర్తి కాకుండానే మధ్యలో వదిలేసేవారిని ఆరంభ శూరులు అంటారు.
'గాడిద అఱపు' అలాంటిది.పాపం అది మాత్రం ఏం చేయగలదు? .అఱపును అలా విమర్శిస్తూనే, దానిని ఎన్నో సామెతలతో,జాతీయాలతో ఉదహరిస్తూ మనవాళ్ళు తిడుతూ వుంటారు.
"అడ్డగాడిదలా వయసొచ్చింది/ ఏళ్ళు వచ్చాయి.సిగ్గులేదు" అని "అడ్డగాడిదలా పనీపాటా లేకుండా తిరుగుతున్నావ్" అని "కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టిందట" అని, "గాడిద గుడ్డు" అని,"వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకొన్నట్లు" అని,"గాడిద చాకిరి " అని ఇక బాగా పెద్ద పెద్ద శబ్దాలతో ఒకదానికొకటి పొంతన లేకుండా ఒకే చోట వినబడే గొంతులు విని "గాడిద గత్తర" అని, ఇలా గాడిద పేరుతో రకరకాల జాతీయాలు సామెతలను తెలుగు వాళ్ళు వాడుతూ ఉంటారు.
అలా జాతీయాలకూ, సామెతలకూ కేంద్ర బిందువైన గాడిద గురించి వివరాలు , విశేషాలు తెలుసుకుంటే మస్తు ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి.
అవేంటో చూద్దామా...
గుర్రంలా మనిషికి చేరువైన జంతువు గాడిద. కానీ గుర్రానికి ఇచ్చిన గౌరవం, ప్రాముఖ్యత అదేంటో మరి గాడిదకు ఇవ్వరు.
గాడిద చేసే చాకిరీ అంతా ఇంతా కాదు. అది ఎంతో కష్టజీవి. అత్యంత ఎక్కువ బరువును మోస్తుంది. కొండలు, గుట్టలు చక్కగా ఎక్కుతుంది.అందుకే దాని మీద సరుకులు,వస్తువుల మూటలు వేసి రవాణాకు ఉపయోగిస్తారు.
పూర్వము రజకుల దగ్గర ఉతికిన బట్టల మూటలు మోయడానికి గాడిదలు ఉండేవి.వారికే కాదు గొర్రెల కాపరులు కూడా గాడిదలను గొర్రెలకు కాపలాగా పెంచుకునే వారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గాడిదలు చాలా తెలివైనవట.వాటికి అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉందట. ఒక్కసారి తిరిగిన ప్రాంతాలను,తమ తోటి గాడిదలను పాతిక (25) సంవత్సరాల దాకా గుర్తు పెట్టుకుంటాయట.
మరో విశేషం ఏమిటంటే ప్రమాదాన్ని ముందుగానే పసిగడుతుందట.అలాంటప్పుడు తమ యజమాని ఎంత కొట్టినా,అదిలించినా కదలదట.
ఇదంతా విన్న చదివిన మనం వేమన గారి పద్యాన్ని తిరగేసి చదువుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన గారు" గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు" అన్నారు కానీ ఇప్పుడు గాడిద పాలకు మామూలు గిరాకీ లేదు మరి.గాడిద ఇచ్చే పాలు ఒక్క లీటరు ధరే వేలల్లో ఉంటుంది.కారణం ఆ పాలను ఔషధంగా ఆయుర్వేదంలోనూ, ఉబ్బసం అంటే ఆస్త్మా తగ్గడానికి ఉపయోగిస్తారు మరి.
మనం గాడిదల నుండి నేర్చుకోవాల్సిన గొప్ప గుణం. సంఘ జీవనం. తమ తోటి గాడిదలతో కలిసి మెలిసి సంతోషంగా గడుపుతాయి.
అలాంటి గాడిదలను అవసరాలకు, సేవలకు ఉపయోగించుకోవడమే కానీ వాటికి ఆరోగ్యం బాగా లేనప్పుడు వాటిని వదిలేస్తారు కానీ పాపం తన జీవితాన్ని మొత్తం అంకితం చేసినందుకు కనీసం వైద్యం కూడా చేయించరట మన మానవులు. అది గమనించి, వాటిని సంరక్షించే విధంగా జీవ కారుణ్య వాదులు వాటికీ ఓ రోజును ప్రకటించారు.అదే ప్రతి సంవత్సరం "మే (8)ఎనిమిదో తేదీని" "ప్రపంచ గాడిదల దినోత్సవం"గా(World Donkey Day) ప్రకటించారు.
గాడిద అఱపు ఎలా ఉన్నా గాడిద తెలివి తేటలను మనమూ పెంచుకుని,గాడిదలా కష్టపడుతూ "ఆరంభ శూరులమనే" "రాసభరటిత న్యాయము" లోని అపవాదును తొలగించుకొని తలపెట్టిన ఏ పనైనా విజయవంతంగా పూర్తి చేద్దాం. మీరు నాతో ఏకీభవిస్తారు కదూ!"
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి